ఇది ఆశ్చర్యం కాదుగానీ, ఆందోళన కలి గించే అంశం. వాస్తవిక నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) పొడవునా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) సైనిక దళాలతో మన సైనికుల ద్వంద్వ యుద్ధం కొనసాగుతూనే ఉందని ఇండో–టిబెటన్ పోలీస్ (ఐటీబీపీ) డైరెక్టర్ జనరల్ శత్రుజీత్ సింగ్ కపూర్ ఇటీవల వెల్లడించారు. ఈ ప్రతిష్టంభనలు జూలై నుంచి సాగుతున్నాయనీ, అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్నిచోట్ల ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నా యనీ అన్నారు. ఈ ఘటనలను చిన్నపాటివిగా కొట్టిపారేయడానికే రెండు దేశాలూ మొగ్గు చూపాయి.కానీ సైనిక ఉద్రిక్తతలు వాస్తవ మేనని వెల్లడైంది. నిజానికి, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రెండు నెలల క్రితం బీజింగ్‌లో సమావేశమయ్యారు. రెండు దేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య 25వ దఫా సంభాషణలు ఆగస్టు 25న ముగిశాక రెండు దేశాలు 8 అంశా లపై ఏకాభిప్రాయాన్ని వ్యక్తపరచాయి.
ఎనిమిది అంశాల్లో అంగీకారం
ఎల్‌ఏసీ వెంబడి శాంతి, సామరస్యాలను కొనసాగించాలని, ద్వైపాక్షిక సంబంధాల మధ్య స్థిరత్వాన్ని తీసుకురావాలన్నది మొదటి అంశం. పరస్పర అంగీకారయోగ్యమైన విధంగా 2005 ఒప్పందం కింద సరిహద్దుపై చర్చలను ముందుకు తీసుకెళ్ళాలన్నది రెండవ అంశం. సరిహద్దుల నిర్ధారణ, సరిహద్దు నిర్వహణపై రెండు కార్యాచరణ బృందాలు పనిచేయాలన్నది మూడవ అంశం. క్షేత్ర స్థాయిలో నెలకొనే ఎటువంటి పరిస్థితిపైనైనా వెంటనే ఇప్పు డున్న మార్గాల ద్వారా చర్చలు జరపాలనేది నాల్గవ అంశం.
తూర్పు, మధ్య రంగాలలో రెండు కొత్త సైనిక హాట్‌లైన్ చానల్స్ ఏర్పాటు చేయడం, రెండు నూతన సమావేశ స్థలాలను నిర్ణయించు కోవడం ఐదవ అంశం. సరిహద్దు వర్తకానికి నిర్దేశించుకున్న మూడు ప్రదేశాలను తిరిగి తెరవడం, కైలాస్ మానస్ సరోవర్ యాత్రను విస్తరింపజేయడం ఆరవ అంశం. సరిహద్దుకు రెండు వైపులా ప్రవ హిస్తున్న నదులపై నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడం ఏడవ అంశం. ప్రత్యేక ప్రతినిధుల మధ్య చర్చలను 2027లో భారతదేశంలో నిర్వహించాలనేది ఎనిమిదవ అంశం.
చైనా భాషలో చదివిన వాంగ్ యి ప్రకటన ఎక్కువ రాజకీయ ప్రయోజనాలను ఉద్దేశించినదిగా సాగింది. మోదీ–జిన్‌పింగ్ కజాన్‌లో సమావేశమైనప్పటి నుంచి ప్రగతిని రెండు పక్షాలు సాను కూలంగా సమీక్షించాయని వాంగ్ అన్నారు. సరిహద్దు వివాదాన్ని ‘ఎక్కడ ఉంచాలో అక్కడ’ ఉంచుదాం, పరస్పర కీలక ప్రయోజ నాలను దృష్టిలో పెట్టుకుందాం. ప్రత్యర్థులుగాకాక భాగస్వాము లుగా పరస్పరం గౌరవించుకునేందుకు ప్రయత్నిద్దాం’ అని ఆయన చెబుతూ వచ్చారు. బీజింగ్ దృష్టి కోణం నుంచి అది నూతనసిద్ధాంతం. ఐటీబీపీ చీఫ్ వెల్లడించిన వివరాలను బట్టి అది ఎంత వరకు పరీక్షకు నిలిచినదీ తెలుస్తూనే ఉంది.
చైనా కొత్త వాదన
ఏమాటకామాటే చెప్పుకోవాలి. భారత్ ఎలా స్పందించాలనే దానిపై కపూర్ కొన్ని విలువైన విధానపరమైన సూచనలు చేశారు. ప్రతి సరిహద్దు బెటాలియన్‌లోనూ డ్రోన్ ప్లాటూన్లను ఏర్పాటు చేయాలి. గల్వాన్ తరహా ముఖాముఖి పోరాటాలు జరిపేందుకు శౌర్య కమాండో దళాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎల్‌ఏసీ పొడవునా భూగర్భ బంకర్లు నెలకొల్పుకోవాలి. కపూర్ వ్యాఖ్యలను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఖండించలేదు. ‘సువ్యవస్థిత కాపలా తీరుతెన్నులకు భిన్నంగా చైనా దళాలు కొత్త పుంతలు తొక్కు తున్నప్పుడల్లా అడపాదడపా భారత్–చైనా సరిహద్దు ప్రాంతాల్లో అలజడితో కూడిన పరిస్థితి ఏర్పడుతూనే ఉంది’ అని అన్నారు.
ఆ తర్వాత మాత్రమే బీజింగ్ స్పందన వెలువడింది. ‘రెండు దేశాల మధ్య కుదిరిన ఉమ్మడి అవగాహనలకు చైనా కట్టుబడి ఉంది. ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని, స్థిరత్వాన్ని పరిరక్షించుకునేందుకు, సరిహద్దు ప్రాంతాల్లో సాధారణ సరిహద్దు పహరాను, నియంత్రణ కార్యకలాపాలను నిర్వహిస్తోంది’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గువో జియాకున్ అక్టోబర్ 26న ప్రకటించారు. ఆగస్టులో వాంగ్, అక్టోబర్‌లో గువో చెప్పిన మాటలను గమనిస్తే ఒకటేసారాంశం బోధపడుతుంది: మేం ఏకాభిప్రాయానికి కట్టుబడిఉంటాం. సాధారణంగానే పహరా తిరుగుతాం. భారత్ బాట నుంచి వైదొలగినపుడే అలజడి ఏర్పడుతుంది.
ఇది పొందికైన మాటలతో కూడిన ప్రకటన. తోసిపుచ్చడం కష్టం. ఎల్‌ఏసీపై ఉన్న భిన్నాభిప్రాయాలను రెండు పక్షాలు 1993 నుంచి గుర్తిస్తూ వస్తున్నాయి. ఇపుడు చైనా దానిని మార్చే ప్రయత్నం చేస్తోంది. తాను సూత్రాలకు కట్టుబడి ఉన్నట్లుగా, భారత్ మాత్రమే పక్కకు వైదొలగుతున్నట్లుగా మాట్లాడుతోంది. రెండు కొత్త హాట్ లైన్లను ఏర్పాటు చేయడం వంటి మర్యాదలను కాగితాలకు పరి మితం చేసి, ఆచరణలో వాటిని ఉల్లంఘించడం నూతన వాస్తవికత.
ఉక్రెయిన్–ఇరాన్ పాఠాలు
సైనిక డ్రోన్ కార్యక్రమాలను చైనా పెద్ద యెత్తున అనుసరిస్తోంది. జియు తియాన్ వంటి మాతృనౌక వేదికలకు రూపకల్పన చేస్తోంది. ఆకాశంలోని వాహక నౌక నుంచి కుప్పతెప్పలుగా డ్రోన్లు వెలువడతాయన్నమాట! దాని వాణిజ్యపరమైన డ్రోన్ పరిశ్రమ కూడా విస్తారమైనది. దానికి భిన్నంగా భారత్ ఓ మోస్తరు ఎత్తులో పయనించగలిగిన మానవ రహిత వైమానిక (మేల్) డ్రోన్లను తక్కువ సంఖ్యలో నిర్వహిస్తోంది. 31 ఎంక్యూ–9బిలకు 2024 అక్టోబర్‌లోనే ఆర్డరు పెట్టింది. ఈ దశాబ్ద అంతం నాటికి అవిఅందడం మొదలవుతుందని భావిస్తున్నారు.
ఖరీదైన ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిప ణుల ద్వారాకాక, శతఘ్నులు, ఇంటర్‌సెప్టర్ డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ ద్వారా డ్రోన్లను అత్యధిక సంఖ్యలో ఉక్రెయిన్ కూల్చివేయ గలిగింది. చౌక రకం షహీద్ డ్రోన్లను మూకుమ్మడిగా ప్రయోగిస్తూ వాటి విలువకన్నా ఎక్కువ నష్టాన్ని ఇరాన్ సృష్టించగలిగింది. భారత్ 2025 మేలో ఆపరేషన్ సిందూర్ సందర్భంగా దీన్ని ప్రత్యక్షంగా కూడా గ్రహించింది. అందుకే డీఆర్‌డీఓ రూపొందించిన డి4 సిస్టం కూడా భారత్ నుంచి సరైన సమాధానం కాగలదు.
భారత్ రక్షణ సామగ్రి ఉత్పత్తి 2025–26లో రూ. 1.78 లక్షల కోట్లకు చేరుకుంది. దీనిలో ప్రైవేటు రంగ వాటా 24%. కానీ,ఇంజిన్లు, చిప్‌లను ఇప్పటికీ దిగుమతి చేసుకుంటున్నాం. 2024లో నిర్వహించిన ఆడిట్‌లో 400 మంది భారతీయ విక్రేతలు విక్రయించిన డ్రోన్లలో చైనా విడి భాగాలు ఉన్నట్లు కనుగొన్నారు. అందుకే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా పార్టులను ఒక్కటి కూడా ఉపయోగించకూడదని చెప్పారు. చిన్న, మధ్య తరహా సంస్థలు 2028 నాటికి చౌక రకానికి చెందిన 2 లక్షల డ్రోన్లను తయారు చేయగలగాలని లక్ష్యంగా నిర్దేశించారు. రెండు పక్షాలు చెబుతున్న ట్లుగా ఎల్‌ఏసీ పొడవునా శాంతి అవసరమే. కానీ, శత్రు దేశం దాని బాట నుంచి పక్కకు వచ్చినపుడు సరైన బుద్ధి చెప్పగల తక్కువ వ్యయ దాయకమైన డ్రోన్లు, షూటర్ సామగ్రి అత్యవసరం.
తానే సూత్రాలకు కట్టుబడి ఉన్నట్లుగా, భారత్ పక్కకు వైదొలగుతున్నట్లుగా చైనా మాట్లాడుతోంది.ఈ కొత్త చైనాను ఇండియా ఎదుర్కోవాల్సి ఉంది.

-వ్యాసకర్త ‘సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్’ డైరెక్టర్, న్యూఢిల్లీ
- సి. ఉదయ్ భాస్కర్


