దూకుడు కొనసాగనీ... | India to face New Zealand in the fourth T20 today | Sakshi
Sakshi News home page

దూకుడు కొనసాగనీ...

Oct 30 2026 4:20 AM | Updated on Oct 30 2026 4:20 AM

India to face New Zealand in the fourth T20 today

మరో విజయంపై భారత్‌ గురి 

నేడు న్యూజిలాండ్‌తో నాలుగో టి20 

తీవ్ర ఒత్తిడిలో కివీస్‌ 

మధ్యాహ్నం 12:30 నుంచి సోనీ స్పోర్ట్స్, సోనీ లివ్‌లలో ప్రసారం  

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ మూడు మ్యాచ్‌లకే భారత్‌ సొంతమైంది. అంచనాలు పెట్టుకున్న కీలక బ్యాటర్లంతా చెలరేగి తమ స్థాయిని ప్రదర్శించారు. బౌలర్లు భారీగా పరుగులిచ్చినా... జట్టు విజయాలకు అది సమస్య కాలేదు. ఇక మిగిలిన రెండు టి20ల్లో భారత్‌ వ్యూహం ఎలా ఉండబోతుందో, ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడంలో మేనేజ్‌మెంట్‌ ఆలోచనలేమిటనేది చర్చనీయాంశంగా మిగిలింది. మరో వైపు సొంతగడ్డపై అనూహ్యంగా ఓడి ఇప్పటికే 0–3తో చిత్తయిన న్యూజిలాండ్‌ కోలుకొని ఏమాత్రం పోటీనిస్తుందనేది చూడాలి. 

ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు నాలుగో టి20కి రంగం సిద్ధమైంది. బుధవారం నుంచి జరిగే వన్డే సిరీస్‌నుంచి దృష్టిలో ఉంచుకొని కొందరు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చే అవకాశాన్ని భారత్‌ పరిశీలిస్తోంది. మ్యాచ్‌కు ముందు రోజు గురువారం కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మినహా మిగతా ఆటగాళ్లంతా సాధన చేశారు. మరో వైపు ఆక్లాండ్‌ తొలి వన్డేకు వేదిక కావడంతో ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్, కేఎల్‌ రాహుల్‌ కూడా సహచరులతో కలిసి ప్రాక్టీస్‌ చేశారు.  

భారత ఆటగాళ్లలో శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్, వరుణ్‌ చక్రవర్తి ఈ సిరీస్‌లో ఇంకా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. కాబట్టి వీరికి ఈ మ్యాచ్‌లో చాన్స్‌ దక్కవచ్చు. వన్డే టీమ్‌లో ఉన్న నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్, అర్‌‡్షదీప్‌ సింగ్‌లను పక్కన పెట్టి ఈ ముగ్గురిని ఆడించే అవకాశం ఉంది. టాప్‌–6 వరకు టీమ్‌ తిరుగులేని బ్యాటింగ్‌ బలంతో కనిపిస్తోంది. 

అయితే కెప్టెన్‌గా సిరీస్‌ను గెలిపించినా...బ్యాటర్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ నుంచి చాలా రోజులుగా చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. గత ఆరు టి20ల్లో అతను ఒకటే మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించే ప్రదర్శన కనబర్చాడు. ఈ సారైనా అతను చెలరేగాల్సి ఉంది. సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ మూడు మ్యాచ్‌లలోనూ విఫలమైనా...అతడిని చివరి రెండు మ్యాచ్‌లలోనూ ఆడించడం ఖాయమే. ఇషాన్‌ కిషన్‌ గాయంనుంచి పూర్తిగా కోలుకుంటే ఎవరిని తప్పించి అతడిని ఆడిస్తారనేది చూడాలి.  

న్యూజిలాండ్‌ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. 2019–20 సీజన్‌లో 0–5తో ఇదే తరహాలో స్వదేశంలోనే భారత్‌ చేతిలోనే చిత్తయిన కివీస్‌ మళ్లీ అది పునరావృతం కారాదని భావిస్తోంది. అందు కోసం కనీసం ఈ మ్యాచ్‌లోనైనా నెగ్గాలని పట్టుదలగా ఉంది. మూడు మ్యాచ్‌లలోనూ కివీస్‌ మరీ పేలవ ప్రదర్శన ఏమీ చేయలేదు కానీ భారత బ్యాటింగ్‌ విధ్వంసం ముందు అది తేలిపోయింది. పేసర్లు పూర్తి విఫలం కావడంతో పాటు ఫీల్డింగ్‌ కూడా జట్టుకు సమస్యగా మారింది. మిల్నే, డఫీ, ఫిషర్, టిక్‌నర్‌ భారత్‌ను ఏమాత్రం నిలువరిస్తారో చూడాలి. బ్యాటింగ్‌లో జాకబ్స్‌ మాత్రమే నిలకడగా రాణించాడు. ఓపెనర్లు సీఫెర్ట్, అలెన్‌ చెలరేగితే తప్ప జట్టుకు విజయావకాశాలు కనిపించడం లేదు.

ఈడెన్‌ పార్క్‌ మైదానం దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది. నేరుగా ఉండే బౌండరీలు కనీస అంతర్జాతీయ ప్రమాణాలకంటే చాలా చిన్నవిగా ఉండగా, వికెట్‌కు ఇరు వైపులా బౌండరీలు చాలా పెద్దవి. దీన్ని బట్టి వ్యూహాలు మార్చుకోవాల్సి ఉన్నా... భారీ స్కోర్లకు అవకాశం ఉంది.  మ్యాచ్‌ రోజు వర్ష సూచన లేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement