సార్‌బ్రకెన్ (జర్మనీ): బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–500 టోర్నీ హైలో ఓపెన్‌లో భారత స్టార్ పీవీ సింధు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గత వారం ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధు అదే జోరును కొనసాగించింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో సింధు 21–9, 21–6 స్కోరుతో రోజీ ఆక్టివా (ఫ్రాన్స్)ను చిత్తుగా ఓడించింది. 26 నిమిషాల్లోనే సింధు మ్యాచ్‌ను ముగించడం విశేషం. క్వార్టర్ ఫైనల్ పోరులో అమేలీ షుల్ (డెన్మార్క్)తో తలపడుతుంది.
మరో భారత ప్లేయర్ మాళవిక బన్సోద్ రెండో రౌండ్‌లో 11–21, 17 21 తేడాతో వెన్ జాంగ్ (కెనడా) చేతిలో ఓడి నిష్క్రమించింది. ఇషారాణి బారువా కూడా 14–21, 19–21తో ఎనిమిదో సీడ్ లైన్ హోమార్క్ (డెన్మార్క్) చేతిలో పరాజయంపాలైంది. పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్, ఏడో సీడ్ లక్ష్యసేన్ కూడా ప్రిక్వార్టర్స్‌కు చేరాడు. రెండో రౌండ్‌లో అతను భారత్‌కే చెందిన కిరణ్ జార్జ్‌ను 21–15, 18–21, 21–12 స్కోరుతో ఓడించాడు.


