పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్ సింధు 21–13, 21–14తో ప్రపంచ 24వ ర్యాంకర్ చియు పిన్ చియాన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. ఇటీవల ఆసియా క్రీడల్లో చియు పిన్ చియాన్‌పై వరుస గేముల్లో నెగ్గిన సింధు అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రెండు గేముల్లోనూ సింధుకు అంతగా ప్రతిఘటన ఎదురుకాలేదు. నేడు జరిగే సెమీఫైనల్లో హినా అకెచి (జపాన్)తో సింధు ఆడుతుంది.
ఈ ఏడాది సింధు నాలుగో టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. జూలైలో జపాన్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన సింధు.... ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, మలేసియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లో ఓడిపోయింది. మరోవైపు భారత్‌కే చెందిన అష్మిత చాలిహా పోరాటం ముగిసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, మూడుసార్లుప్రపంచ చాంపియన్ అకానె యామగుచి (జపాన్)ను ఓడించిన అష్మిత... అదే జోరును క్వార్టర్ ఫైనల్లో కనబర్చలేకపోయింది. ప్రపంచ మాజీ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో అష్మిత 10–21, 21–17, 16–21తో పోరాడి ఓడిపోయింది.


