ఈ–20 పెట్రోల్‌పై కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడి
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు సరఫరా చేస్తున్న ఈ20పెట్రోల్ నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ స్పష్టం చేసింది. పెట్రోల్‌లో 26 నుంచి 31 శాతం వరకు ఇథనాల్ కలుపుతున్నారంటూ కర్ణాటక ప్రభుత్వం చేసిన ప్రకటనపై స్పందించిన కేంద్రం.. నిబంధనల ప్రకారం నిర్వహించిన పరీక్షల్లో అలాంటి అంశాలు నిర్ధారణ కాలేదని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సేకరించిన 893 నమూనాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని పెట్రోలియం శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఆయిల్ కంపెనీల అభ్యంతరం
కర్ణాటక ప్రభుత్వ ప్రకటనపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ ఆరోపణలు నిర్దేశిత చట్టబద్ధమైన, సాంకేతిక పరీక్షా విధానాలకు అనుగుణంగా లేవని పేర్కొన్నాయి.


