వాహన చట్టానికి సవరణలు
న్యూఢిల్లీ: పూర్తిగా ఇథనాల్‌పై (ఈ100) నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలను కూడా ప్రవేశపెట్టేందుకు వీలుగా సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989కి సవరణలను కేంద్ర రహదారి రవాణా శాఖ సోమవారం నోటిఫై చేసింది. ఈ85, ఈ100 వాహనాల ఉద్గారాలు, భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఇందులో నిబంధనలను సవరించారు.
దీని ప్రకారం ఈ20కి మించి (ఇథనాల్ 20 శాతం కలిపిన పెట్రోల్) ఈ100 వరకు ఇంధనాలపై నడిచే వాహనాలు ప్రత్యేకంగా ఆయా ఇంధనాలకు అనుగుణంగా తయారైనవై, సరి్టఫికేషన్ పొందినవై ఉండాలని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఈ20 లేదా సాధారణ ఇంధనాన్ని ఉపయోగించే వాహనాల్లో ఈ85 లేదా ఈ100 ఫ్యూయల్‌ని వాడటానికి ఉండదని వివరించారు. మారుతీ సుజుకీ ఇటీవలే వాగన్ ఆర్ మోడల్‌లో దేశీయంగా తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ప్రవేశపెట్టింది.
టయోటా, టాటా మోటార్స్, హ్యుందాయ్ తదితర సంస్థలు కూడా ఈ తరహా వాహనాలను రూపొందిస్తున్నాయి. అలాగే ద్విచక్ర వాహనాల సంస్థ హీరో మోటోకార్ప్ సైతం రెండు మోడల్స్‌ని అందుబాటులోకి తెచ్చింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా క్రూడాయిల్ రేట్లు భారీగా పెరగడంతో దిగుమతులను తగ్గించుకునేలా భారత్.. ప్రత్యా మ్నాయ ఇంధన వనరులను అభివృద్ధి చేసుకోవడంపై దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు, బయోడీజిల్ సంబంధ నిబంధనలను కూడా ఈ నోటిఫికేషన్‌లో అప్‌డేట్ చేశారు. ఇక, తేలికపాటి పెట్రోల్, డీజిల్ వాహనాల కనీస బరువు పరిమితులను 3,000 కేజీల నుంచి 3,500 కేజీలకు పెంచారు.


