రూ. 1.69 లక్షలకు డౌన్
పసిడి రూ.1,400 క్షీణత
అంతర్జాతీయంగా సెంటిమెంట్ బలహీనంగా ఉండటం, రూపాయి బలపడటం తదితర కారణాలతో మంగళవారం దేశీ మార్కెట్లో వెండి, పసిడి రేట్లు క్షీణించాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 9,500 (5.3%) పతనమై రూ. 1.69,000కు పడిపోయింది. ఇది ఏడాది కనిష్ట స్థాయి. చివరిసారిగా గతేడాది నవంబర్ 13న వెండి రేటు ఈ స్థాయి వద్ద ట్రేడయ్యింది. నవంబర్ 5 నుంచి ఎనిమిది సెషన్లలో వెండి ధర ఏకంగా రూ. 25,000 (దాదాపు 13 శాతం) క్షీణించింది.
మరోవైపు, పసిడి రేటు వరుసగా ఆరో సెషన్లోనూ తగ్గింది. 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,400 క్షీణించి రూ. 1,38,600కి చేరింది. నవంబర్ 9 నుంచి పుత్తడి రేటు రూ. 8,300 (దాదాపు 6%) మేర తగ్గింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.51 స్థాయికి బలపడటం కూడా పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇక అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర పెద్దగా మార్పు లేకుండా 3,856 డాలర్ల వద్ద, వెండి 1% పెరిగి 47.44 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.
ఇదీ చదవండి: వాట్సాప్‌లోనే ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్


