బంగారం లాంటి వెండి! సగానికి పడిపోయింది.. | Silver prices have fallen so sharply From above Rs 4 lakh to below half | Sakshi
Sakshi News home page

బంగారం లాంటి వెండి! సగానికి పడిపోయింది..

Nov 16 2026 8:45 PM | Updated on Nov 16 2026 9:14 PM

Silver prices have fallen so sharply From above Rs 4 lakh to below half

వెండి ధరలు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో కిలో వెండి ధర రూ.4 లక్షల మైలురాయిని దాటగా.. ప్రస్తుతం రూ.1.69 లక్షల స్థాయికి పడిపోయింది. అంటే గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 58 శాతం మేర విలువ కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ వెండి ధరలు ఏడాది కనిష్ఠ స్థాయులకు చేరడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.

డాలర్‌ బలపడటంతో ఒత్తిడి

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (ఎంసీఎక్స్‌)లో డిసెంబర్‌ డెలివరీ వెండి ఫ్యూచర్స్‌ నవంబర్‌ 16న భారీగా నష్టపోయాయి. కిలోకు రూ.1,69,000 స్థాయికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో కామెక్స్‌ వెండి ధర ఔన్స్‌కు 47 డాలర్ల దిగువకు పడిపోయింది. ఈ ఏడాది జనవరిలో నమోదైన రికార్డు గరిష్ఠాలతో పోలిస్తే వెండి ధరల్లో భారీ దిద్దుబాటు చోటుచేసుకుంది. అమెరికా డాలర్‌ బలపడటం, ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరగడం, ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌) నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లడం ఇందుకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

పారిశ్రామిక డిమాండ్‌పైనా ఆందోళన

వెండికి పెట్టుబడి సాధనంగానే కాకుండా పారిశ్రామికంగా కూడా ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా సౌర విద్యుత్‌ ప్యానెళ్లు, ఎలక్ట్రానిక్స్‌, ఏఐ ఆధారిత మౌలిక సదుపాయాల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. అయితే అధిక ధరల కారణంగా కొన్ని రంగాల్లో వెండి వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు 2026లో ప్రపంచవ్యాప్తంగా వెండి డిమాండ్‌ 5 శాతం తగ్గవచ్చని మెటల్స్‌ ఫోకస్‌ అంచనా వేసింది. దీంతో వెండి ధరలపై ఒత్తిడి కొనసాగుతోంది.

మరింత తగ్గుతుందా?

ఎంసీఎక్స్‌లో కిలో వెండికి రూ.1,55,000 కీలక మద్దతు స్థాయిగా, రూ.1,90,000 తక్షణ నిరోధక స్థాయిగా మార్కెట్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌కు 40 డాలర్ల వద్ద మద్దతు ఉండగా, 55 డాలర్ల స్థాయి నిరోధకంగా ఉండవచ్చని అంచనా. మరోవైపు కామెక్స్‌లో 46–46.50 డాలర్ల పరిధి తక్షణ మద్దతుగా, 44–44.50 డాలర్ల పరిధి తదుపరి మద్దతుగా ఉంది. ధరలు మళ్లీ కోలుకోవాలంటే 49 డాలర్ల స్థాయిని అధిగమించి నిలదొక్కుకోవాల్సి ఉంటుందని ఎన్రిచ్‌ మనీ సీఈఓ పొన్ముడి ఆర్‌ అభిప్రాయపడ్డారు.

బంగారం ధరలకూ తప్పని దెబ్బ

వెండితో పాటు బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే ఎక్కువగా నమోదవడంతో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచవచ్చన్న అంచనాలు బలపడ్డాయి. డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపునకు 91 శాతం అవకాశముందని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. దీంతో బంగారం వంటి వడ్డీ ఆదాయం ఇవ్వని పెట్టుబడులపై ఆసక్తి తగ్గుతోంది. నవంబర్‌ 16న ఎంసీఎక్స్‌లో డిసెంబర్‌ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 10 గ్రాములకు రూ.1,35,159 వద్ద ట్రేడయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్‌ బంగారం ఔన్స్‌కు 3,900 డాలర్ల దిగువకు చేరి ఏడాది కనిష్ఠ స్థాయిని తాకింది. అయితే భారత్‌లో పెళ్లిళ్ల సీజన్‌ డిమాండ్‌, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు బంగారం ధరలకు కొంత మద్దతు ఇవ్వవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: బంగారం ధరలు.. వచ్చే ఏడాది ఇంకా తక్కువకు!!

ముందున్నది కీలక సమయం

ప్రస్తుతం బంగారం, వెండి ధరల భవిష్యత్‌ కదలికలు అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలు, డాలర్‌ విలువ, బాండ్‌ రాబడులు, పెట్టుబడుల ప్రవాహాలపై ఆధారపడి ఉండనున్నాయి. పారిశ్రామిక డిమాండ్‌ దీర్ఘకాలంలో వెండికి మద్దతుగా నిలిచే అవకాశం ఉన్నప్పటికీ, సమీప కాలంలో మాత్రం ధరల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఈ కింద చూడొచ్చు..

gold1
1/6

gold2
2/6

gold3
3/6

gold4
4/6

silver5
5/6

silver6
6/6

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement