బెంగళూరులో ఖరీదైన స్థలాలు కొనేసిన మీషో సీఈవో.. | Meesho CEO Vidit Aatrey buys Bengaluru plots from Byju Raveendrans family | Sakshi
Sakshi News home page

బెంగళూరులో ఖరీదైన స్థలాలు కొనేసిన మీషో సీఈవో..

Nov 16 2026 6:51 PM | Updated on Nov 16 2026 7:10 PM

Meesho CEO Vidit Aatrey buys Bengaluru plots from Byju Raveendrans family

ఈ-కామర్స్‌ సంస్థ మీషో సహ వ్యవస్థాపకుడు, సీఈవో విదిత్‌ ఆత్రే బెంగళూరులో ఏకంగా రూ.83.81 కోట్ల విలువైన రెండు విలాసవంతమైన నివాస స్థలాలను కొనుగోలు చేశారు. తూర్పు బెంగళూరులోని యమలూర్‌ ప్రాంతంలో ఉన్న ప్రముఖ గేటెడ్‌ కమ్యూనిటీ ఎప్సిలాన్‌లో ఈ లావాదేవీలు జరిగాయి. ఈ రెండు స్థలాలను ఎడ్యుటెక్‌ సంస్థ బైజూస్‌ సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్‌, మాజీ హెచ్‌ఆర్‌ హెడ్‌ దీప్త అఖిల రాఘవన్‌ విక్రయించారు.

రిజిస్ట్రేషన్‌ వివరాల ప్రకారం.. 18,305 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న స్థలాన్ని దివ్య గోకుల్‌నాథ్‌ రూ.48.11 కోట్లకు విక్రయించారు. మరో 15,180 చదరపు అడుగుల స్థలాన్ని దీప్త అఖిల రాఘవన్‌ రూ.35.70 కోట్లకు అమ్మారు. మొత్తంగా 33,485 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ రెండు పక్కపక్కనే ఉన్న స్థలాలకు ఆత్రే రూ.83.81 కోట్లు చెల్లించారు. అంటే సగటున చదరపు అడుగుకు సుమారు రూ.25,029 ధర పలికింది. జాప్కీ సేకరించిన రిజిస్ట్రేషన్‌ పత్రాల ఆధారంగా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

బైజూస్‌ ఆర్థిక సంక్షోభం, రుణ వివాదాల నేపథ్యంలో ఈ కొనుగోళ్లు జరిగడం గమనార్హం. అందుకే విక్రయ ఒప్పందాల్లో భూములపై ప్రైవేటు యాజమాన్య హక్కులు ఉన్నాయని, రుణదాతలు లేదా ఇతర సంస్థల నుంచి ఎలాంటి చట్టపరమైన అభ్యంతరాలు, జప్తు క్లెయిమ్‌లు లేవని విక్రేతలు హామీ ఇచ్చే నిబంధనలను చేర్చినట్లు సమాచారం. భవిష్యత్తులో ఏవైనా చట్టపరమైన సమస్యలు తలెత్తితే కొనుగోలుదారుకు రక్షణ కల్పించేలా నష్టపరిహార నిబంధనలకూ ప్రాధాన్యం ఇచ్చారు. బైజూస్‌ ప్రమోటర్లకు సంబంధించిన ఆస్తుల విక్రయాల్లో చట్టపరమైన భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, ఈ భారీ రియల్‌ ఎస్టేట్‌ ఒప్పందాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement