రూ.1,100 కోట్ల అప్పు ముందే తీర్చేసిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ | Real Estate House of Abhinandan Lodha Prepays Rs 1100-Crore Loan Strong Plot Sales | Sakshi
Sakshi News home page

రూ.1,100 కోట్ల అప్పు ముందే తీర్చేసిన రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ

Nov 15 2026 8:05 PM | Updated on Nov 15 2026 8:12 PM

Real Estate House of Abhinandan Lodha Prepays Rs 1100-Crore Loan Strong Plot Sales

రియల్ ఎస్టేట్ సంస్థ  ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ (HoABL) కీలక ఆర్థిక మైలురాయిని చేరుకుంది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ అడ్వైజర్స్‌కు రూ.1,100 కోట్ల అప్పును గడువు కంటే ముందుగానే తిరిగి చెల్లించింది. దీంతో తమ ఉమ్మడి పెట్టుబడి వేదికలోని ఐదు ప్రాజెక్టుల నుంచి హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ పెట్టుబడిని ఉపసంహరించుకునేందుకు వీలైంది. ప్రాజెక్టుల ముందస్తు పూర్తితో వచ్చిన నగదు ప్రవాహాలు ఈ చెల్లింపునకు దోహదపడ్డాయని కంపెనీ వెల్లడించింది.

2023లో ఈ రియల్ ఎస్టేట్ సంస్థ, హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ కలిసి ఈ పెట్టుబడి వేదికను ఏర్పాటు చేశాయి. దేశంలోని ప్రధాన నగరాలు, ద్వితీయ శ్రేణి పట్టణాలు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భూముల అభివృద్ధి, తక్కువ అంతస్తుల నివాస ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం దీని లక్ష్యం. ఈ వేదిక కింద 11 ప్రాజెక్టుల కోసం హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ సుమారు రూ.1,500 కోట్ల పెట్టుబడికి హామీ ఇచ్చింది. ఇందులో ఇప్పటివరకు రూ.1,100 కోట్లను ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ తిరిగి చెల్లించింది.

ప్లాటెడ్ డెవలప్‌మెంట్స్ (నివాస స్థలాల అభివృద్ధి), తక్కువ అంతస్తుల ఇళ్లు, అందుబాటు ధరల గృహాలు, మధ్యతరగతి నివాస ప్రాజెక్టులపై దృష్టి సారించడం ద్వారా ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ రియల్ ఎస్టేట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిందని హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ సీఈఓ విపుల్ రూంగ్టా పేర్కొన్నారు. ప్రారంభ దశ నుంచే సంస్థలో పెట్టుబడులు పెట్టామని, భవిష్యత్తులోనూ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ చైర్మన్ అభినందన్ లోధా ఈ ముందస్తు చెల్లింపును కీలక మైలురాయిగా అభివర్ణించారు.

2020లో ప్రారంభమైన ‘హౌస్ ఆఫ్ అభినందన్ లోధా’ ప్రధానంగా నివాస స్థలాల అభివృద్ధిపై పనిచేస్తోంది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇప్పటివరకు ఐదు రాష్ట్రాల్లో 1.3 కోట్ల చదరపు అడుగులకు పైగా స్థలాలను విక్రయించింది. మరో 2.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.

హెచ్‌డీఎఫ్‌సీ క్యాపిటల్ అనేది హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ సంస్థ. హెచ్‌డీఎఫ్‌సీ గ్రూప్‌కు చెందిన రియల్ ఎస్టేట్ ప్రైవేట్ ఈక్విటీ విభాగంగా ఇది ప్రధానంగా అఫర్డబుల్‌, మధ్యతరగతి గృహ నిర్మాణ ప్రాజెక్టులకు పెట్టుబడులు సమకూరుస్తోంది.

ఇదీ చదవండి: బెంగళూరులో అద్దె ఇల్లు.. వింత షరతులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement