సైబర్‌ట్రక్‌కు మరో ఛాన్స్.. మస్క్ సంచలన నిర్ణయం! | Tesla Extends Cybertruck Production Through End Of Summer 2027 | Sakshi
Sakshi News home page

సైబర్‌ట్రక్‌కు మరో ఛాన్స్.. మస్క్ సంచలన నిర్ణయం!

Nov 15 2026 12:26 PM | Updated on Nov 15 2026 12:49 PM

Tesla Extends Cybertruck Production Through End Of Summer 2027

టెస్లా సైబర్‌ట్రక్ ఉత్పత్తి విషయంలో.. ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2027 మధ్యలోనే ఈ వాహనం తయారీని నిలిపివేస్తామని ప్రకటించిన కొన్ని రోజుల తరువాత.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. 2027 వేసవి చివరి వరకు సైబర్‌ట్రక్ ఉత్పత్తిని కొనసాగిస్తామని వెల్లడించారు.

సైబర్‌క్యాబ్ ఉత్పత్తి
నిజానికి టెక్సాస్‌లోని గిగాఫ్యాక్టరీలో సైబర్‌ట్రక్ తయారీని తగ్గించి, ఆ స్థానంలో సైబర్‌క్యాబ్ ఉత్పత్తిని పెంచాలని టెస్లా భావిస్తోంది. సైబర్‌క్యాబ్ అనేది డ్రైవర్ అవసరం లేకుండా ప్రయాణించేలా రూపొందిస్తున్న రోబోటాక్సీ వాహనం. అయితే.. సైబర్‌ట్రక్ కోసం ఇంకా చాలా ఆర్డర్లు పెండింగ్‌లో ఉండటంతో, వాటిని పూర్తి చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని మస్క్ నిర్ణయించారు. లేదంటే.. వాహనాలు అందించలేని కస్టమర్లకు బుకింగ్ సమయంలో చెల్లించిన డిపాజిట్లను తిరిగి ఇవ్వాల్సి రావచ్చు.

ఉత్పత్తిని పొడిగించడం వల్ల కంపెనీకి పెద్దగా లాభం ఉండకపోవచ్చని కూడా మస్క్ కూడా అంగీకరించారు. లాభాలను పెంచుకునే కోణంలో చూస్తే ఇది అంత తెలివైన నిర్ణయం కాకపోవచ్చని, అయితే వ్యాపారంలో కొంత భావోద్వేగానికి కూడా చోటు ఉండాలని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

సైబర్‌ట్రక్ అమ్మకాలు మొదట అనుకున్న స్థాయిలో లేకపోయినా.. దాని ప్రత్యేకమైన స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, విభిన్నమైన డిజైన్ కారణంగా వాహన ప్రియులను ఆకట్టుకుంది. మరోవైపు సైబర్‌ట్రక్ విషయంలో మస్క్ పెట్టుకున్న అమ్మకాల లక్ష్యాలు ఇప్పటివరకు అందుకోలేకపోయారు.

అమ్మకాలు ఇలా..
ప్రారంభంలో ఏడాదికి 2.5 లక్షల వాహనాలను విక్రయించాలని గతంలో లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 2023 చివర్లో డెలివరీలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం అమ్మకాలు సుమారు 70 వేల యూనిట్లేనని పరిశ్రమ అంచనాలు చెబుతున్నాయి. తాజా నిర్ణయంతో ఉత్పత్తి మరికొంత కాలం కొనసాగనున్నప్పటికీ, 2027 తర్వాత కూడా ఈ వాహనాన్ని తయారు చేస్తారా లేదా అనే దానిపై టెస్లా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

ఇదీ చదవండి: CNG వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన ధరలు!

ఇక సైబర్‌ట్రక్ ఉత్పత్తిని నిలిపివేయాలన్న ఆలోచనపై అభిమానులు, యజమానుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఈ వాహనం తయారీ కొనసాగించాలని కోరుతూ 5,000 మందికి పైగా ఒక పిటిషన్‌పై సంతకాలు చేశారు. మరోవైపు టెస్లా వాహనాలకు యాక్సెసరీలు తయారు చేసే అన్‌ప్లగ్డ్ పెర్ఫార్మెన్స్ సంస్థ కూడా పెట్టుబడిదారుల సహకారంతో సైబర్‌ట్రక్ ఉత్పత్తిని తామే చేపట్టే అవకాశాలను పరిశీలిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement