రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్.. అలాంటి ఇళ్లకే డిమాండ్! | Hyderabad Real Estate Demand for Luxury Homes Surges Despite Dip in Registrations | Sakshi
Sakshi News home page

రియల్ ఎస్టేట్‌లో కొత్త ట్రెండ్.. అలాంటి ఇళ్లకే డిమాండ్!

Nov 15 2026 11:09 AM | Updated on Nov 15 2026 11:20 AM

Hyderabad Real Estate Demand for Luxury Homes Surges Despite Dip in Registrations

నగర రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. ఇళ్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య పెద్దగా పెరగకపోయినా, కొనుగోలు చేస్తున్న ఇళ్ల విలువ మాత్రం పెరుగుతోంది. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం 2026 జనవరి-అక్టోబర్ మధ్య హైదరాబాద్‌లో 61,033 నివాస ఆస్తులు రిజిస్ట్రేషన్ కాగా, వాటి మొత్తం విలువ రూ.44,305 కోట్లకు చేరింది. గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్లు కేవలం 1 శాతం తగ్గినా, లావాదేవీల విలువ మాత్రం 3 శాతం పెరగడం గమనార్హం. మార్కెట్లో ఖరీదైన ఇళ్ల వాటా పెరగడం ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.

అక్టోబర్‌లో మందగమనం
అక్టోబర్ 2026లో మొత్తం 5,318 ఇళ్లు రిజిస్ట్రేషన్ కాగా.. ఇది ఏడాది క్రితంతో పోలిస్తే 14 శాతం తక్కువ. లావాదేవీల విలువ రూ.4,395 కోట్లుగా నమోదైంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు కొనసాగిన పితృపక్ష కాలంలో చాలామంది కొనుగోలుదారులు ఆస్తి లావాదేవీలను వాయిదా వేసుకోవడం ఇందుకు ఒక కారణంగా నివేదిక పేర్కొంది.

కోటి రూపాయల పైబడిన ఇళ్లకే డిమాండ్
మార్కెట్లో అత్యంత ఆసక్తికరమైన మార్పు ప్రీమియం సెగ్మెంట్‌లో కనిపించింది. రూ.50 లక్షలలోపు ఇళ్ల రిజిస్ట్రేషన్లు 2% తగ్గాయి. రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి మధ్య ఇళ్ల రిజిస్ట్రేషన్లు 1% తగ్గాయి. రూ.1 కోటి పైబడిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు మాత్రం 1% పెరిగాయి.

ఇంకా ముఖ్యంగా, రూ.1 కోటి పైబడిన ఇళ్లు మొత్తం రిజిస్ట్రేషన్లలో కేవలం 20% మాత్రమే ఉన్నప్పటికీ, మొత్తం లావాదేవీల విలువలో 51% వాటా సాధించాయి. అక్టోబర్ నెలలో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపించింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో 25% మాత్రమే ఉన్న కోటి రూపాయల పైబడిన ఇళ్లు, మార్కెట్ విలువలో 59% వాటాను ఆక్రమించాయి.

పెద్ద ఇళ్ల వైపు కొనుగోలుదారుల మొగ్గు
ఇంటి పరిమాణాల పరంగా చూస్తే.. 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల మధ్య ఉన్న ఇళ్లు 65% రిజిస్ట్రేషన్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. 2,000 చదరపు అడుగులకుపైగా ఉన్న పెద్ద ఇళ్ల వాటా 19%కి చేరింది. 3,000 చదరపు అడుగులకంటే పెద్ద విలాసవంతమైన ఇళ్ల వాటా 5%గా నమోదైంది. దీంతో నగరంలో పెద్ద స్థల విస్తీర్ణం, మెరుగైన సదుపాయాలున్న ఇళ్లకు డిమాండ్ పెరుగుతోందని అర్థమవుతోంది.

ఒకప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధిని అమ్ముడైన ఇళ్ల సంఖ్యతో కొలిచేవారు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. రిజిస్ట్రేషన్ల సంఖ్య పెద్దగా పెరగకపోయినా, కొనుగోలుదారులు ఖరీదైన, విశాలమైన ఇళ్లను ఎంచుకుంటున్నారు. అందుకే మార్కెట్ విలువ పెరుగుతోంది. అక్టోబర్‌లో నమోదైన అత్యధిక విలువ కలిగిన ఐదు ఒప్పందాలన్నీ రూ.6.9 కోట్లకు పైబడినవే. వాటిలో నాలుగు లావాదేవీలు రంగారెడ్డి పశ్చిమ ప్రాంతంలో, ఒకటి హైదరాబాద్ సెంట్రల్ ప్రాంతంలో నమోదయ్యాయి.

ఇదీ చదవండి: ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement