ప్రపంచ కుబేరులు.. అందరినీ చుట్టుముట్టిన వివాదాలు! | From Jensen Huang To Bill Gates CEOs Linked To Extramarital Affairs | Sakshi
Sakshi News home page

ప్రపంచ కుబేరులు.. అందరినీ చుట్టుముట్టిన వివాదాలు!

Nov 15 2026 8:38 AM | Updated on Nov 15 2026 8:47 AM

From Jensen Huang To Bill Gates CEOs Linked To Extramarital Affairs

ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా పేరుగాంచిన వ్యాపారవేత్తలంటే మనకు ముందుగా గుర్తొచ్చేది.. వారి ఆస్తులు, వ్యాపార విజయాలు, విలాసవంతమైన జీవితం. కానీ వీరిలో కొందరి వ్యక్తిగత జీవితాలు కూడా అప్పుడప్పుడు తీవ్ర వివాదాలకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాలు, లైంగిక వేధింపుల ఆరోపణలు వంటి వ్యవహారాలు బయటకు వచ్చినప్పుడు వారి వ్యక్తిగత ప్రతిష్టతో పాటు వారు నడిపించే కంపెనీలపైనా ప్రభావం పడుతుంది. ఒక్కోసారి ఇలాంటి వివాదాలు వారి పదవులకే ఎసరు పెడతాయి.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన.. ఐదుగురు ప్రముఖులు తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వివాదాలతో వార్తల్లో నిలిచారు. జాబితాలో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ నుంచి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వరకు ఉన్నారు. వారి జీవితాల్లో చోటుచేసుకున్న వివాదాలు, వాటి ప్రభావాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

జెన్సన్ హువాంగ్ (ఎన్విడియా)
ఎన్విడియా కో-ఫౌండర్, సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆరోపణలు ఇటీవల వైరల్ అవుతున్నాయి. అలిస్ హువాంగ్ అనే మహిళతో ఆయనకు సంబంధం ఉందంటూ.. ఈ వ్యవహారంతో పాటు, ఆమెకు చైనా నిఘా సంస్థలతో సంబంధాలు ఉండవచ్చనే అనుమానాలు తెరమీదకు వచ్చాయి. దీంతో జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితం, కంపెనీ నాయకత్వంపై చర్చ మొదలైంది. ఆయన తన పదవికి సైతం రాజీనామా చేశారు.

బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్)
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కూడా.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదంతో వార్తల్లో నిలిచారు. 2000 ప్రాంతంలో మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే ఒక మహిళా ఉద్యోగితో ఆయనకు వివాహేతర సంబంధం ఉన్నట్లు 2021లో ఆయన ప్రతినిధి అంగీకరించారు. ఈ వ్యవహారంపై 2019లో కంపెనీ డైరెక్టర్ల బోర్డు విచారణ ప్రారంభించింది. ఆ తర్వాత 2020లో గేట్స్ బోర్డు నుంచి వైదొలిగారు. మరోవైపు.. 27 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ 2021లో భార్య మెలిండా గేట్స్‌తో విడాకులు తీసుకున్నారు.

జెఫ్ బెజోస్ (అమెజాన్)
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ వ్యక్తిగత జీవితం 2019లో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అప్పట్లో ఆయన భార్య మెకెంజీ స్కాట్‌తో వివాహ బంధంలో ఉండగానే టీవీ యాంకర్ లారెన్ సాంచెజ్‌తో సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి మధ్య జరిగిన వ్యక్తిగత సందేశాలు ఓ పత్రికలో ప్రచురితం కావడంతో ఈ వ్యవహారం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత బెజోస్, మెకెంజీ విడాకులు తీసుకున్నారు. అనంతరం 2025లో లారెన్ సాంచెజ్‌ను బెజోస్ వివాహం చేసుకున్నారు.

టైగర్ వుడ్స్ (ప్రముఖ గోల్ఫ్ క్రీడాకారుడు)
ప్రపంచ ప్రఖ్యాత గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ వ్యక్తిగత జీవితం కూడా ఒకప్పుడు పెద్ద వివాదానికి కారణమైంది. 2009లో ఆయనకు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నట్లు అమెరికన్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఆరోపణలు బయటకు రావడంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. చివరకు తన తప్పును అంగీకరిస్తూ కుటుంబానికి బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఈ వివాదం కారణంగా ఆయనతో వ్యాపార ఒప్పందాలు చేసుకున్న పలు కంపెనీలు తమ ప్రకటనల ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. 2010లో భార్యతో విడాకులు తీసుకున్నారు.

స్టీవ్ విన్ (అమెరికన్ క్యాసినో వ్యాపారవేత్త)
అమెరికాకు చెందిన ప్రముఖ క్యాసినో వ్యాపారవేత్త స్టీవ్ విన్ 2018లో లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొన్నారు. లాస్ వెగాస్ క్యాసినోల్లో పనిచేసిన పలువురు మహిళలు ఆయనపై అనుచిత ప్రవర్తనకు సంబంధించి ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీయడంతో స్టీవ్ విన్ తన కంపెనీ ఛైర్మన్, సీఈఓ పదవులకు రాజీనామా చేశారు.

పై సంఘటనలను గమనిస్తే.. ఎంతటి సంపద, పేరు ప్రఖ్యాతులు ఉన్నా వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే వివాదాల నుంచి ఎవరూ పూర్తిగా తప్పించుకోలేరు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తుల విషయంలో ఇలాంటి ఆరోపణలు బయటకు వస్తే వాటి ప్రభావం వారి కుటుంబాలకే పరిమితం కాదు. వారు నిర్మించిన కంపెనీల ప్రతిష్ట, వ్యాపార సంబంధాలు, పెట్టుబడిదారుల నమ్మకంపైనా పడుతుంది. ఈ ఐదుగురి ఉదంతాలు దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి.

ఇదీ చదవండి: జెన్సన్ లేకపోతే ఎన్విడియా పరిస్థితి ఇదే..? మస్క్ హెచ్చరిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement