ట్రంప్‌–ఎన్విడియా మాజీ సీఈఓ బంధంపై కాంగ్రెస్‌ ఫోకస్‌ | Congress keeps an eye on the ties between Trump and former Nvidia CEO | Sakshi
Sakshi News home page

ట్రంప్‌–ఎన్విడియా మాజీ సీఈఓ బంధంపై కాంగ్రెస్‌ ఫోకస్‌

Nov 14 2026 8:46 PM | Updated on Nov 14 2026 9:08 PM

Congress keeps an eye on the ties between Trump and former Nvidia CEO

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఎన్విడియా మాజీ సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. హువాంగ్‌ వ్యక్తిగత వ్యవహారాలపై వివాదాలు తలెత్తిన నేపథ్యంలో.. ట్రంప్‌తో ఆయనకున్న సంబంధాలపైనా కాంగ్రెస్‌ దృష్టి సారించింది.

ఇప్పటికే చైనా గూఢచారిగా అనుమానిస్తున్న మహిళతో హువాంగ్‌కు సంబంధం ఉందన్న ఆరోపణలతో పాటు, ఎన్విడియాలో పనిచేసే మరో ఇద్దరు మహిళలతోనూ ఆయనకు వివాహేతర సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వివాదాల మధ్య ట్రంప్‌ మాత్రం హువాంగ్‌కు మద్దతుగా నిలిచారు. ఎన్విడియా నుంచి ఆయన వైదొలగడానికి ఒక రోజు ముందు కూడా స్పందించిన ట్రంప్‌.. హువాంగ్‌ను గొప్ప ప్రతిభావంతుడిగా అభివర్ణించారు.  అంతేకాదు ఆయన ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

మరోవైపు వచ్చే ఏడాది హౌస్‌ జ్యుడీషియరీ కమిటీకి అధ్యక్షత వహించే అవకాశం ఉన్న డెమొక్రటిక్‌ నేత జేమీ రాస్కిన్‌.. ట్రంప్‌, ఎన్విడియా మధ్య సంబంధాలు, ట్రంప్‌–చైనా వ్యవహారాలపై కాంగ్రెస్‌ పర్యవేక్షణ ఉంటుందని సంకేతాలిచ్చారు.

అయితే 2025 జనవరిలో ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి హువాంగ్‌ హాజరుకాకపోయినా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మాత్రం పెరిగింది. దాంతో ట్రంప్‌ వైట్‌హౌస్‌ బాల్‌రూమ్‌ నిర్మాణానికి హువాంగ్‌ 2.5 కోట్ల డాలర్లు విరాళంగా ప్రకటించారు. అంతేకాదు చైనాకు ఎన్విడియా చిప్స్‌ విక్రయించేందుకు అనుమతులు ఇవ్వడంలోనూ హువాంగ్‌ ఒత్తిడి పనిచేసిందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం పేర్కొంది.

ఇక ట్రంప్‌ వ్యక్తిగత బ్రోకరేజ్‌ ఖాతాల్లో ఎన్విడియా షేర్లలో భారీగా పెట్టుబడులు ఉన్నట్లు, ఆయన కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ భాగస్వామిగా ఉన్న 1789 క్యాపిటల్‌ పెట్టుబడులు పెట్టిన సంస్థల్లో కనీసం మూడింట ఒక వంతుకు ఎన్విడియా నుంచి కూడా పెట్టుబడులు అందినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్‌–హువాంగ్‌ సంబంధాలపై కాంగ్రెస్‌ విచారణ, పర్యవేక్షణ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదీ చదవండి: నాటో సభ్యత్వం కావాలంటే 'డాన్‌బాస్‌'ను వదులుకోవాల్సిందేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement