హైదరాబాద్‌లో సింపోజియం ఏడో ఎడిషన్
మానవత్వం, సామాజిక బాధ్యతపై చర్చ
హైదరాబాద్: కేవలం సాయం చేయడంతోనే సేవ పూర్తికాదని, బాధితులకు స్వావలంబన దిశగా అవకాశాలు కల్పించాలని ప్రముఖ నటుడు, సామాజిక సేవకుడు సోనూసూద్ అన్నారు. ఆకలితో ఉన్నవారికి ముందుగా ఆహారం అందించాలని, ఆ తర్వాత వారు తమ కాళ్లపై తాము నిలబడేలా సహకరించాలని సూచించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్ ది డెబ్యూట్‌లో శుక్రవారం నిర్వహించిన సింపోజియం ఏడో ఎడిషన్ ‘ది హ్యూమానిటీ ఇన్ అస్: వాట్ డజ్ ఇట్ మీన్ టు కేర్?’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ఈ చర్చా కార్యక్రమంలో గూంజ్, గ్రామ స్వాభిమాన్ వ్యవస్థాపకుడు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత అన్షు గుప్తా పాల్గొన్నారు. ఎన్డీటీవీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉమా సుధీర్ చర్చను సమన్వయం చేశారు. సేవ అంటే మిగిలిపోయిన వస్తువులను పంపిణీ చేయడం మాత్రమే కాదని, ప్రజల నిజమైన అవసరాలను గుర్తించి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ సమాజాన్ని సాధికారత దిశగా నడిపించాలని అన్షు గుప్తా పేర్కొన్నారు. సేవ పేరుతో ప్రజల్లో ఇతరులపై ఆధారపడే పరిస్థితి సృష్టించకూడదని అన్నారు.
ఈ సందర్భంగా సంక్షేమ పథకాలపై ప్రభుత్వాలు చేసే వ్యయంపైనా చర్చ జరిగింది. రాష్ట్రాలు తమ ఆదాయ సామర్థ్యం, అప్పుల భారం, అభివృద్ధి ప్రాధాన్యతలను పరిగణనలోకి తీసుకుని సంక్షేమానికి బడ్జెట్‌లో తగిన మొత్తాన్ని కేటాయించాలని సింపోజియం వ్యవస్థాపకుడు, ఎంపీఎం గ్రూప్ సీఎండీ గిరీష్ మల్లపాణి సూచించారు. ఆరోగ్యం, విద్య, పోషకాహారం, సామాజిక భద్రత వంటి అత్యవసర సంక్షేమ కార్యక్రమాలకు, ఎన్నికల సమయంలో ప్రకటించే ఉచిత పథకాలకు మధ్య స్పష్టమైన తేడా ఉండాలని అభిప్రాయపడ్డారు.
సంక్షేమ వ్యయంపై బాధ్యతాయుతమైన, పారదర్శకమైన ఆర్థిక విధానాన్ని రూపొందించేందుకు పార్లమెంట్‌లో చర్చ జరగాలని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే, అత్యవసర సామాజిక భద్రతా పథకాలకు లేదా అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటున్న రాష్ట్రాలకు ఇబ్బంది కలిగించేలా కఠినమైన పరిమితులు విధించకూడదని పేర్కొన్నారు. ఈ చర్చలో మాజీ పోలీస్ కమిషనర్ ఏకే ఖాన్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ కూడా పరిపాలనా పరమైన అభిప్రాయాలను పంచుకున్నారు.
కరుణ, ఆర్థిక క్రమశిక్షణ రెండూ సమాంతరంగా సాగాలని ఈ కార్యక్రమంలో వక్తలు పేర్కొన్నారు. సంక్షేమం కేవలం ఆర్థిక సాయం అందించడానికే పరిమితం కాకుండా ఉపాధి అవకాశాలు, జీవనోపాధిని మెరుగుపరిచి ప్రజలను స్వావలంబులుగా తీర్చిదిద్దాలని అభిప్రాయపడ్డారు. వివిధ విద్యాసంస్థల సహకారంతో గతంలో నిర్వహించిన చర్చల ఆధారంగా రూపొందించిన శ్వేతపత్రాలను కూడా సింపోజియం ప్రచురిస్తోంది. ఇందులో భాగంగా సైబర్ భద్రతపై రూపొందించిన శ్వేతపత్రాన్ని శుక్రవారం విడుదల చేశారు.
సింపోజియం అనేది ‘వేర్ విజనరీస్ కన్వర్జ్’ అనే నినాదంతో ఏర్పాటైన స్వతంత్ర, రాజకీయేతర, లాభాపేక్షలేని జ్ఞాన వేదిక. వివిధ రంగాలకు చెందిన మేధావులు, విధాన రూపకర్తలు, మార్పు కోసం కృషి చేసేవారు, నిపుణులను ఒకచోట చేర్చి సమాజాన్ని ప్రభావితం చేసే అంశాలపై చర్చలు నిర్వహిస్తోంది. గిరీష్ మల్లపాణి, ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్, శ్రుతి మల్లపాణి దీని వ్యవస్థాపకులు. వింగ్ కమాండర్ ఆశా వశిష్ట్ సీఈఓగా వ్యవహరిస్తున్నారు.


