ఉద్యోగి మరణించాక పెన్షన్‌ వచ్చేది వీళ్లకే.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ | Family Pension Rules Central government new rules who will benefit | Sakshi
Sakshi News home page

ఉద్యోగి మరణించాక పెన్షన్‌ వచ్చేది వీళ్లకే.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

Nov 14 2026 4:23 PM | Updated on Nov 14 2026 4:49 PM

Family Pension Rules Central government new rules who will benefit

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే ఆయన కుటుంబంలో ఎవరికి పెన్షన్‌ వస్తుంది? భార్య లేదా భర్తతో పాటు పిల్లలు, వితంతువులు, విడాకులు తీసుకున్న కుమార్తెలు, ఆధారపడిన తల్లిదండ్రులు కూడా కుటుంబ పెన్షన్‌కు అర్హులవుతారా? దీనిపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. కుటుంబ పెన్షన్‌ పొందాలంటే సంబంధ బాంధవ్యాలతో పాటు ఆదాయం, ఆర్థిక ఆధారపడటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది.

పెన్షన్‌, పెన్షనర్ల సంక్షేమ శాఖ (DoPPW) 2026 అక్టోబర్ 29న జారీ చేసిన కార్యాలయ ఉత్తర్వుల్లో ఈ నిబంధనలను వివరించింది. ముఖ్యంగా కుటుంబ పెన్షన్‌ (వర్తించే కరువు భత్యం (DR)తో కలిపి) మినహా ఇతర ఆదాయం నెలకు రూ.9,000 కంటే తక్కువగా ఉండాలనే నిబంధనను స్పష్టం చేసింది. అయితే చట్టబద్ధమైన జీవిత భాగస్వామికి ఈ ఆదాయ పరిమితి వర్తించదు.

ఎవరెవరికి కుటుంబ పెన్షన్‌ వస్తుంది?

కేంద్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ (పెన్షన్‌) నిబంధనలు-2021లోని రూల్ 50 ప్రకారం కుటుంబ పెన్షన్‌ పొందేందుకు అర్హులైనవారు వీళ్లే..

భార్య లేదా భర్త: చట్టబద్ధమైన జీవిత భాగస్వామికి ఇతర ఆదాయంతో సంబంధం లేకుండా కుటుంబ పెన్షన్‌ వస్తుంది. సాధారణంగా పునర్వివాహం చేసుకునే వరకు లేదా మరణించే వరకు అర్హత ఉంటుంది.

పిల్లలు: నిబంధనలకు అనుగుణంగా 25 ఏళ్లలోపు పిల్లలకు కుటుంబ పెన్షన్‌ లభిస్తుంది. వికలాంగులైన పిల్లలకు ప్రత్యేక అర్హతలు ఉంటాయి.

కుమార్తెలు: పెళ్లికాని, వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలకు 25 ఏళ్లు దాటిన తర్వాత కూడా కొన్ని షరతులతో జీవితకాలం పెన్షన్‌ పొందే అవకాశం ఉంది. అయితే తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు వారిపై ఆర్థికంగా ఆధారపడి ఉండాలి.

తల్లిదండ్రులు: మరణించిన ఉద్యోగిపై ఆర్థికంగా ఆధారపడిన తల్లిదండ్రులు అర్హత పొందవచ్చు.

వికలాంగులైన తోబుట్టువులు: మానసిక లేదా శారీరక వైకల్యం కలిగి, మరణించిన ఉద్యోగిపై ఆధారపడిన సోదరులు, సోదరీమణులకు కూడా నిబంధనల ప్రకారం పెన్షన్‌ అందుతుంది.

ఆదాయ పరిమితులు ఎంత?

ప్రభుత్వ తాజా స్పష్టత ప్రకారం కుటుంబ పెన్షన్‌ మినహా ఇతర వనరుల నుంచి వచ్చే మొత్తం ఆదాయం నెలకు రూ.9,000తో పాటు వర్తించే డీఆర్‌ కంటే తక్కువగా ఉండాలి. ఈ పరిమితి సాధారణంగా పెన్షన్‌కు అర్హులైన ఇతర కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది.

అయితే మానసిక లేదా శారీరక వైకల్యం ఉన్న పిల్లలు, తోబుట్టువుల విషయంలో ప్రత్యేక నిబంధన ఉంది. వీరి ఇతర ఆదాయం వారు పొందేందుకు అర్హులైన సాధారణ కుటుంబ పెన్షన్‌ (చివరిగా తీసుకున్న వేతనంలో 30 శాతం)తో పాటు వర్తించే డీఆర్‌ కంటే తక్కువగా ఉండాలి.

మరోవైపు, సంతానం లేని వితంతువు పునర్వివాహం చేసుకున్నప్పటికీ ఆమె ఇతర ఆదాయం కనీస కుటుంబ పెన్షన్‌, దానిపై వర్తించే డీఆర్‌ కంటే తక్కువగా ఉంటే పెన్షన్‌ కొనసాగుతుంది.

ఆర్థికంగా ఆధారపడినట్లు నిరూపించుకోవాలా?

అవును. కేవలం ఆదాయ పరిమితిలోపు ఉన్నంత మాత్రాన పెన్షన్‌ మంజూరు కాదు. కొన్ని కుటుంబ సభ్యులు మరణించిన ఉద్యోగిపై ఆర్థికంగా ఆధారపడినట్లు నిరూపించుకోవాలి. పెళ్లికాని, వితంతువు లేదా విడాకులు తీసుకున్న కుమార్తెలు తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడే వారిపై ఆధారపడినట్లు నిర్ధారించాలి. ఆధారపడిన తల్లిదండ్రులు, వికలాంగులైన తోబుట్టువులు ఉద్యోగి మరణానికి ముందు ఆయనపై ఆధారపడినట్లు నిరూపించాలి.

ఇదీ చదవండి: బ్యాంక్ ఆఫ్ బరోడా ‘గోల్డెన్ గోల్ స్కీమ్‌’.. ఇక మరింత వడ్డీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement