బియ్యం ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు?  | India may reintroduce restrictions on exports of 100 per cent broken rice | Sakshi
Sakshi News home page

బియ్యం ఎగుమతులపై మళ్లీ ఆంక్షలు? 

Nov 13 2026 3:52 AM | Updated on Nov 13 2026 3:52 AM

India may reintroduce restrictions on exports of 100 per cent broken rice

దేశీయంగా భారీగా పెరుగుతున్న ధరలు  

విరిగిన బియ్యానికి పరిశ్రమల నుంచి భారీ డిమాండ్‌  

బహిరంగ మార్కెట్‌లో బియ్యం విడుదలకు కేంద్రం చర్యలు  

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బియ్యం ధరలు నానాటికీ పెరిగిపోతున్నాయి. కరువు పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో మరింత పెరుగుతాయిని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. విరిగిన బియ్యానికి సైతం పరిశ్రమల నుంచి డిమాండ్‌ పెరుగుతోంది. దేశీయంగా బియ్యం ధరలను కట్టడి చేయడానికి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది మన దేశం నుంచి బియ్యం విదేశాలకు ఎగుమతులు క్రమంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో దేశీయంగా సరఫరా తగ్గితే ధరలు మరింత భగ్గుమనడం ఖాయం. అందుకే ఎగుమతులపై ఆంక్షల విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌లో వరి దిగుబడులు తగ్గాయి. వర్షపాతం లోటు, ఎల్‌నినో ప్రభావంతో పంట ఉత్పత్తిపై అనిశ్చితి నెలకొంది. మరోవైపు మొక్కజొన్న ధరలు కిలోకు రూ.33కు చేరడంతో పౌల్ట్రీ పరిశ్రమ ప్రత్యామ్నాయ ధాన్యాలపై దృష్టి సారించింది. కోళ్ల దాణా తయారీకి విరిగిన బియ్యాన్ని కొనుగోలు చేస్తోంది. ఇథనాల్‌ తయారీ పరిశ్రమలకు కూడా విరిగిన బియ్యం అవసరం పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి సెపె్టంబరు వరకు 1.068 కోట్ల టన్నుల బియ్యం ఎగుమతి కాగా.. గతేడాది ఇదే కాలంలో 1.019 కోట్ల టన్నుల ఎగుమతులు జరిగాయి. అంటే 4.8 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఎగుమతులు ఇలానే కొనసాగితే దేశీయ మార్కెట్‌లో పరిస్థితి తారుమారు కానుంది.  

గతంలోనూ నిషేధం.. 
దేశీయంగా బియ్యం లభ్యతను పెంచి, ధరలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం గతంలోనూ ఎగుమతులపై ఆంక్షలు విధించింది. 2022 సెప్టెంబరులో విరిగిన బియ్యం ఎగుమతులను నిషేధించింది. దేశీయంగా సరఫరాలు తగ్గడం, ధరలు పెరుగుతుండటమే ఇందుకు కారణం. ఈ నిషేధం 2025 మార్చి వరకు కొనసాగింది. ఆ తర్వాత ఎగుమతులకు ప్రభుత్వం మళ్లీ అనుమతి ఇచ్చింది. ప్రస్తుత పరిణామాలు అప్పటి పరిస్థితులను గుర్తుచేస్తున్నాయి. దేశీయంగా ధరలు ఎగబాకుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పాత విధానాన్ని అనుసరించే అవకాశాలున్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

సరఫరాల పెంపునకు కేంద్రం చర్యలు  
దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకు కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది. బహిరంగ మార్కెట్‌ విక్రయ పథకం కింద 2026–27లో విక్రయించనున్న బియ్యం పరిమాణాన్ని 25 లక్షల టన్నుల నుంచి 50 లక్షల టన్నులకు పెంచింది. అక్టోబరు చివరి నాటికే ఈ పథకం కింద 25 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రైవేటు వ్యాపారులకు విక్రయించింది. మరోవైపు వ్యాపారులు, టోకు–చిల్లర వర్తకులు, రైస్‌ మిల్లర్లు, ప్రాసెసింగ్‌ సంస్థలు ప్రతి శుక్రవారం తమ వద్ద ఉన్న బియ్యం, ధాన్యం నిల్వల వివరాలను కేంద్ర ఆహార నిల్వల పోర్టల్‌లో పొందుపర్చాలని ఆదేశించింది. నిల్వలపై పరిమితులు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం అనుమతి మంజూరు చేసింది. ఈ నిబంధనలు 2027 జనవరి 31 వరకు అమల్లో ఉండనున్నాయి.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement