ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు | Auto Sales Stay Strong in October SIAM | Sakshi
Sakshi News home page

ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు

Nov 14 2026 12:43 PM | Updated on Nov 14 2026 12:43 PM

Auto Sales Stay Strong in October SIAM

పండుగ సీజన్‌ డిమాండ్‌ కలిసిరావడంతో దేశీయ ప్యాసింజర్‌ వాహనాల డిస్పాచ్‌ (డీలర్లకు సరఫరా) అక్టోబర్‌లో రికార్డు స్థాయికి చేరుకుంది. వార్షిక ప్రాతిపదికన 12.4% వృద్ధి సాధించి 5.19 లక్షల యూనిట్ల పంపిణీ జరిగిందని భారత ఆటోమొబైల్‌ తయారీదారుల సమాఖ్య (సియామ్‌) శుక్రవారం వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో ఈ సంఖ్య 4.62 లక్షల యూనిట్లుగా ఉంది. నవంబర్‌ తొలి వారంలో ధనత్రయోదశి, దీపావళి పండుగలు రావడంతో ఆటో కంపెనీలు డీలర్లకు భారీగా వాహనాలను సరఫరా చేశాయి.

ద్విచక్ర వాహనాల సరఫరా 22.20 లక్షల యూనిట్ల నుంచి 16.1% పెరిగి 25.78 లక్షల యూనిట్లకు చేరింది. ఇందులో స్కూటర్ల విక్రయాలు ఏకంగా 31.6% ఎగబాకి 10.97 లక్షల యూనిట్లుగా నమోదవగా, మోటార్‌ సైకిళ్ల విక్రయాలు 6.6% వృద్ధితో 14.23 లక్షల యూనిట్లకు చేరాయి.

త్రిచక్ర వాహన విభాగం 25.7% వృద్ధితో 1.03 లక్షల యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. గతేడాది ఇదే నెలలో 82,190 యూనిట్ల డిస్పాచ్‌లు జరిగాయి.

మొత్తం వాహనాలు, ఎగుమతులు: అక్టోబర్‌లో మొత్తం దేశీయ వాహన సరఫరా 15.7% వృద్ధితో 31.26 లక్షల యూనిట్లకు చేరింది. వాహన ఉత్పత్తి 28.6% పెరిగి 36.19 లక్షల యూనిట్లుగా నమోదైంది. ఎగుమతులు 26% ఎగబాకి 6.82 లక్షల యూనిట్లకు చేరాయి. మొత్తం వాహన ఎగుమతుల్లో కార్ల ఎగుమతులు 21.8% వృద్ధితో 83,716 యూనిట్లు, టూ–వీలర్‌ ఎగుమతులు 26.5% వృద్ధితో 5.44 లక్షల యూనిట్లుగా ఉన్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య కాలంలో దేశీయ ప్యాసింజర్‌ వాహన సరఫరా 30.83 లక్షల యూనిట్లకు చేరుకుంది. 2025 ఇదే కాలంలో 24.56 లక్షల డిస్పాచ్‌లు జరిగాయి. ద్విచక్ర వాహనాల సరఫరా 1.25 కోట్ల యూనిట్ల నుంచి 1.47 కోట్ల యూనిట్లకు పెరిగింది.

మొత్తం దేశీయ, ఎగుమతి, ఉత్పత్తి గణాంకాల్లో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్, జేఎల్‌ఆర్, వోల్వో ఆటో వివరాలు లేవు. టాటా మోటార్స్‌ విక్రయాలను కేవలం మొత్తం ప్యాసింజర్‌ వాహనాల డేటాలో మాత్రమే కలిపారు.

‘‘అక్టోబర్‌లో ప్యాసింజర్‌ వాహన విభాగం అత్యుత్తమ పనితీరు కనబరించింది. నెలవారీగా విక్రయాల్లో తొలిసారిగా 5 లక్షల యూనిట్ల కీలక మైలురాయిని అధిగమించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రుణ లభ్యత మెరుగుపడటం, పాత వాహనాల మారి్పడి (రీప్లేస్‌మెంట్‌) డిమాండ్‌ ద్విచక్ర వాహన అమ్మకాలకు దన్నుగా నిలుస్తున్నాయి. చివరి మైలు రవాణా అవసరాలు, వేగవంతమైన విద్యుదీకరణ త్రిచక్ర వాహన విభాగాన్ని నడిపిస్తున్నాయి’’ సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజేశ్‌ మీనన్‌ తెలిపారు.

రిటైల్, టోకు విక్రయాల్లో వ్యత్యాసం ఎందుకంటే..?
కంపెనీల నుంచి డీలర్లకు వెళ్లే వాహనాలను ‘సియామ్‌’ లెక్కిస్తుంది. వినియోగదారులు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేయించుకునే రిటైల్‌ విక్రయాలను ‘ఫాడా’ ప్రకటిస్తుంది. ఫాడా నివేదిక ప్రకారం అక్టోబర్‌లో రిటైల్‌ విక్రయాలు 23.8% తగ్గి 31.72 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది నవరాత్రి, దీపావళి పండుగలు రెండూ అక్టోబర్‌లోనే రావడం, జీఎస్టీ రేట్ల క్రమబద్దీకరణ తర్వాత అప్పట్లో భారీగా కొనుగోళ్లు జరగడం వల్ల బేస్‌ ఎక్కువగా ఉంది. ఈ ఏడాది దీపావళి నవంబర్‌కు మారడంతో అక్టోబర్‌ రిటైల్‌ రిజి్రస్టేషన్లు తగ్గినట్లు కనిపిస్తున్నా, పండుగ డిమాండ్‌ కోసం కంపెనీలు డీలర్లకు భారీగా డిస్పాచ్‌ చేయడంతో ‘సియామ్‌’ టోకు గణాంకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement