శాట్‌కామ్‌ సర్వీసులు.. సునీల్‌ మిట్టల్‌ హెచ్చరిక! | Mittal Warns Against Satellite Dependence | Sakshi
Sakshi News home page

శాట్‌కామ్‌ సర్వీసులు.. సునీల్‌ మిట్టల్‌ హెచ్చరిక!

Nov 14 2026 11:40 AM | Updated on Nov 14 2026 11:42 AM

Mittal Warns Against Satellite Dependence

న్యూఢిల్లీ: దేశంలో ఆపరేట్‌ చేసే శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌కు సంబంధించి పూర్తి నియంత్రణాధికారాలు (కిల్‌ స్విచ్‌) ప్రభుత్వం చేతిలోనే ఉండాలని భారతి ఎయిర్‌టెల్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ పేర్కొన్నారు. ఒకే విదేశీ సర్వీస్ ప్రొవైడర్‌పై ఆధారపడితే దేశ భద్రతకు ముప్పేనని హెచ్చరించారు.

భారత్‌లో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను ప్రారంభించే విషయంలో భద్రతాపరమైన పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో మిట్టల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాగా, ఎలాన్‌ మస్క్‌ స్టార్‌లింక్‌తో పాటు రిలయన్స్‌ జియో, మిట్టల్‌కు చెందిన యూటెలిశాట్‌ వన్‌వెబ్‌ కూడా వాణిజ్యపరంగా సర్వీసులు మొదలుపెట్టేందుకు నియంత్రణపరమైన అనుమతుల కోసం వేచిచూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఇటీవలే మస్క్.. భారత్‌లో తమ స్టార్‌లింక్‌ ఎంట్రీకి కొన్ని వ్యాపార శక్తులు అడ్డుపడుతున్నాయంటూ నేరుగా ముకేశ్‌ అంబానీని టార్గెట్‌ చేయడం తెలిసిందే. ‘కిల్‌ స్విచ్‌ అనేది ఎక్కడో ఉంటే కుదరదు. తమ సొంత అంతరిక్ష కార్యకలాపాలపై నియంత్రణంతా భారత్‌ వద్దే ఉండాలి. శాట్‌కామ్‌ లైసెన్స్‌ అలాగే నిర్వహణపరమైన అనుమతి మధ్య వ్యత్యాసమే ఈ వివాదానికి కారణం. లైసెన్సు ఉన్నంత మాత్రాన వాణిజ్య సేవలకు ఆటోమేటిక్‌గా అనుమతించినట్లు కాదు. సర్వీసుల ప్రారంభానికి ముందు స్పెక్ట్రమ్‌ కేటాయింపు, భద్రతాపరమైన అవసరాలకు అనుగుణంగా నడుచుకోవడం తప్పనిసరి’ అని భారతి ఎంటర్‌ప్రైజెస్‌ 50వ వార్షికోత్సవం సందర్భంగా పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మిట్టల్‌ స్పష్టం చేశారు.

మూడేళ్ల క్రితమే వన్‌వెబ్‌ రెడీ
వన్‌వెబ్, జియో, మస్క్‌ స్టార్‌లింక్‌ ఇప్పటికే భారత్‌లో శాట్‌కామ్‌ లైసెన్సులను దక్కించుకున్నాయి. అయితే, శాట్‌కామ్‌ ఆపరేటర్లందరూ కచ్చితంగా నియత్రణపరమైన, భద్రతాపరమైన నిబంధనలన్నింటినీ పాటించాల్సిందేనని భారత ప్రభుత్వం చెబుతోంది. దానికనుగుణంగానే తుది నిర్వహణ అనుమతుల జారీ ఉంటుందని కూడా తేల్చి చెప్పింది. అన్ని కంపెనీలకు నిబంధనలు ఒకేలా వర్తిస్తాయని కూడా స్పష్టం చేస్తోంది. కాగా, మూడేళ్ల క్రితమే తమ వన్‌వెబ్‌ గ్రౌండ్‌ ఇన్‌ఫ్రా సిద్ధమైందని, ఐదేళ్లుగా శాటిలైట్లు భారత్‌ మీదుగా తిరుగుతున్నాయని.. అయినప్పటికీ వాణిజ్య సర్వీసులను ప్రారంభించేందుకు ప్రభుత్వ సిగ్నల్‌ కోసం నిరీక్షిస్తున్నామని మిట్టల్‌ చెప్పారు.

ఇదీ చదవండి: అమెరికాలో ఒక్కసారిగా ఆగిన విమానాలు.. అసలేం జరిగింది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement