చర్లపల్లి, పట్నా స్టేషన్ల మధ్య పరుగులు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన అమృత్ భారత్ 3.0 కొత్తశ్రేణి రైళ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఛాత్ పండుగ సందర్భంగా న్యూఢిల్లీ నుంచి పట్నాకు ఈ రైలును ప్రవేశపెట్టారు. త్వరలో చర్లపల్లి నుంచి పట్నా మధ్య ఈ మూడో శ్రేణి అమృత్ భారత్ పట్టాలెక్కనుంది. ఇప్పటి వరకు అమృత్ భారత్ మొదటి, ద్వితీయ శ్రేణికి చెందినవి పూర్తిగా నాన్ ఏసీ రైళ్లు కాగా, కొత్త వెర్షన్ రైళ్లు ఏసీ సదుపాయంతో రానున్నాయి.
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి పట్నాకు దానాపూర్, చర్లపల్లి నుంచి ముజఫర్‌పూర్ వరకు బై వీక్లీ రైళ్లు నడుస్తున్నాయి. కానీ.. ఈ మార్గంలో ప్రతి రోజు లక్షలాది మంది రాకపోకలు సాగిస్తున్నారు. దీపావళి, ఛాత్ వంటి పండుగ సమయాల్లోనే కాకుండా అన్ని రోజుల్లోనూ దానాపూర్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. ఈ క్రమంలో చర్లపల్లి నుంచి రెగ్యులర్‌గా రాకపోకలు సాగించేందుకు అమృత్ భారత్ 3.0 రైలును ప్రవేశపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో సాధారణ ప్రయాణికులతో పాటు అయోధ్య, వారణాసి తదితర పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకూ ఊరట లభించనుంది.
ఇవీ ప్రత్యేకతలు..
అమృత్ భారత్ 3.0 రైళ్లలో మొత్తం 22 బోగీలు ఉంటాయి. ఒక ఫస్ట్ ఏసీ, రెండు సెకండ్ ఏసీ, 6 థర్డ్ ఏసీ బోగీలు ఉంటాయి. అలాగే 6 స్లీపర్ క్లాస్, 4 సాధారణ బోగీలతో పాటు దివ్యాంగుల కోసం మరో బోగీను జత చేశారు.
ఈ రైళ్లు గరిష్ఠంగా గంటకు 130 కి.మీ. వేగంతో నడిచే ట్రాక్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పటికీ సగటు వేగం 55 కి.మీ.
ఈ కొత్త వెర్షన్‌లో మొబైల్ చార్జింగ్ సదుపాయం, ఫోల్డింగ్ టేబుళ్లు, చదువుకునేందుకు ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి.
అధునాతన సెన్సర్ బటన్‌తో పని చేసే బయో టాయిలెట్ సదుపాయం ఉంటుంది.
ఇదీ చదవండి: ఏడాది తిరగకముందే బిజినెస్ మూసివేత.. కట్ చేస్తే..


