తిరువనంతపురం: కేరళలో ప్రయాణించే జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించి భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. రెండు జనశతాబ్ది రైళ్లకు ఉన్న సూపర్‌ఫాస్ట్ హోదాను తొలగించనుంది. ఈ మార్పులు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రయాణికులకు టికెట్ ధరలు తగ్గనున్నాయి.
కన్నూర్–తిరువనంతపురం–కన్నూర్ (12081/12082), కోజికోడ్–తిరువనంతపురం–కోజికోడ్ (12075/12076) జనశతాబ్ది రైళ్లను సూపర్‌ఫాస్ట్ కేటగిరీ నుంచి సాధారణ ఎక్స్‌ప్రెస్ కేటగిరీలోకి మార్చనున్నారు. ఈ క్రమంలో రైళ్ల నంబర్లు కూడా మారనున్నాయి. సాధారణంగా సూపర్‌ఫాస్ట్ రైళ్లు గంటకు సగటున 55 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. వేగం తగ్గిన రైళ్ల పనితీరును పరిశీలించిన అనంతరం రైల్వే శాఖ వాటి హోదాను మారుస్తుంది. ఇటీవల దేశవ్యాప్తంగా సుమారు 10 రైళ్లకు సూపర్‌ఫాస్ట్ హోదాను తొలగించింది.
సూపర్‌ఫాస్ట్ హోదా తొలగింపుతో టికెట్‌పై విధించే అదనపు ఛార్జీ రూ.15 నుంచి రూ.45 వరకు తగ్గనుంది. ప్రస్తుతం కన్నూర్ నుంచి తిరువనంతపురానికి సిట్టింగ్ రిజర్వేషన్ టికెట్ ధర రూ.235గా ఉంది. జనవరి 1 నుంచి ఇది రూ.220కు తగ్గనుంది. ఏసీ చైర్‌కార్ టికెట్ ధర రూ.780 నుంచి రూ.735కు చేరనుంది. కేరళలోని అన్ని ఇంటర్‌సిటీ రైళ్లు సాధారణ ఎక్స్‌ప్రెస్ కేటగిరీలో లేవు. మంగళూరు–కోయంబత్తూరు ఇంటర్‌సిటీ (22609) ఇప్పటికీ సూపర్‌ఫాస్ట్ ఛార్జీలను వసూలు చేస్తుండగా, కన్నూర్–ఎర్నాకుళం ఇంటర్‌సిటీ (16306)పై అదనపు సూపర్‌ఫాస్ట్ ఛార్జీ లేదు. జనశతాబ్ది రైళ్ల హోదా మార్పుతో కేరళ ప్రయాణికులకు కొంత ఆర్థిక ఊరట లభించనుంది.
ఇదీ చదవండి: 2027లోనూ ‘అదే నీట్’.. మార్పులకు బ్రేక్!


