పండుగ ప్రయాణం భారమే | Ticket fares increase for flights, trains, and buses | Sakshi
Sakshi News home page

పండుగ ప్రయాణం భారమే

Oct 10 2026 8:18 AM | Updated on Oct 10 2026 8:18 AM

Ticket fares increase for flights, trains, and buses

సాక్షి, హైదరాబాద్‌: పండుగ ప్రయాణాలు భారంగా మారాయి. దసరా, దీపావళి వేడుకలు, స్కూళ్లకు సెలవుల నేపథ్యంలో సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న నగరవాసులకు విమానాలు, రైళ్లు, బస్సుల్లో టికెట్‌ రేట్లు చుక్కలు చూపిస్తున్నాయి. ఇంధన చార్జీల పెంపు నేపథ్యంలో విమానయాన సంస్థలు సర్‌చార్జీల పేరిట  ప్రయాణికులపైన అదనపు దోపిడీకి తెరలేపాయి. ఇప్పటికే  హైదరాబాద్‌ నుంచి తిరుపతి, విశాఖ, బెంగళూరు తదితర నగరాలకు విమానచార్జీలు దడ పుట్టిస్తుండగా సర్‌చార్జీలతో మరింత పెరిగాయి. 

మరోవైపు  తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని రెగ్యులర్‌ రైళ్లలో వెయిటింగ్‌ లిస్ట్‌ వందల్లోకి చేరుకుంది. పండుగల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో సాధారణ చార్జీలపైన 30 శాతం అదనంగా విధించారు. దసరా రద్దీని దృష్టిలో ఉంచుకొని 7 వేల బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలను రూపొందించింది. ఈ బస్సులన్నింటిలోనూ  50 శాతం అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం దసరా, ఆ తరువాత దీపావళి, డిసెంబర్‌లో క్రిస్‌మస్, జనవరిలో సంక్రాంతి పండుగల దృష్ట్యా ఈ నెల నుంచి జనవరి నెలాఖరు వరకు ప్రయాణికులరద్దీ కొనసాగనుంది.  

అంతర్జాతీయ ప్రయాణాల కంటే ఎక్కువ..
ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) ధరలు 14 శాతం పెరగడంతో ఎయిర్‌లైన్స్‌ దేశీయ, అంతర్జాతీయ టికెట్లపై ఫ్యూయల్‌ సర్‌ఛార్జ్‌ను పెంచాయి. దస రా, దీపావళి సెలవులకు సొంతూళ్లకు వెళ్లేవారు సాధారణ రోజులకన్నా ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. విదేశాలకు వెళ్లడానికి అయ్యే ఖర్చు కంటే ఈ చార్జీలే ఎక్కువగా ఉండడం గమనార్హం. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి సాధారణ రోజుల్లో రూ.3500 వరకు ఉంటే ఇప్పుడు రూ.7888 నుంచి రూ.9,235 వరకు చేరింది.

 అలాగే  విశాఖకు రూ.7042 నుంచి రూ.8525 వరకు కనిపిస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్‌ నుంచి సింగపూర్, మలేసియా, బ్యాంకాక్‌ వంటి అంతర్జాతీయ గమ్యస్థానాలకు రూ.15 వేల నుంచి రూ.18 వేలకే టికెట్లు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా కోల్‌కత్తాకు రూ.7,500 వరకు ఉంటుంది.  ఇది రూ. 19 వేలకు చేరింది.  జైపూర్‌కు సాధారణంగా రూ.8 వేలుగా ఉంటుంది. నవంబర్‌లో రూ.21 వేల వరకు నమోదైంది. పటా్న, లక్నో, చండీగఢ్, తదితర నగరాలకు సైతం విమాన చార్జీలు భారీగా పెరిగాయి.

రూ.280 నుంచి రూ.420కి..
ప్రతి పండుగ సందర్భంగా ఆర్టీసీ 50 శాతం అదనపు చార్జీలు విధిస్తోంది. శనివారం నుంచి పిల్లలకు సెలవులు ప్రకటించడంతో  శుక్రవారం నుంచే ప్రయాణికుల రద్దీ మొదలైంది. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్‌బీనగర్, తదితర ప్రాంతాల నుంచి జిల్లాలకు బయలుదేరిన బస్సుల్లో రద్దీ కనిపించింది. రెగ్యులర్‌ బస్సుల్లో హైదరాబాద్‌ నుంచి కరీంనగర్‌కు ఎక్స్‌ప్రెస్‌ చార్జీ రూ.280 కాగా ప్రత్యేక బస్సుల్లో ఇది రూ.420 వరకు పెరగనుంది. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, తదితర ప్రాంతాలకు సైతం 50 శాతం అదనపు వడ్డింపుతో డీలక్స్, సూపర్‌లగ్జరీ బస్సుల్లో ఇంచుమించు రూ.550 వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.  

600 రైళ్లు వేసినా..
పండుగల రద్దీ వేళ..అక్టోబర్‌ నుంచి జనవరి వరకు సుమారు 600 రైళ్లను అదనంగా నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే  ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పట్నా , వారణాసి, ఢిల్లీ, కోల్‌కత్తా, హజ్రత్‌ నిజాముద్దీన్, తదితర నగరాలకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. తొలుత ఈ నెల 10 నుంచి 25 వరకు 34 ప్యాసింజర్‌ రైళ్లను సైతం అదనంగా ఏర్పాటు చేశారు. ఈ రైళ్లన్నింటిలోనూ 30 శాతం అదనపు చార్జీలను వసూలు చేయనున్నారు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖకు రెగ్యులర్‌ రైళ్లలో స్లీపర్‌ చార్జీ రూ.420 వరకు ఉంటే  ప్రత్యేక రైళ్లలో రూ.530 నుంచి రూ.550 ఉంటుంది. సికింద్రాబాద్‌ నుంచి మణుగూర్‌ వరకు ప్యాసింజర్‌ చార్జీ సాధారణంగా రూ.120 వరకు ఉంటే  ప్రత్యేక ప్యాసింజర్‌ ట్రైన్‌లో ఇది రూ.రూ.160 వరకు పెరగనుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement