ఇది కేవలం ఎముకల పుష్టికి దోహదపడే పోషకమే కాదు
దేహంలోని 40 లక్షల కోట్ల కణాల పనితీరును శాసించే హార్మోన్
భారతీయుల్లో 80 శాతం మందిలో విటమిన్–డీ లోపం
ఆహారంలో ఆరోగ్యకర కొవ్వులు లేకుంటే
సప్లిమెంట్ తీసుకున్నా ఫలితం సున్నా
మెటబాలిక్ హెల్త్ ఎక్స్‌పర్ట్ డాక్టర్ పీవీ సత్యనారాయణ
సాక్షి, స్పెషల్ డెస్క్: సూర్యరశ్మి పుష్కలంగా ఉండే భారత్‌లోనూ నూటికి 80 మందికిపైగా విటమిన్–డీ లోపంతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం ఎముకల బలానికి సంబంధించిన పోషకం మాత్రమే కాదని, శరీరంలోని 40 లక్షల కోట్ల కణాల పనితీరును, జన్యువుల వ్యక్తీకరణను శాసించే శక్తివంతమైన సన్‌షైన్ హార్మోన్ అని ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్, మెటబాలిక్ హెల్త్ నిపుణుడు డాక్టర్ పీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు.
ఏ ఎండ మేలు?
విటమిన్–డీ కోసం ఉదయపు లేత ఎండలో ఉంటే చాలదని.. మధ్యాహ్న ఎండ కూడా అవసరమేనని డాక్టర్ పీవీ సత్యనారాయణ చెప్పారు. ఉదయం లేత ఎండలో ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు ఉండి చర్మాన్ని విటమిన్–డీని గ్రహించడానికి సిద్ధం చేస్తే విటమిన్–డీ తయారీకి అవసరమైన అల్ట్రా వయొలెట్–బీ కిరణాలు ఉదయం 10–11 గంటల నుంచి మధ్యాహ్నం 2–3 గంటల మధ్య ఉండే ఎండలోనే ఉంటాయన్నారు.
ఎండలో నిలబడినప్పుడు నీడ మన ఎత్తులో సగం కంటే తక్కువగా ఉన్న ఆ సమయంలో ఎండ తగిలితే విటమిన్–డీ అధికంగా ఉత్పత్తి అవుతుందని.. అయితే చర్మానికి చురుక్కుమని అనిపించనంత వరకు ఈ ఎండ పరవాలేదని చెప్పారు. శరీరం రంగును బట్టి ఇది ఆధారపడి ఉంటుందన్నారు.
ఆహారంలో మార్పు తప్పనిసరి
విటమిన్–డీ కొవ్వులో కరిగే హార్మోన్ అయినందున కొలె్రస్టాల్ భయంతో నూనెలు, నెయ్యి పూర్తిగా మానేస్తే విటమిన్–డీ మాత్రలు వేసుకున్నా ఒంటికి పట్టవని డాక్టర్ సత్యనారాయణ చెప్పారు. లోపం ఉంటే సూర్యరశ్మి తగిలేలా చూసుకోవడంతోపాటు ఆరోగ్యకర కొవ్వు ఉండే చేపలు, గుడ్డు పచ్చసొన, నెయ్యి, వెన్న, ఫోరి్టఫైడ్ పాలను ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే ఆర్‌వో పద్ధతిలో శుద్ధి చేసిన తాగు నీరు అతివాడకం కూడా విటమిన్–డీ శోషణపై ప్రభావం చూపుతుందన్నారు.
విటమినా? హార్మోనా?
సాధారణ విటమిన్లు ఆహారాన్ని శక్తిగా మార్చే కో–ఎంజైమ్‌లుగా పనిచేస్తాయి. కానీ విటమిన్–డీ ఒకచోట తయారై రక్తం ద్వారా శరీరంలోని ప్రతి అవయవంపై ప్రభావం చూపుతుంది. చర్మంలో కొలె్రస్టాల్ ద్వారా తయారై కాలేయం, కిడ్నీలలో క్రియాశీలంగా మారుతుంది. కణ విభజనను, రోగనిరోధక శక్తిని నియంత్రిస్తుంది కాబట్టి దీన్ని హార్మోన్‌గా పరిగణించాలని డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు.
విటమిన్–డీ లోపిస్తే అకారణ నీరసం, కండరాలు–కీళ్ల నొప్పులు, నిద్రలేమి, ఆందోళన, వ్యాకులత వంటి అస్పష్ట లక్షణాలు కనిపిస్తాయని చెప్పారు. కేవలం రక్త పరీక్ష ద్వారానే దీన్ని కచ్చితంగా గుర్తించగలమన్నారు. శరీరంలో 30 నుంచి 70 నానోగ్రాముల మధ్య విటమిన్–డీ ఉండటం ఆరోగ్యకరమని వివరించారు. గుండె జబ్బులు, మధుమేహం, కేన్సర్ నివారణలోనూ, ఆ యుష్షును పెంచే టెలిమియర్స్ రక్షణలోనూ విటమిన్–డీ పాత్ర కీలకమన్నారు.
విటమిన్–డీ అధిక మోతాదుతో అనర్థమే
చండీగఢ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు విటమిన్–డీ టాక్సిసిటీ (మోతాదుకు మించి ఉండటం)తో ఆసుపత్రి పాలయ్యారు. చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్ వైద్యులు ప్రచురించిన ఈ కేసు నివేదిక ప్రకారం వారి రక్తంలో క్యాల్షియం స్థాయిలు ప్రమాదకర స్థాయికి చేరడమే కాకుండా పారాౖథెరాయిడ్ హార్మోన్ స్థాయిలు తగ్గిపోయాయి. కిడ్నీలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ప్యాకేజింగ్ లేకుండా స్థానికంగా కొనుగోలు చేసిన వంట నూనెలో విటమిన్–డీ3 అధిక మోతాదులో కలవడమే ఆ కుటుంబ సభ్యుల అనారోగ్యానికి కారణ మని వైద్యుల అధ్యయనంలో తేలింది. అది అక్రమంగా ఫోరి్టఫికేషన్ జరిగిన వంట నూనె అయ్యుండొచ్చని సందేహిస్తున్నారు. ప్రభుత్వం నిర్ధారించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆమోదముద్ర ఉన్న నూనెలనే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.


