రెండు కాంపోనెంట్లుగా గోదావరి–కావేరి నదుల అనుసంధానం
ఒక కాంపోనెంట్ కింద ఇచ్చంపల్లి నుంచి తెలంగాణకు 43 టీఎంసీలు
మరో కాంపోనెంట్ కింద పోలవరం నుంచి ఏపీ, ఇతర రాష్ట్రాలకు నీళ్లు
కేంద్రం పరిశీలనలో కొత్త ప్రతిపాదనలు
ఇచ్చంపల్లి వద్ద బరాజ్‌తో తెలంగాణకు 45 టీఎంసీలు ఇస్తే చాలు..
పోలవరం నుంచి బనకచర్లకూ తీసుకెళ్లవచ్చని చిట్‌చాట్‌లో సీఎం వెల్లడి
గోదావరి–కావేరిపై రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందానికి కేంద్రం యత్నాలు
పాలమూరు, పోలవరం–బనకచర్లపై పరస్పర సహకారాన్ని చేర్చే చాన్స్
సాక్షి, హైదరాబాద్: గోదావరి–కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా ఎక్కడి నుంచి నీళ్లు తరలించాలనే అంశంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న భేదాభిప్రాయాలు త్వరలో కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును రెండు కాంపోనెంట్లుగా (భాగాలు) విభజించి నిర్మించాలనే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఛత్తీస్‌గఢ్ వాడుకోకపోవడంతో మిగిలిపోయిన 148 టీఎంసీల గోదావరి జలాలను ఉపయోగించుకోవడానికి గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
ఈ ప్రాజెక్టు ద్వారా తరలించే 148 టీఎంసీల జలాల్లో 43 టీఎంసీలను తెలంగాణకు కేటాయించారు. ఒక కాంపోనెంట్ కింద తెలంగాణ కోరిక మేరకు గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి 43 టీఎంసీలను రాష్ట్రానికి తరలించనున్నారు. మరో కాంపోనెంట్ కింద ఏపీ కోరిక మేరకు పోలవరం ప్రాజెక్టు నుంచి మిగిలిన రాష్ట్రాలకు నీళ్లను తరలించే పనులు చేపట్టాలనే ప్రతిపాదనలు ప్రస్తుతం కేంద్రంపరిశీలనలో ఉన్నట్టు సమాచారం. కాగా ఈ ప్రతిపాదనలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం రాత్రి ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన అనంతరం.. వారితో పిచ్చాపాటిలో భాగంగా ఓ ప్రశ్నకు బదులిస్తూ ఈ మేరకు సంకేతాలిచ్చారు. ‘అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరిపై ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి తెలంగాణకు 45 టీఎంసీలను తరలించాలి. ఈ నీళ్లను మేము వేరే చోట (ప్రాజెక్టు) వాడుకుంటాం. మిగిలిన రాష్ట్రాలకు మరెక్కడి నుంచైనా గోదావరి నీళ్లను తరలించుకుంటే మాకేంటి? పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్లనీయండి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం వాడుకోకపోవడంతో మిగిలిపోయిన గోదావరి జలాలను తరలించుకుంటే మాకేం ఇబ్బంది ఉంటుంది?..’అని సీఎం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ధోరణిలో మార్పు
200 టీఎంసీల గోదావరి వరదల జలాలను తరలించడానికి పోలవరం–బనకచర్ల(నల్లమల్లసాగర్) ప్రాజెక్టు ప్రీఫీజబిలిటీ రిపోర్టు (పీఎఫ్‌ఆర్)ను ఏపీ ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి(సీడబ్ల్యూసీ) సమర్పించగా, దాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అసలు పీఎఫ్‌ఆర్‌ను పరిశీలించరాదని కేంద్రాన్ని కోరింది. సీఎం రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి .. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రంకూడా సమరి్పంచారు.
ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి శాఖ, సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డు, కృష్ణాబోర్డు, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలకు అప్పట్లో లేఖలు రాశారు. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ధోరణిలో మార్పు వచ్చినట్లు స్పష్టమవుతోంది. గోదావరి–కావేరి నదుల అనుసంధానంలో ప్రాజెక్టులో భాగంగా ఇతర రాష్ట్రాలకు పోలవరం నుంచి నీళ్లను తరలించుకుంటే అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి పేర్కొనడం ఇందుకు నిదర్శనం.
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) ఇస్తే, బదులుగా పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ఎన్‌ఓసీ ఇచ్చే ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నాయా? అని ప్రశ్నించగా.. సీఎం ఈ మేరకు వివరణ ఇచ్చారు. పాలమూరు–రంగారెడ్డి, పోవలరం–బనకచర్ల రెండు వేర్వేరు ప్రాజెక్టులని, రెండింటికీ సంబంధం లేదని అన్నారు.
మరోవైపు ఇచ్చిపుచ్చుకునే విధానంలో జల వివాదాలను పరిష్కరించుకోవాలని ఇటీవల జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సూచించారు. ఈ నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏపీ సమ్మతిస్తే గోదావరి–కావేరి ప్రాజెక్టులో అంతర్భాగంగా పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు నిర్మించుకోవడానికి తెలంగాణ సహకరించాలనే ప్రతిపాదనలను రెండు రాష్ట్రాల ముందు కేంద్ర ప్రభుత్వం ఉంచినట్టు నీటిపారుదల శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ మేరకు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిర్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.
త్వరలో పాలమూరు–రంగారెడ్డికు లైన్‌క్లియర్!
ఛత్తీస్‌గఢ్ వాడుకోకపోవడంతో మిగిలిపోయిన 148 టీఎంసీల్లో తెలంగాణకు 43 టీఎంసీలు, ఏపీకి 45.27 టీఎంసీలు, తమిళనాడుకు 40.82 టీఎంసీలు, కర్ణాటకకు 15.89 టీఎంసీలు, పుదుచ్చేరికి 2.29 టీఎంసీలను అనుసంధానం ప్రాజెక్టు డీపీఆర్‌లో కేంద్రం కేటాయించింది. ఈ నేపథ్యంలో ఇచ్చంపల్లి వద్ద బరాజ్ నిర్మించి తెలంగాణకు తరలించే 43–45 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు ఎగువన నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అవసరాలకు వాడుకోవాలని తెలంగాణ భావిస్తోంది.
పోలవరం ప్రాజెక్టు ద్వారా 90 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే అందుకు బదులుగా నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు 90 టీఎంసీలను వాడుకునేందుకు బచావత్ ట్రిబ్యునల్ ఎదుట అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగింది. అయితే ఎగువ రాష్ట్రాలు వాడుకోగా మిగిలే 45 టీఎంసీలతో పాటు మైనర్ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన 45 టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీల కృష్ణా జలాలను తరలించడానికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును తెలంగాణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
అయితే పోలవరం ద్వారా గోదావరి జలాల మళ్లింపుతో అందుబాటులోకి వచ్చిన జలాల్లో మిగిలి ఉన్న 45 టీఎంసీల్లో తమ రాష్ట్రానికీ హక్కులున్నాయని, పూర్తిగా తెలంగాణ ఎలా వాడుకుంటుందని ఏపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకుండా డీపీఆర్‌ను గతంలో సీడబ్ల్యూసీ వెనక్కి పంపించింది.
తాజాగా గోదావరి–కావేరి అనుసంధానం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు తరలించనున్న 43–45 టీఎంసీల జలాలతో పాటు మైనర్ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన 45 టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకి అనుమతులు సాధించాలనే యోచనలో తెలంగాణ ఉన్నట్టు తెలిసింది. పోలవరం–బనకచర్లకు తెలంగాణ సమ్మతిస్తే పాలమూరు–రంగారెడ్డికి సమ్మతి తెలిపేందుకు ఏపీ సంసిద్ధతతో ఉన్నట్టు సమాచారం. ఇటీవల పాలమూరు జిల్లా పర్యటనకు వెళ్లిన సీఎం.. ఈ ప్రాజెక్టు విషయంలో త్వరలో శుభవార్త తెలియజేస్తామని ప్రకటించడం ఇందుకు బలాన్ని ఇస్తోంది.


