భారత్‌ స్టార్‌లింక్‌ పంచాయితీలో బిగ్‌ ట్విస్ట్‌! | Elon Musk Wants India to Clear Starlink But His Own Grok Lists Downsides | Sakshi
Sakshi News home page

భారత్‌ స్టార్‌లింక్‌ పంచాయితీలో బిగ్‌ ట్విస్ట్‌!

Oct 9 2026 2:30 PM | Updated on Oct 9 2026 2:46 PM

Elon Musk Wants India to Clear Starlink But His Own Grok Lists Downsides

భారత్‌లో తన స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల విషయంలో ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. గుత్తాధిపత్యం ప్రదర్శించే వ్యాపార శక్తులు అడ్డుకుంటున్నాయని.. అదెవరో అందరికి తెలుసని అన్నారు. ఆ తర్వాత అంబానీ పేరు ప్రస్తావించారు. అయితే.. భారత ప్రభుత్వం మాత్రం అవన్ని ఆరోపణలని తోసిపుచ్చింది. ఈలోపే ఈ ఎపిసోడ్‌లో ఓ బిగ్‌ట్విస్ట్‌ చోటు చేసుకుంది.

స్టార్‌లింక్‌కు అనుమతి ఇవ్వాలని ఎలాన్‌ మస్క్‌ పట్టుబడుతుంటే.. ఆయన సొంత ఏఐ చాట్‌బాట్‌ గ్రోక్‌ మాత్రం ఆ సేవల్లోని లోపాలను ఎత్తి చూపింది. స్టార్‌లింక్‌కు.. భారత్‌ అనుమతి ఇస్తే ఎదురయ్యే ప్రతికూలతలు ఏమిటి?, అని ఓ వినియోగదారు అడగ్గా.. జాతీయ భద్రత, డేటాపై నియంత్రణ, అధిక ధరలు, విదేశీ సంస్థపై ఆధారపడటం వంటి అంశాలను గ్రోక్ ప్రస్తావించింది.  దీంతో.. స్టార్‌లింక్‌ కోసం మస్క్‌ చేస్తున్న ప్రయత్నాల వేళ, ఆయన సొంత చాట్‌బాట్‌ ఇచ్చిన సమాధానం సోషల్‌ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

స్టార్‌లింక్‌ ప్రధాన లక్ష్యం
మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ నిర్వహిస్తున్న స్టార్‌లింక్‌.. భూమికి సమీప కక్ష్యలోని వేలాది ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్‌ సేవలు అందిస్తుంది. సంప్రదాయ మొబైల్‌ నెట్‌వర్క్‌లు, ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ అందుబాటులో లేని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ చేరవేయడం దీని ప్రధాన లక్ష్యం. అయితే.. కీలక సమాచార వ్యవస్థపై విదేశీ సంస్థకు నియంత్రణ ఉండటం జాతీయ భద్రత పరంగా సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని గ్రోక్‌ పేర్కొంది.

సరిహద్దు ప్రాంతాల్లో లేదా అత్యవసర పరిస్థితుల్లో సేవలను నిలిపివేయాల్సి వస్తే.. వాటిపై భారత్‌కు ఎంతవరకు నియంత్రణ ఉంటుంది?, సంక్షోభ సమయాల్లో నెట్‌వర్క్‌ అందుబాటును ఎలా నిర్ధారించాలి?, వంటి ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. శాటిలైట్‌ ఇంటర్నెట్‌ పరికరాలను అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశాలపైన భద్రతా సంస్థలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ చర్చ గుర్తుచేస్తోంది.

గ్రోక్ ప్రస్తావించిన మరో అంశం డేటాపై అధికారం. అంటే.. భారతీయుల సమాచారంపై దేశానికి చట్టబద్ధమైన నియంత్రణ ఉండటం. స్టార్‌లింక్‌ ఉపగ్రహాల మధ్య అనుసంధానం, అంతరిక్షంలోని లేజర్‌ లింకుల ద్వారా డేటా ప్రసారం వంటి సాంకేతికతలు సమాచార ప్రవాహాన్ని సంక్లిష్టం చేయవచ్చు. దీంతో.. చట్టబద్ధమైన పర్యవేక్షణ, అవసరమైనప్పుడు సమాచారాన్ని పొందడం వంటి అంశాల్లో సవాళ్లు తలెత్తే అవకాశం ఉంటుంది.

అయితే.. భారత ప్రభుత్వం ఇప్పటికే శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలకు సంబంధించిన భద్రతా నిబంధనలను నిర్దేశించింది. దేశీయ వినియోగదారుల ట్రాఫిక్‌ను విదేశీ గేట్‌వేల ద్వారా మళ్లించకూడదని, భారతీయ డేటాను విదేశాల్లో కాపీ చేయడం వంటి వాటిపై ఆంక్షలు ఉన్నాయని కేంద్రం గతంలో పార్లమెంటుకు తెలిపింది. కాబట్టి.. డేటా భద్రత విషయంలో ప్రశ్నలున్నప్పటికీ, వాటిని పరిష్కరించేందుకు ఎలాంటి నిబంధనలు ఉండాలన్నదే అసలు అంశం.

సామాన్యులకు అందుబాటులో ఉంటుందా?
స్టార్‌లింక్‌ సేవలు.. సామాన్య వినియోగదారులకు అందుబాటు ధరలో ఉంటాయా? అనేది ముఖ్యమైన ప్రశ్న. శాటిలైట్‌ ఇంటర్నెట్‌ పరికరాల కొనుగోలు ఖర్చు, నెలవారీ చందా కలిపి సంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్‌, మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవల కంటే ఎక్కువయ్యే అవకాశం ఉందని గ్రోక్‌ పేర్కొంది. భారత్‌లో రిలయన్స్‌ జియో, భారతి ఎయిర్‌టెల్‌ వంటి సంస్థలు అందిస్తున్న సేవలతో పోలిస్తే.. స్టార్‌లింక్‌ ధరలు ఎలా ఉంటాయన్నది వినియోగదారులకు కీలకం కానుంది.

ముఖ్యంగా.. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ అందించడమే స్టార్‌లింక్‌ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. అయితే, ధరలు ఎక్కువగా ఉంటే, ఆ సేవలు అవసరమైన వారిలో ఎంతమంది వినియోగించుకోగలరన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. మరోవైపు, భౌగోళికంగా చేరుకోవడం కష్టమైన ప్రాంతాల్లో.. శాటిలైట్ ఇంటర్నెట్‌ ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల ధరల అంశాన్ని సేవల ప్రయోజనాలతో కలిపి పరిశీలించాల్సి ఉంటుంది.

దేశీయ సంస్థలకు పోటీ.. గ్రోక్ హెచ్చరిక!
భారత్‌లో ఇప్పటికే టెలికాం, ఇంటర్నెట్‌ రంగాల్లో పలు సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ మార్కెట్‌లో స్టార్‌లింక్‌ ప్రవేశిస్తే పోటీ పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో.. కీలక సమాచార మౌలిక సదుపాయాల కోసం ఒక విదేశీ సంస్థపై అధికంగా ఆధారపడటం దీర్ఘకాలంలో సమస్యగా మారవచ్చని గ్రోక్‌ హెచ్చరించింది.

అయితే.. పోటీ పెరగడం వల్ల వినియోగదారులకు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం నాణ్యమైన ఇంటర్నెట్‌ అందుబాటులో లేని ప్రాంతాల్లో కొత్త సేవలు ఉపయోగపడవచ్చు. ఈ నేపథ్యంలో దేశీయ సంస్థలతో పోటీ, వినియోగదారులకు అందే ప్రయోజనాలు, భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ నియంత్రణ మధ్య సమతుల్యత సాధించడం కీలకం.

మస్క్‌ వాదన
స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతులు ఆలస్యమవుతున్నాయంటూ.. మస్క్‌ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు బడా వ్యాపారవేత్తలు తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడానికి స్టార్‌లింక్‌ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భారత ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలకు సంబంధించిన అనుమతుల విధానం న్యాయంగా, వివక్ష లేకుండా అమలవుతోందని, మూడు సంస్థలు దాదాపు ఒకే నియంత్రణ దశలో ఉన్నాయని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: రాజీనామా లెటర్‌తో బాస్‌కు షాక్.. బయటపడ్డ అసలు నిజం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement