2026–27లో 32–33 బిలియన్ డాలర్లకు చేరిక.. 6 శాతం వృద్ధి
ఫార్మెక్సిల్ డీజీ రాజా భాను వెల్లడి
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఉత్పత్తుల ఎగుమతులు 32–33 బిలియన్ డాలర్లకు చేరనున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 5–6 శాతం పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. సీపీహెచ్‌ఐ ఇండియా 2026 కార్యక్రమంలో పాల్గొన్న ఫార్మెక్సిల్ డైరెక్టర్ జనరల్ కె. రాజా భాను ఈ విషయాలు తెలిపారు. అమెరికాకు ఎగుమతులు నెమ్మదించినప్పటికీ భారత్ కొత్త మార్కెట్లపై దృష్టి పెడుతోందని, లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లో విస్తరిస్తోందని ఆయన చెప్పారు.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ఈ ఏడాది వివిధ సరఫరా వ్యవస్థల్లో అంతరాయాలు ఏర్పడినా.. వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ద్వారా డైవర్సిఫికేషన్‌తో ప్రతికూల పరిస్థితులను భారత్ అధిగమించగలిగిందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని ఐఐసీసీలో సోమవారం ప్రారంభమైన సీపీహెచ్‌ఐ ఇండియా 2026 సదస్సు మూడు రోజుల పాటు జరుగుతుంది. ఈ ఏడాది దీన్ని రెండు వేదికల్లో (ఐఐసీసీ, ఇండియా ఎక్స్‌పో మార్ట్) నిర్వహిస్తున్నారు. 120 పైగా దేశాల నుంచి సుమారు 2,000 మంది పైగా ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొంటుండగా, 50,000 మంది సందర్శిస్తారని అంచనా.
ఫార్మా తయారీ పటిష్టం..
మరోవైపు, భారత ఫార్మా పరిశ్రమ పటిష్టమైన తయారీ పనితీరు కనపరుస్తోందని ఇన్ఫోర్మా మార్కెట్స్ ఎండీ యోగేశ్ ముద్రాస్ తెలిపారు. క్రితం ఐదేళ్ల వ్యవధితో పోలిస్తే 2026 ఆర్థిక సంవత్సరంలో సగటున 9.2 శాతం వృద్ధితో రూ. 5.08 లక్షల కోట్ల వార్షిక టర్నోవరు స్థాయికి చేరిందని పేర్కొన్నారు. దీనితోపాటు దేశీయంగా వైద్య పరికరాల తయారీ కూడా 48.2 శాతం ఎగిసిందని చెప్పారు. 2019–20లో రూ. 28,000 కోట్లుగా ఉన్న ఈ పరిశ్రమ 2024–25లో రూ. 41,500 కోట్లకు చేరిందన్నారు. అధునాతన బయోలాజిక్స్, స్పెషలైజ్డ్ థెరపీలు, సంక్లిష్ట ఫార్ములేషన్స్ లాంటి అధిక విలువ పలికే సెగ్మెంట్లలోకి మళ్లే సామర్థ్యాలను బట్టి తదుపరి దశ వృద్ధి ఆధారపడి ఉంటుందన్నారు.


