రాజీనామా లెటర్‌తో బాస్‌కు షాక్.. బయటపడ్డ అసలు నిజం! | Employee Quits Toxic Job After Months Of Surveillance | Sakshi
Sakshi News home page

రాజీనామా లెటర్‌తో బాస్‌కు షాక్.. బయటపడ్డ అసలు నిజం!

Oct 6 2026 8:59 AM | Updated on Oct 6 2026 9:16 AM

Employee Quits Toxic Job After Months Of Surveillance

ఉద్యోగం అంటే.. కేవలం జీతం కోసం పనిచేయడం మాత్రమే కాదు. రోజులో ఎక్కువ సమయం గడిపే ప్రదేశం ఆఫీస్.. కావడంతో అక్కడ మంచి వాతావరణం, గౌరవం, పని-వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత కూడా చాలా ముఖ్యం. అయితే.. కొన్నిసార్లు ఉద్యోగులకు పని ప్రదేశంలో ఎదురయ్యే పరిస్థితులు తీవ్ర ఒత్తిడికి గురిచేస్తాయి. తాజాగా రెడ్డిట్‌లో ఓ ఉద్యోగి పంచుకున్న అనుభవం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఒక రెడ్డిట్‌ యూజర్ తన ఉద్యోగ అనుభవాన్ని షేర్ చేశారు. ఇందులో.. తాను చేరినప్పుడు సాధారణ కార్పొరేట్ ఉద్యోగం లభించిందని భావించానని, కానీ అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని చెప్పారు. తన బాస్ ఉద్యోగులపై తీవ్ర స్థాయిలో నిఘా పెట్టేవారని ఆయన ఆరోపించారు.

ఆఫీసులో హై-డెఫినిషన్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి ఉద్యోగుల కంప్యూటర్ స్క్రీన్లను కూడా జూమ్ చేసి చూడగలిగేవారని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు ఎవరితో చాట్ చేస్తున్నారు, ఏ పని చేస్తున్నారు వంటి విషయాలను కూడా గమనించేవారని ఆరోపించారు. దీంతో.. ఉద్యోగులపై నమ్మకం లేని వాతావరణం ఏర్పడిందని ఆయన చెప్పుకొచ్చారు.

వారానికి ఏడురోజులు పని
ఇంతటితో పరిస్థితి ఆగలేదని ఆ ఉద్యోగి తెలిపారు. వారానికి ఏడు రోజులు పనిచేయాల్సి వచ్చేదని, వారాంతాలు, సెలవులు, లీవులు కూడా లేకుండా పని చేయించేవారని చెప్పారు. కొన్నిసార్లు రాత్రి 2 గంటల వరకు ఆఫీసులో ఉండాల్సి వచ్చేదని ఆరోపించారు. ఆలస్యంగా ఆఫీసుకు వచ్చిన ఉద్యోగులను శిక్షగా బయట నిలబెట్టేవారని కూడా పేర్కొన్నారు.

సాయంత్రం సమయంలో.. ఉద్యోగులను బాల్కనీలో ఉంచి, ఆ రోజు ఆఫీసుకు రాని ఉద్యోగుల గురించి బాస్ విమర్శలు చేసేవారని కూడా ఆయన తన అనుభవంలో వివరించారు. ఇలాంటి పరిస్థితులు నెలల తరబడి కొనసాగడంతో తాను తీవ్రంగా అలసిపోయానని, మానసికంగా కూడా ఒత్తిడికి గురయ్యానని చెప్పారు.

చివరికి ఆ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే.. సాధారణంగా రాజీనామా చేసే విధంగా కాకుండా, తనకు ఎదురైన ప్రతి విషయాన్ని వివరంగా రాసి రెజిగ్నేషన్ ఈమెయిల్‌ను మొత్తం టీమ్‌కు పంపించారు. తన బాస్ ప్రవర్తన, పని పరిస్థితులు, తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఆ మెయిల్‌లో స్పష్టంగా పేర్కొన్నట్లు చెప్పారు.

మరుసటి రోజు ఉదయమే ఆఫీసుకు వెళ్లి తన వస్తువులను తీసుకున్నారు. ఆ సమయంలో తన బాస్ ఇంకా నిద్రలోనే ఉన్నారని, ఎలాంటి గొడవకు వెళ్లకుండా అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపారు. ఆ ఆఫీసు నుంచి బయటకు రావడాన్ని తనకు ఒక ‘కార్పొరేట్ జైలు నుంచి విముక్తి’ లాగా అనిపించిందని వివరించారు.

నెటిజన్ల స్పందన
ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందనలు వచ్చాయి. కొందరు ఆ ఉద్యోగికి మద్దతుగా నిలిచారు. ఒకరు రాజీనామా మెయిల్‌కు బాస్ ఏమైనా స్పందించారా అని అడగగా, ఉద్యోగి 'లేదు.. అతని అహంకారం అందరికంటే పెద్దది' అని సమాధానమిచ్చారు. మరో వ్యక్తి ఆ ఉద్యోగికి మద్దతు తెలుపుతూ, ఇలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే విషయం బయటకు తీసుకురావాలని వ్యాఖ్యానించారు. ఇంకొకరు మాత్రం ఉద్యోగి ఆ పరిస్థితి నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉందని, ఇక ముందు అతనికి మంచి రోజులు వస్తాయని ధైర్యం చెప్పారు.

ఇదీ చదవండి: ప్రతి ఏడాది హైక్ వస్తున్నా.. జీతం తక్కువేనా?: కారణం ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement