ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికీ జీతం చాలా ముఖ్యం. కానీ కెరీర్ ప్రారంభంలో మనం తీసుకునే జీతం.. తర్వాత మన సంపాదనపై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా.. మొదటి ఉద్యోగంలోనే తక్కువ జీతంతో చేరి, ఆ తర్వాత ప్రతిసారీ కంపెనీ మారినప్పుడు పాత జీతంపై కొంత శాతం మాత్రమే పెంచుకుంటూ వెళ్తే.. ఏళ్ల తర్వాత కూడా మన జీతం చాలా తక్కువగా ఉండొచ్చు. ఈ విషయాన్ని వ్యాపారవేత్త వన్యా గోయెల్ వెల్లడించారు.
వన్యా గోయెల్ ప్రకారం.. కెరీర్ ప్రారంభంలో తక్కువ జీతం తీసుకునే ఉద్యోగులు చాలాసార్లు ఒక రకమైన శాలరీ సైకిల్‌లో చిక్కుకుపోతారు. అంటే.. కొత్త కంపెనీలో జీతం నిర్ణయించేటప్పుడు కూడా వారి పాత జీతాన్నే ఆధారంగా తీసుకుంటారు.
ఉదాహరణకు ఒక ఉద్యోగి తన కెరీర్‌ను ఏడాదికి రూ.6 లక్షల జీతంతో ప్రారంభించాడనుకుందాం. ఉద్యోగం మారినప్పుడు 20 శాతం హైక్ వస్తే.. జీతం రూ.7.2 లక్షలకు చేరుతుంది. ఆ తర్వాత మరో హైక్‌తో రూ.8.6 లక్షలు కావచ్చు. తర్వాత రూ.10.3 లక్షలు. ఇలా చూస్తే ప్రతి దశలో జీతం పెరుగుతూనే ఉంటుంది. కానీ అతని అనుభవం, నైపుణ్యాలకు మార్కెట్‌లో ఇంకా ఎక్కువ జీతం లభించే అవకాశం ఉంది. అంటే.. జీతం పెరుగుతున్నప్పటికీ.. మార్కెట్‌తో పోలిస్తే వెనుకబడిపోతున్నాం అనేది స్పష్టంగా అర్థమవుతుంది.
ఎంత హైక్ వస్తుందని కాదు
ఇక్కడే వన్యా గోయెల్ ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నారు. ఉద్యోగులు ప్రతిసారీ ''నాకు ఎంత శాతం హైక్ వస్తుంది?'' అని మాత్రమే ఆలోచించకూడదు. కొన్ని సందర్భాల్లో సాధారణ హైక్ కాకుండా.. శాలరీ కరెక్షన్ అవసరం కావచ్చు. అంటే.. మనం చేస్తున్న పని, మనకున్న అనుభవం, బాధ్యతలు, మార్కెట్‌లో ఉన్న శాలరీ రేంజిని బట్టి జీతాన్ని ఒకేసారి సరిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఉదాహరణకు ఒక ఉద్యోగి మార్కెట్‌లో రూ.15 లక్షల జీతం పొందే స్థాయిలో ఉన్నా.. అతని ప్రస్తుత జీతం రూ.10 లక్షలు అనుకుందాం. కొత్త కంపెనీ 20 శాతం హైక్ ఇచ్చినా జీతం రూ.12 లక్షలకే చేరుతుంది. కాగితంపై చూస్తే మంచి హైక్ వచ్చినట్టే కనిపిస్తుంది. కానీ మార్కెట్‌తో పోలిస్తే అతను ఇంకా వెనుకబడే ఉంటాడు.
మార్కెట్ వాల్యూ తెలుసుకో
అందుకే ఉద్యోగులు తమ మార్కెట్ వాల్యూ ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మనం ఎంత జీతం తీసుకుంటున్నామన్నదే మన విలువను నిర్ణయించదు. మన స్కిల్స్, అనుభవం, బాధ్యతలు, పనితీరు అలాగే కంపెనీకి మనవల్ల వస్తున్నా ఫలితాలు మన విలువను నిర్ణయిస్తాయి.
మరో విషయం ఏమిటంటే.. కష్టపడి పనిచేయడం మాత్రమే కెరీర్ ఎదుగుదలకు సరిపోదు. మనం చేసిన పనిని, సాధించిన ఫలితాలను ఇతరులకు కూడా తెలియజేయాలి. ఉదాహరణకు.. ''నేను చాలా కష్టపడి పనిచేశాను అని చెప్పడం కంటే.. నా పని వల్ల కంపెనీకి ఇంత రెవెన్యూ పెరిగింది, ఖర్చు ఇంత తగ్గింది, ఇంతమంది కస్టమర్స్ పెరిగారు'' అని స్పష్టంగా చెప్పగలిగితే, మన విలువను అర్థం చేసుకోవడం ఇతరులకు సులభం అవుతుంది. అవసరమైనప్పుడు జీతం గురించి మాట్లాడటానికి కూడా వెనుకాడకూడదు.
ఇదీ చదవండి: డబ్బు విలువ పడిపోతే?.. సిద్ధంగా ఉండాలంటున్న కియోసాకి


