నిరుద్యోగులకు రూ.7 కోట్ల టోకరా | Extorting money by falsely claiming to be relatives of Jana Sena leaders | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు రూ.7 కోట్ల టోకరా

Nov 13 2026 5:14 AM | Updated on Nov 13 2026 5:14 AM

Extorting money by falsely claiming to be relatives of Jana Sena leaders

జనసేన నేతల బంధువులమంటూ నమ్మించి వసూళ్లు 

నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు, ఫేక్‌ ఐడీ కార్డుల సృష్టి 

మంగళగిరి రూరల్‌: జనసేన నేతల పేర్లు చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి సుమారు రూ.7 కోట్ల మేర వసూలు చేసిన మోసం తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళ్తే.. ధరణి కృష్ణ అనే మహిళ జనసేన నాయకులు కల్యాణం శివ శ్రీనివాస్, కోటా రుక్మిణి తమకు బంధువులని చెప్పుకుంటూ పలువురు నిరుద్యోగులను మోసం చేసినట్లు తెలుస్తోంది. ఏలూరు, తణుకు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 25 మంది నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మించి వారి నుంచి రూ.లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. 

పోలీస్‌ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తాడేపల్లిగూడెంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి నుంచి రూ.25 లక్షలు, లండన్‌లో పనిచేస్తున్న మరో వ్యక్తి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది. అలాగే, దేవదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఈమె పలువురి నుంచి నగదు తీసుకుంది. బాధితులను నమ్మించేందుకు నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లు, ఫేక్‌ ఐడీ కార్డులు సృష్టించి అక్రమార్జనకు పాల్పడుతోంది. జనసేన నాయకుడు కళ్యాణం శివ శ్రీనివాస్‌ తనకు బాబాయి అవుతారని ధరణి కృష్ణ చెప్పుకుంటూ ఈ వ్యవహారాన్ని కొనసాగించినట్లు పలువురు నేతలు వెల్లడించారు. 

ఈ విషయం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం దృష్టికి చేరడంతో కళ్యాణం శివ శ్రీనివాస్‌ స్పందిస్తూ ధరణి కృçష్ణ ఎవరో తనకు తెలియదని, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంతో తనకు ఎటువంటి సంబంధం లేదని, వాస్తవాలు వెలుగులోకి రావాలని కోరుతూ కళ్యాణం శివ శ్రీనివాస్, కోటా రుక్మిణి బుధవారం మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ధరణి కృష్ణపై ఫిర్యాదు చేశారు. మోసం వెనుక ఉన్న వ్యక్తులు, నగదు వసూళ్లు, నకిలీ పత్రాల తయారీ తదితర అంశాలపై విచారణ జరిపి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు తెలిపినట్లు పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement