శ్రీకాళహస్తి ప్రసాదాల పోటులో అగ్నిప్రమాదం | Fire Accident At Srikalahasti Temple | Sakshi
Sakshi News home page

శ్రీకాళహస్తి ప్రసాదాల పోటులో అగ్నిప్రమాదం

Nov 13 2026 5:12 AM | Updated on Nov 13 2026 5:12 AM

Fire Accident At Srikalahasti Temple

భారీగా ఎగిసిపడిన అగ్ని కీలలు.. కమ్మేసిన పొగ 

పరుగులు తీసిన భక్తులు, ఉద్యోగులు 

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయ ప్రసాదాల తయారీ పోటులో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో ఒక్కసారిగా భక్తులు, ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పోటులో గల భారీ బాండలిలో నూనె వేడెక్కుతున్న నూనె పైకి చిమ్మడంతో నూనె పడిన ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. దీంతో అగ్నికీలలు భారీగా ఎగిసిపడుతూ చుట్టుపక్కల ఉన్న గోనె సంచులు, పక్క బాండలిలోని నూనెకు వ్యాపించాయి. 

దట్టమైన పొగ కమ్ముకుంది. క్షణాల్లోనే పరిస్థితి అదుపు తప్పడంతో అక్కడున్న భక్తులు, ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. పైన ఉన్న విద్యుత్‌ వైర్లు కాలిపోయి షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. వైర్ల నుంచి వెలువడిన నిప్పు రవ్వలు వేడి నూనెలో పడటంతో మంటలు చెలరేగి ఉంటాయని అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

అగ్నిమాపక ప్రమాణాలు ఎక్కడ? 
ఆలయ ప్రసాదాల తయారీ కేంద్రంలో నిత్యం భారీ సంఖ్యలో ప్రసాదాలు తయారు చేస్తుంటారు. ఇలాంటి చోట అగ్నిప్రమా­దం జరిగితే మంటలను తక్షణమే అదుపు చేసే వ్యవస్థలు అందుబాటులో ఉండాలి. భారీ పరిమాణంలో నూనె­ను వేడిచేసే బాండలి వద్ద విద్యుత్‌ భద్రత, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర స్పందన వ్యవ­స్థలు తప్పనిసరిగా ఉండాలి. 

నూనె మంటలను ఆర్పేందుకు అనువైన అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచడంతో పాటు వాటిని వినియోగించే సిబ్బందికి తగిన శిక్షణ కూడా అవస­రం. ఈ ఘటన నేపథ్యంలో ప్రసాదాల తయారీ పోటులో అగ్నిమాపక ప్రమాణాలు పూర్తిస్థాయి­లో అమలవుతున్నాయా, వి­ద్యు­త్‌ వైర్లకు, వేడినూనె బాండలిలకు మధ్య తగిన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.అగ్నిమాపక ప్రమాణాలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, లోపాలను గుర్తించి సరిదిద్దాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement