చిత్తూరు–తిరుపతి హైవేపై రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు
చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యానికి విద్యార్థులు బలి
ఫీజు రీయింబర్స్మెంట్ నిలిచిపోవడంతో ఉక్కిరిబిక్కిరి
బకాయిల కోసం ఒత్తిళ్లు పెంచిన కాలేజీ యాజమాన్యాలు
చిత్తూరులో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాల వేధింపులు
ట్రిపుల్ ఐటీల్లోనూ వేధింపులు.. డిగ్రీలు ఇవ్వాలంటే పాత బకాయిలు కట్టాల్సిందే!
విద్యాదీవెన 13 త్రైమాసికాలు.. రూ. 9,100 కోట్లు బాకీ
అరకొర విదిల్చిన చంద్రబాబు .. ఇంకా 6,300 కోట్లకుపైనే బకాయి
వసతి దీవెన మూడేళ్లలో రూ. 3,300 కోట్లు గుండు సున్నా
విద్యాదీవెన, వసతిదీవెన కలిపితే.. మొత్తం రూ. 9,600 కోట్లకు పైనే బకాయిలు
10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థుల పాలిట ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మరణశాసనంగా మారుతున్నాయి. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం.. మరోవైపు ఫీజులు చెల్లించాలంటూ ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తుండటంతో చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎస్వీసెట్)లో బీటెక్ రెండో సంవత్సరం (సీఎస్ఈ) చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
ప్రభుత్వం నుంచి రెండు క్వార్టర్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ కాకపోవడంతో.. సుమారు రూ.35 వేల బకాయిలను విద్యార్థులే చెల్లించాలని యాజమాన్యం, ప్రిన్సిపల్ తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఫీజు కట్టకపోతే జరిమానా విధిస్తామని, సెమిస్టర్ పరీక్షలు రాయనివ్వమని బెదిరించారని చెబుతున్నారు. జిల్లా కలెక్టర్‌కు ఈ–మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఇక మరణమే శరణ్యమని భావించారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చిత్తూరులో జరిగిన ఈ దుర్ఘటన కూటమి ప్రభుత్వ పాలనలో విద్యారంగం ఎదుర్కొంటున్న సంక్షోభానికి అద్దం పడుతోంది.
ఆందోళనలో 10 లక్షల మంది విద్యార్థులు
చిత్తూరు దుర్ఘటన ఒక్క కళాశాలకే పరిమితమైన సమస్య కాదు. గత రెండున్నరేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు విద్యార్థులను పరీక్షలు రాయనివ్వడం లేదు. పరీక్షలు రాసిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. దీంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద ఏటా 10 లక్షల మందికి పైగా విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. వీరిలో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులు ఉన్నారు.
కన్వీనర్ కోటా కింద ఏటా సుమారు 1.80 లక్షల మందికి పైగా ఇంజినీరింగ్ సీట్లలో, మరో 60 వేల మందికి పైగా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలు పొందుతున్నారు. నాలుగు విద్యా సంవత్సరాలకు కలిపి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 నుంచి 5 లక్షల మంది ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి చదువుతున్నారు. వీరికి ఏటా రూ.40 వేల నుంచి రూ.70 వేలకుపైగా ఫీజులు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం క్వార్టర్ల వారీగా నిధులు విడుదల చేయకపోవడంతో ఆ భారం తల్లిదండ్రులపై పడుతోంది. ఫీజులు చెల్లించే స్థోమత లేని కుటుంబాలకు చెందిన ఫైనలియర్ విద్యార్థులు సైతం బకాయిల కారణంగా సర్టిఫికెట్లు పొందలేక ఎంటెక్, విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నారు.
13 త్రైమాసికాలు పెండింగ్..
గత ప్రభుత్వ హయాంలో విద్యా దీవెన, వసతి దీవెన క్రమం తప్పకుండా చెల్లించేవాళ్లు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ లేదు.. వసతి దీవెన లేదు... విద్యాదీవెన 2024 జనవరి–మార్చి త్రైమాసికం నుంచి పెండింగ్. (ఎన్నికల కోడ్ రావడంతో చివరి ఒక్క త్రైమాసికమే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్) చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విద్యా సంవత్సరం చివరి వరకు చూస్తే మొత్తం 13 త్రైమాసికాలు పెండింగ్. ప్రతి క్వార్టర్‌కు రూ.700 కోట్లు. అంటే మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ రూ.9,100 కోట్లు బాకీ. సాధారణంగా వసతి దీవెన ప్రతి ఏప్రిల్‌లో ఇస్తారు.
ఏప్రిల్ 2024, ఏప్రిల్ 2025, ఏప్రిల్ 2026. ఏటా రూ.1,100 కోట్లు. ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది. దీంతో రూ.3,300 కోట్లు బాకీ. విద్యాదీవెన బాకీ రూ.9,100 కోట్లు, వసతి దీవెన బాకీ రూ.3,300 కోట్లు కలిపితే మొత్తం రూ.12,400 కోట్లు. కానీ, చంద్రబాబు ఇచ్చింది ఎంత అంటే ఒకసారి రూ.1,700 కోట్లు. మరోసారి రూ.1,100 కోట్లు. అంటే ఇంకా రూ.9,600 కోట్లకు పైగా బాకీ పడ్డారు. ఫీజులు చెల్లించలేక పిల్లలు చదువులు మానేసే దుస్థితి. లేదంటే యాజమాన్యాల ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవలసిన దుర్గతి.
వసతి దీవెనకు పూర్తిగా మంగళం
రాష్ట్రవ్యాప్తంగా బీఎస్సీ, బీకాం, బీఏతో పాటు పీజీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సుల్లో మరో 6 నుంచి 7 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందాల్సి ఉంది. అలాగే ట్యూషన్ ఫీజుతో పాటు వసతి, భోజన ఖర్చుల కోసం ఐటీఐ విద్యార్థులకు ఏటా రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై కోర్సుల విద్యార్థులకు రూ.20 వేల చొప్పున ప్రభుత్వం అందించాల్సి ఉంది. సకాలంలో ఈ నిధులు జమ కాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు అద్దెలు చెల్లించలేక, పరీక్ష ఫీజులు కట్టలేక చదువును మధ్యలోనే ఆపేయాల్సిన దుస్థితి నెలకొంది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి వచ్చిన ప్రతిసారీ కళాశాల యాజమాన్యాలను ప్రభుత్వం హెచ్చరించడం.. కొద్దిరోజులకే యాజమాన్యాలు మళ్లీ విద్యార్థులపై ఒత్తిడి పెంచడం పరిపాటిగా మారింది.
ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ ఫీజుల ఒత్తిళ్లు
దేశంలో ఎక్కడా లేనంతగా ఏపీలో విద్యావ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా భ్రష్టు పట్టించింది. 2019–24 మధ్య గత ప్రభుత్వం సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసింది. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను గాలికి వదిలేసింది. ప్రభుత్వ సంస్థ అయిన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలోనూ ఫీజుల పీడింపులు, వేధింపులు పెరిగాయి. స్నాతకోత్సవానికి ఆహ్వానించిన వర్సిటీ యాజమాన్యం.. ఇంజినీరింగ్ పట్టా పొందాలంటే పాత ఫీజు బకాయిలన్నీ ఒకేసారి చెల్లించాలని షరతు విధించడం గమనార్హం. డిగ్రీ పొందాలంటే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పెండింగ్ ఫీజులు చెల్లించాల్సిందేననడం, లేదంటే రూ.100 బాండ్ పేపర్లపై బలవంతంగా సంతకాలు చేయించుకోవడం తీవ్ర దుమారం రేపింది.
బాబు మాటలు.. నీటి మూటలు..
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ పథకం భ్రష్టు పట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా విలయతాండవం చేసినప్పటికీ ఐదేళ్లూ ఈ పథకాన్ని సమర్థవంతంగా కొనసాగించారు. అత్యంత పారదర్శకంగా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కళాశాలల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తామని నమ్మబలికింది. అదీ లేదు. ఇదీ లేదు.
పేద విద్యార్థుల సంక్షేమం కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వసతి దీవెన పథకం ఊసే ఇప్పుడు ఎత్తడం లేదు. ప్రైవేట్ కళాశాలల్లో పీజీ చదివే విద్యార్థులకు సైతం ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ హామీని కూడా అటకెక్కించారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని రూ.1,778 కోట్ల బకాయిలతో కలిపి ఉన్నత విద్యపై ఏకంగా రూ.18,663.44 కోట్లు ఖర్చు చేసింది.
‘‘మీరు ఫైనలియర్ ఎగ్జామినేషన్ అప్లికేషన్ నింపాలంటే ఫీజు బకాయిలు మొత్తం కట్టాల్సిందే. ప్రభుత్వం ఇచ్చే వరకు మేము ఎదురు చూడలేం. మీరు ఫీజు కట్టిన తర్వాతే చివరి ఏడాది పరీక్షలకు, ప్రాజెక్టు సబ్మిషన్కు వెళ్లనిస్తాం’’
» మూడు నెలల క్రితం ఉత్తరాంధ్ర విశాఖలోని ఓ ప్రముఖ కళాశాల విద్యార్థులకు ఫోన్లు చేసి బెదిరించిన తీరు ఇది.
‘‘ఫీజు చెల్లించలేదని చిత్తూరు ఎస్వీసెట్ కళాశాల యాజమాన్యం చేసిన తీవ్ర వేధింపులకు బీటెక్–సీఎస్ఈ రెండో సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది.’’
» రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు గత మూడేళ్లగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ చేయకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఎంత తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు పెంచాయో చెప్పడానికి, రాష్ట్రంలో దిగజారిన విద్యా వ్యవస్థకు చిత్తూరు దుర్ఘటన అద్దం పడుతోంది.
‘‘అధికారంలోకి రాగానే ఉన్నత విద్యలో సంస్కరణలు చేపడతాం. ఎయిడెడ్ కాలేజీలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరిస్తాం. కాలేజీలకే నేరుగా రుసుము చెల్లించి సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం’’
» 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన ఈ హామీని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలోకి తొక్కింది. ఇప్పుడు ఫీజులు చెల్లించలేక విద్యార్థులు ఆత్యహత్యలు చేసుకునే పరిస్థితికి తెచ్చింది.
నమ్మించి.. నిధులివ్వకుండా నక్కజిత్తులు!
చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం కళాశాలలను, విద్యార్థులను అప్పుల ఊబిలోకి నెట్టింది. ఇక చదువులు చెప్పలేమంటూ కళాశాల యాజమాన్యాలు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో రోడ్డెక్కే పరిస్థితి తెచ్చింది. దీంతో బడ్జెట్‌కు ముందు రూ.1,200 కోట్లు విడుదల చేస్తూ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు (బీఆర్వోలు) ఇచ్చి, మొత్తం బకాయిలు తీర్చేసినట్లు ప్రచారం చేసుకుంది.
విద్యాశాఖ మంత్రి లోకేశ్ తన ‘ఎక్స్’ ఖాతాలో ఘనంగా పోస్టులు పెట్టారు. తీరా నెలలు గడిచినా కళాశాలల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ఇదేంటని ప్రశ్నించిన కళాశాలలకు ప్రభుత్వం అసలు విషయం చెప్పింది. రూ.1,200 కోట్లను ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి 7.55 శాతం వడ్డీ రేటుతో సమీకరించి ఇస్తామని, ముందుగానే కళాశాలల నుంచి వడ్డీ మినహాయించుకుని ఫీజులు చెల్లిస్తామని పేర్కొంది. దీనికి అంగీకరించి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చింది.


