వైఎస్ జగన్‌తో చిన్నారితల్లిదండ్రులు, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న బాలుడు
మలేషియాలో చికిత్సకు రూ.1.40 కోట్లు అవసరం
వైఎస్ జగన్ దృష్టికి తెచ్చిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు
పార్టీ తరఫున సాయం చేసేందుకు నిర్ణయం
సాక్షి,అమరావతి: జన్యుపరమైన ప్రాణాంతక వ్యాధి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (ఎస్‌ఎంఏ)తో బాధ పడుతున్న ప్రొద్దుటూరుకు చెందిన ఏడాదిన్నర బాలుడు వర్షిత్‌కు వైఎస్సార్‌సీపీ అండగా నిలిచింది. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన చికిత్సకు పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించాలని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయించారు. వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి నేతృత్వంలో గురువారం బాలుడి తల్లిదండ్రులు కాశీవిశ్వనాథ్, బాల లింగమ్మ తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బాలుడి చికిత్స ఖర్చుల వివరాలను జగన్‌కు వివరించారు. చిన్నారికి రెండేళ్ల వయసు దాటక ముందే మలేషియాలో ప్రత్యేక ఇంజెక్షన్ వేయించాలని, అందుకు సుమారు రూ.1.40 కోట్ల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పిన విషయాన్ని తెలిపారు. ఇప్పటికే దాతల సహకారంతో రూ.50 లక్షలు సమకూరాయని వివరించారు. అనంతరం చిన్నారి తల్లిదండ్రులతో వైఎస్ జగన్ ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. బాలుడి చికిత్సకు పార్టీ పరంగా సాయం అందిస్తామన్నారు.
మంత్రులు లోకేశ్, సత్యకుమార్ పట్టించుకోలేదు...
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు మీడియాతో మాట్లాడుతూ, చిన్నారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, మంత్రి నారా లోకేశ్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యప్రసాద్‌ను కలిసినా పట్టించుకోలేదన్నారు. డిసెంబర్ 21న జగన్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారికి ఇంజెక్షన్ అందించేలా మలేషియా వైద్యులతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు.


