పనిచేసే ఉద్యోగిని బాస్ మెచ్చుకుంటే, లేదా కొన్ని వెసులుబాట్లు కల్పిస్తే?.. ఎలా ఉంటుంది. దాని గురించి బహుశా అనుభవించినవాళ్లకే తెలుస్తుంది. అలాంటి అనుభవమే యూరప్ ప్రాంతంలో పనిచేస్తున్న ధిమాహి జైన్ అనే ఉద్యోగిని ఎదురైంది. ఆ విషయాన్ని ఆమె తన ఎక్స్ ఖాతాలో వెల్లడించింది.
సాధారణంగా ధిమాహి జైన్ ఆఫీస్ వర్క్ రాత్రి 10:30 గంటలకు ముగుస్తుంది. అయితే.. తప్పకుండా పూర్తిచేయాల్సిన పని ఉండటం చేత.. ఆమె అర్ధరాత్రి దాటి తెల్లవారుజామున 1 గంట వరకు పనిచేయాల్సి వచ్చింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో.. మేనేజర్లు ఉద్యోగులకు కేవలం థ్యాంక్యూ చెప్పి సరిపెడుతుంటారు. కానీ తమ ఆఫీసులో మాత్రం అందుకు భిన్నంగా స్పందించారని చెప్పింది.
అదనపు సమయం పనిచేసిన ఉద్యోగుల పట్ల.. తన మేనేజర్ చూపించిన బాధ్యతాయుతమైన వైఖరి ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. అదనపు సమయం పనిచేసిన ఉద్యోగులు.. మరుసటి రోజు సాధారణ సమయం కంటే ఆలస్యంగా లాగిన్ కావచ్చని మేనేజర్ తెలిపారు. అంటే.. ఎక్కువ సమయం పనిచేసినందుకు.. బదులుగా మరుసటి రోజు విశ్రాంతి తీసుకునే అవకాశం కల్పించారు. కేవలం మాటల్లో కృతజ్ఞతలు చెప్పడం కాకుండా, ఉద్యోగులు పెట్టిన అదనపు సమయాన్ని గుర్తించి తగిన వెసులుబాటు కల్పించడం ఆమెకు నచ్చింది.
ఈ విషయాన్ని ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. ధిమాహి జైన్ తన మేనేజర్‌పై ప్రశంసలు కురిపించారు. చాలా మంది మేనేజర్లు అదనంగా పనిచేసినప్పుడు థ్యాంక్యూ అని మాత్రమే చెబుతారని, కానీ తన మేనేజర్ మాత్రం అదనంగా పనిచేసిన సమయానికి పరిహారంగా మరుసటి రోజు ఆలస్యంగా లాగిన్ కావచ్చని చెప్పారని వెల్లడించారు. ఇలాంటి ఆలోచన కలిగిన మేనేజర్ ఉండటం తన అదృష్టమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: దిగ్గజ బ్యాంకులో డేటా లీక్ కలకలం!
ఈ పోస్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఉద్యోగుల నుంచి అదనపు పని తీసుకున్నప్పుడు సంస్థలు, మేనేజర్లు వారి సమయానికి తగిన గుర్తింపు ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అత్యవసర పనులు, డెడ్‌లైన్లు ప్రతి ఉద్యోగంలోనూ సహజమే అయినప్పటికీ, ఉద్యోగుల వ్యక్తిగత జీవితాన్ని కూడా గౌరవించడం ముఖ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
My shift ends at 10:30 PM as I work in the EU region. Last night, I had to work until 1 AM due to some urgent work. Most managers would simply say, "Thank you for your help" and falana dhimkana. By my manager simply said, "Thank you, guys. You can log in later tomorrow (today), and we'll compensate for these extra hours." I mean, THIS is what we need from managers. Not just a mere thank you after getting the work done, but actual consideration for the extra time and effort employees put in. Lucky to have a good manager!
— Dhimahi Jain (@Dhimahi11) November 19, 2026


