భేషుగ్గా ప్రభుత్వ బ్యాంకులు | Public Sector Banks continue strong financial performance in first half of FY2026-27 | Sakshi
Sakshi News home page

భేషుగ్గా ప్రభుత్వ బ్యాంకులు

Nov 20 2026 3:51 AM | Updated on Nov 20 2026 3:51 AM

Public Sector Banks continue strong financial performance in first half of FY2026-27

తొలి ఆరునెలల్లో ప్రోత్సాహకర పనితీరు 

నికర లాభం 17 శాతం జూమ్‌ 

రూ. 1.1 లక్షల కోట్లకు చేరిక

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగం(ఏప్రిల్‌–సెప్టెంబర్‌)లో ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) బ్యాంకులు ప్రోత్సాహక పనితీరు ప్రదర్శించాయి. ఆర్థిక ఫలితాలలో మెరుగుదల కొనసాగడంతో ఉమ్మడిగా పీఎస్‌యూ బ్యాంకుల నికర లాభం 17 శాతం ఎగసింది. రూ. 1.1 లక్షల కోట్లను తాకగా.. మొత్తం బిజినెస్‌ 15 శాతంపైగా వృద్ధితో రూ. 302 లక్షల కోట్లకు చేరింది. 

వెరసి మొత్తం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌లో టర్న్‌అరౌండ్‌ పరిస్థితులను ఇవి ప్రతిబింబిస్తున్నట్లు ఒక ప్రకటనలో ఆర్థిక శాఖ పేర్కొంది. డిపాజిట్లు 13 శాతంపైగా పెరిగి రూ. 165.2 లక్షల కోట్లకు చేరగా.. అడ్వాన్సులు(రుణాలు) 19 శాతం జంప్‌చేసి రూ. 136.4 లక్షల కోట్లను తాకాయి. నిర్వహణ లాభం 14 శాతం వృద్ధి చెంది రూ. 1.81 లక్షల కోట్లుగా నమోదయ్యింది. ఆర్‌వోఏ 3 బేసిస్‌ పాయింట్లు మెరుగై 1.11 శాతానికి చేరింది.  

ఐదో ఏడాదిలోనూ 
వరుసగా ఐదో ఏడాదిలోనూ పీఎస్‌బీల ఉమ్మడి లాభదాయకత మెరుగుపడటం.. ప్రభుత్వ సంస్కరణలు, పటిష్ట బ్యాంకింగ్‌ ప్రమాణాలు, మెరుగుపడుతున్న నిర్వహణ సామర్థ్యం, రిస్‌్కమేనేజ్‌మెంట్‌ విధానాల ప్రభావమేనని ఆర్థిక శాఖ వివరించింది. పలు కీలక రంగాలలో రుణ వృద్ధి నమోదుకాగా.. రిటైల్‌ రుణాలు 17 శాతం, వ్యవసాయ రుణాలు 20 శాతం, ఎంఎస్‌ఎంఈ రంగ రుణాలు 20 శాతం చొప్పున పుంజుకున్నట్లు తెలియజేసింది.

 మరోవైపు రుణ నాణ్యత సైతం మెరుగుపడినట్లు పేర్కొంది. స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏ) పీఎస్‌యూ బ్యాంకింగ్‌ చరిత్రలోనే అత్యల్పంగా 1.69 శాతానికి చేరగా.. నికర ఎన్‌పీఏలు 0.33 శాతానికి దిగివచ్చాయి. స్లిప్పేజీలు 0.62 శాతానికి క్షీణించడంతోపాటు, రికవరీలు, అప్‌గ్రెడేషన్స్‌ 21 శాతాన్ని దాటడం మెరుగుపడున్న రుణ నాణ్యతను ప్రతిబింబిస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలియజేసింది. 2026 సెప్టెంబర్‌ 30కల్లా కనీస మూలధన నిష్పత్తి 0.93 శాతం బలపడి 16.89 శాతాన్ని తాకింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement