విలువపరంగా 15–25 శాతం అప్
డబ్ల్యూజీసీ రీసెర్చ్ హెడ్ కవిత చాకో వెల్లడి
న్యూఢిల్లీ: ధన్‌తేరస్–దీపావళి సందర్భంగా పసిడి అమ్మకాలు పుంజుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన విక్రయాలు పరిమాణంపరంగా పెద్దగా మారకపోయినప్పటికీ విలువపరంగా 15–25 శాతం పెరిగాయి. అక్టోబర్ మధ్యలో రేట్లు కాస్త తగ్గడం సైతం అమ్మకాలకు ఊతమిచి్చనట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డబ్ల్యూజీసీ రీసెర్చ్ హెడ్ కవిత చాకో తెలిపారు.
గత పండుగ సీజన్‌తో పోలిస్తే ఈసారి సగటు ధర దాదాపు 10 శాతం అధికంగా ఉన్నప్పటికీ ధన్‌తేరస్, దీపావళి వ్యవధిలో పసిడికి పటిష్టమైన డిమాండ్ నెలకొన్నట్లు ఆమె చెప్పారు. కొనుగోలుదారులు తేలికపాటి ఆభరణాల వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్లు పేర్కొన్నారు. ‘ప్రమోషనల్ ఆఫర్లు, కొత్త డిజైన్లు, తేలికపాటి ఆభరణాలు కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా మారాయి. పాత బంగారాన్ని కొత్త జ్యుయలరీకి మార్చుకునే ధోరణి కొనసాగింది. మొత్తం అమ్మకాల్లో ఈ విభాగం వాటా అత్యధికంగా (చాలా మటుకు స్టోర్స్‌లో 40–60 శాతం) నమోదైంది‘ అని కవిత చెప్పారు.
కడ్డీలు, నాణేలకు డిమాండ్..
ఇక 0.5 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు ఉండే కడ్డీలు, నాణేలకు కూడా డిమాండ్ మెరుగ్గా కనిపించినట్లు కవిత తెలిపారు. అటు సెప్టెంబర్‌లో ఒక మోస్తరు స్థాయికే పరిమితమైన పసిడి దిగుమతులు అక్టోబర్‌లో ఆరు నెలల గరిష్టానికి ఎగిశాయి. నెలవారీగా విలువ బట్టి చూస్తే మూడు రెట్లు పెరిగి 5.51 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే, వార్షికంగా మాత్రం 63 శాతం మాత్రం తగ్గాయి.
2021–25 మధ్యకాలంలో సెప్టెంబర్, అక్టోబర్ వ్యవధిలో సగటున 180 టన్నుల బంగారం దిగుమతి కాగా, ఈ ఏడాది అదే వ్యవధిలో దిగుమతులు 93 టన్నులకే పరిమితమయ్యాయి. దీన్ని బట్టి చూస్తే మే నెలలో దిగుమతి సుంకం పెంపు అనంతరం అనధికారిక దిగుమతులు, రీసైకిల్డ్ బంగారంలాంటి మార్గాల్లో డిమాండ్‌కి తగ్గ పసిడి లభ్యత పెరిగినట్లు తెలుస్తోందని కవిత పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి–అక్టోబర్ మధ్య కాలంలో అధికారికంగా 47.36 బిలియన్ డాలర్ల విలువ చేసే బంగారం (పరిమాణంపరంగా 470 టన్నులు) దిగుమతయ్యింది. వార్షిక ప్రాతిపదికన విలువపరంగా 6 శాతం, పరిమాణంపరంగా 14 శాతం తగ్గింది.


