భారీ ప్యాకేజీ కంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కే జెన్‌జీ మొగ్గు
ప్రతిభకు తగిన గుర్తింపు కోరుకుంటున్న యువత
మేనేజర్ల నియంత్రణ తీరు మారకుంటే కష్టమే
‘గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా’ నివేదికలో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్: ‘భారీ ప్యాకేజీ ఇస్తే చాలు.. ఉద్యోగి మనవాడే’.. కార్పొరేట్ ప్రపంచంలో దశాబ్దాలుగా నడిచిన ఈ పాత సూత్రానికి కాలం చెల్లింది. నేటి ‘జెన్‌జీ’తరం కేవలం జీతాలను చూసి ఉద్యోగాల్లో కొనసాగడం లేదు. పని వేళల్లో వెసులుబాటు, కెరీర్ వృద్ధి, ఆహ్లాదకరమైన పని వాతావరణం, పని ప్రదేశంలో సత్సంబంధాలు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తదితర అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
జెన్‌జీ ఆలోచనా ధోరణి, అంచనాలు యాజమాన్యాలకు సవాలుగా మారుతున్నాయని, ట్రెండ్‌కు తగ్గట్లుగా కంపెనీలు మారాల్సి ఉందని ‘గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా’ఇటీవల హెచ్‌ఆర్ నిపుణుల అభిప్రాయాలతో రూపొందించిన ‘ది న్యూ రిటెన్షన్ ఫ్రాంటియర్’, ‘వాయిస్ ఆఫ్ సీహెచ్‌ఆర్‌ఓస్’నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. లేదంటే ప్రతిభావంతులను నిలుపుకోవడం కష్టమని చెబుతున్నాయి. గత మూడేళ్లలో మొత్తం శ్రామిక శక్తిలో జెన్‌జీ వాటా రెట్టింపై 28 శాతానికి చేరుకుంది. 2030 నాటికి ఇది 47 శాతానికి పెరుగుతుందని అంచనా. ఇంతటి కీలకమైన యువతరాన్ని ఏ అంశాలు ప్రేరేపిస్తాయనే దానిపై పది మంది హెచ్‌ఆర్ ఆఫీసర్లలో ఏడుగురికి కనీస అవగాహన లేకపోవడం గమనార్హం.
ఫీడ్‌బ్యాక్ కోరుకుంటున్న యువత
తాము నిత్యం ఏం నేర్చుకుంటున్నాం, తమ పాత్ర కెరీర్‌ను ఏ స్థాయికి తీసుకెళ్తోంది అనే అంశాలపై యువత నిరంతరం సమీక్షించుకుంటోంది. ఆశించిన వృద్ధి కనిపించకపోతే, మరుక్షణమే మరో అవకాశం వైపు అడుగులు వేస్తోంది. ప్రతిభకు తగిన గుర్తింపు లేకపోవడం వంటివి అధిక జీతం వల్ల కలిగే సంతోషాన్ని సైతం తుడిచిపెట్టేస్తున్నాయి. నేటి యువత తాము చేస్తున్న పనికి ఒక ప్రయోజనం ఉండాలని, పనితీరుపై నిర్మాణాత్మక ఫీడ్‌బ్యాక్ లభించాలని కోరుకుంటోంది.
యాజమాన్యాల్లో మార్పు అవసరం
భవిష్యత్తు కార్పొరేట్ ప్రపంచాన్ని శాసించబోయే జెన్‌జీ తరాన్ని నిలుపుకోవాలంటే సంస్థలు తమ పాత విధానాలకు స్వస్తి పలకక తప్పదు. అందరికీ ఒకే రకమైన నిబంధనలు అనే పద్ధతి ఇకపై పనిచేయదని నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ‘నియామక ప్రక్రియలోనే ఉద్యోగ బాధ్యతలపై పూర్తి పారదర్శకత పాటించాలి. పని గంటల కంటే పని నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. యువ ఉద్యోగు లను అర్థం చేసుకుని నడిపించేలా మేనేజర్లకు ప్రత్యేక నాయకత్వ శిక్షణ ఇవ్వాలి. నిరంతర అభ్యాస అవకాశాలు, పారదర్శక ప్రమోషన్ విధానాలను కొనసాగించాలి. అప్పుడే కంపెనీలు నిజమైన టాలెంట్ లీడర్లుగా నిలబడగలవు’అని స్పష్టం చేస్తున్నాయి.
ప్రధాన కారణాలు ఇవే..
వికటిస్తున్న నియంత్రణ తీరు: పాత తరం మేనేజర్లు ఇంకా నియంత్రణ, సుదీర్ఘ పని గంటలనే నమ్ముకుని ఉద్యోగులను నడిపించాలని చూడటం వికటిస్తోంది. తమ మేనేజర్ల కఠిన తీరు, లేదా సహోద్యోగులతో సత్సంబంధాలు లేకపోవడం వల్లే 64% మంది ఉద్యోగాలు మానేస్తున్నారు.
పని వేళల్లో వెసులుబాటు దొరక్క: హైబ్రిడ్ వర్క్, పని వేళల వెసులుబాటు విషయంలో తరాల మధ్య తీవ్ర భిన్నాభిప్రాయాలు తలెత్తుతున్నాయని 66 శాతం మంది సీహెచ్‌ఆర్‌ఓలు అంగీకరించారు. సరైన వెసులుబాటు లేకపోవడం వల్లే సంస్థలను వీడుతున్నామని 59 శాతం మంది యువ ఉద్యోగులు తేల్చిచెప్పారు.
వర్క్–లైఫ్ బ్యాలెన్స్ ముఖ్యం: కరోనా అనంతరం చాలా బహుళజాతి సంస్థలు ఆఫీసులకు రావాలని కఠిన నిబంధనలు విధించాయి. ట్రాఫిక్ కష్టాలతో విసిగిపోతున్న యువత.. పని వెసులుబాటు కల్పించే స్టార్టప్‌ల వైపు మొగ్గు చూపుతోంది. మెరుగైన వర్క్–లైఫ్ బ్యాలెన్స్ కోసం ఉద్యోగాలు మారుతోంది.
చెప్పేదొకటి.. చేసేదొకటి నచ్చక: ఇంటర్వ్యూ సమయంలో ఆకర్షణీయమైన హోదా, సవాలుతో కూడిన ప్రాజెక్టులు ఉంటాయని చెప్పి, ఉద్యోగంలో చేరాక రొటీన్ పనులు అప్పగించడంతో 68 శాతం మంది నిరాశతో రాజీనామా చేస్తున్నారు. కెరీర్ ప్రారంభించిన రెండేళ్ల లోపు అనుభవం ఉన్నవారే ప్రధానంగా ఉద్యోగాలు మారుతున్నారు.
ఇదీ చదవండి: ‘నోట్లు–ఓట్లు’ భ్రమలో సీఎం..


