90శాతం ఫెయిల్యూర్ ఛాన్స్.. వెనక్కి తగ్గని మస్క్! | Elon Musk Reveals How He Recruited SpaceX First Engineers | Sakshi
Sakshi News home page

90శాతం ఫెయిల్యూర్ ఛాన్స్.. వెనక్కి తగ్గని మస్క్!

Nov 17 2026 1:42 PM | Updated on Nov 17 2026 1:51 PM

Elon Musk Reveals How He Recruited SpaceX First Engineers

ప్రపంచ కుబేరుడు.. టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. స్పేస్‌ఎక్స్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు సంస్థలో.. పనిచేయడానికి వచ్చే ఇంజినీర్లతో మస్క్ మాట్లాడిన మాటలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి.

అప్పట్లో అంతరిక్ష ప్రయోగాలు ఎక్కువగా ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలోనే జరిగేవి. ప్రైవేట్ కంపెనీలు ఈ రంగంలో పెద్దగా ప్రభావం చూపని సమయంలో మస్క్ స్పేస్‌ఎక్స్‌ను ప్రారంభించారు. అయితే.. తన ప్రయత్నం విజయవంతం అవుతుందనే గ్యారెంటీ లేదని, చివరకు ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని ఉద్యోగులకు ముందుగానే చెప్పేవారట. ఈ వీడియోను ఓ వ్యక్తి ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేయగా, మస్క్ స్పందిస్తూ.. అప్పట్లో నిజంగానే పరిస్థితి అలాగే ఉండేదని పేర్కొన్నారు.

2002లో ఎలాన్ మస్క్ తన సొంత సంపద నుంచి సుమారు 100 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టి స్పేస్‌ఎక్స్‌ను స్థాపించారు. భవిష్యత్తులో మనుషులను అంగారక గ్రహంపైకి తీసుకెళ్లాలన్నది ఆయన ప్రధాన లక్ష్యం.

అయితే.. ఈ ప్రయాణం అంత సులభం కాదని మస్క్‌కు ముందే తెలుసు. స్పేస్‌ఎక్స్ విజయవంతం అయ్యే అవకాశాలు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నాయని, విఫలమయ్యే అవకాశాలు 90 శాతం ఉన్నాయని అప్పట్లో భావించారట. అందుకే ఉద్యోగులను నియమించుకునే సమయంలో సంస్థ విజయవంతమవుతుందని తప్పుడు ఆశలు కల్పించలేదని మస్క్ ఆ వీడియోలో చెప్పారు. "మనం చనిపోయే అవకాశం కూడా ఉంది. కానీ మనుషులను అంగారక గ్రహానికి తీసుకెళ్లడానికి, అంతరిక్ష సాంకేతికతను అభివృద్ధి చేయడానికి ఇదే ఒక అవకాశం" అని వివరించేవారట.

అంతేకాదు.. స్పేస్‌ఎక్స్‌లో రాకెట్ల తయారీకి చీఫ్ ఇంజినీర్‌గా కూడా మస్క్ స్వయంగా బాధ్యతలు తీసుకున్నారు. నిజానికి ఆ పదవిలో ఉండాలని మొదట ఆయన అనుకోలేదట. రాకెట్ల తయారీలో అనుభవం ఉన్న మంచి ఇంజినీర్లను నియమించుకోవాలని ప్రయత్నించినప్పటికీ, కంపెనీ భవిష్యత్తుపై ఉన్న అనిశ్చితి కారణంగా ఎవరూ ముందుకు రాలేదు. ఇంతటి రిస్క్ ఉన్న సంస్థలో చేరితే తమ కెరీర్ ప్రమాదంలో పడుతుందని వారు భావించారు. దీంతో చివరకు రాకెట్ ఇంజినీరింగ్ బాధ్యతలను కూడా మస్క్ స్వయంగా చేపట్టాల్సి వచ్చిందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement