ప్రముఖ ఇన్వెస్టర్, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి డబ్బు, అప్పులు, క్రెడిట్ కార్డులు, పెట్టుబడుల గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని వివరించారు.
1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ డాలర్‌కు బంగారంతో ఉన్న ప్రత్యక్ష మార్పిడి సంబంధాన్ని నిలిపివేశారు. అప్పటి నుంచి అమెరికా డాలర్ బంగారం ఆధారంగా కాకుండా.. ప్రభుత్వంపై నమ్మకం, ఆర్థిక వ్యవస్థ ఆధారంగా విలువ పొందే ఫియట్ కరెన్సీగా మారింది. దీనిని కియోసాకి మోనోపోలీ ఆటలో బ్యాంకు అవసరమైనంత డబ్బును సృష్టించుకునే విధానంతో పోల్చారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో అప్పులు, రుణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ రోజుల్లో బ్యాంకులు క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లు, హోమ్ లోన్ల పేరుతో ప్రజలకు సులభంగా అప్పులు అందిస్తున్నాయని కియోసాకి చెబుతున్నారు. ప్రారంభంలో ఇవి ఆకర్షణీయంగా కనిపించినా, ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయని చెప్పారు. క్రెడిట్ కార్డు బిల్లులను పూర్తిగా సకాలంలో చెల్లించకపోవడం వల్ల ప్రజలు అప్పుల ఊబిలో చిక్కుకుంటారని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా క్రెడిట్ కార్డు బిల్లులో కనీస మొత్తం మాత్రమే చెల్లిస్తూ మిగిలిన మొత్తాన్ని వాయిదా వేస్తే వడ్డీ భారం పెరుగుతూ ఉంటుంది. చివరకు చిన్న అప్పు కూడా పెద్ద ఆర్థిక సమస్యగా మారుతుంది.
అయితే.. ధనవంతులు కూడా అప్పులు తీసుకుంటారు. కానీ వారు వాటిని ఉపయోగించుకునే విధానం భిన్నంగా ఉంటుందని కియోసాకి వివరిస్తున్నారు. ఆయన అప్పులను మంచి అప్పు (Good Debt), చెడు అప్పు (Bad Debt)గా విభజించారు.
ఖరీదైన కారు, విలాసవంతమైన వస్తువులు కొనడానికి తీసుకునే అప్పు మన జేబులో నుంచి డబ్బును బయటకు తీస్తుంది కాబట్టి అది చెడు అప్పు. అదే.. ఆదాయం సంపాదించే ఆస్తులను కొనడానికి తీసుకునే అప్పును మంచి అప్పుగా అభివర్ణించారు. ఉదాహరణకు బ్యాంకు లోన్ తీసుకుని అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసి, దానిని అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయంతో ఈఎంఐ చెల్లిస్తే అది లాభదాయకమైన పెట్టుబడిగా మారుతుంది.
అప్పులను జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మాత్రమే కాకుండా.. పెట్టుబడుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని కియోసాకి చెబుతున్నారు. మంచి లాభాలు వస్తాయని కనిపించే ప్రతి పెట్టుబడి నిజంగా ఆదాయాన్ని అందిస్తుందని నమ్మకూడదు. అందుకే పెట్టుబడి పెట్టే ముందు దాని నుంచి వచ్చే ఆదాయం, రిస్క్, దీర్ఘకాలిక ప్రయోజనాలను పరిశీలించాలని చెబుతున్నారు.


