క్యూ2లో రూ. 10,710 కోట్లు
ఏఆర్‌పీయూ@ రూ. 271
న్యూఢిల్లీ: టెలికం సేవల ప్రయివేట్ రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం వార్షికంగా 24 శాతం జంప్‌చేసి రూ. 10,710 కోట్లను తాకింది. గతేడాది (2025–26) ఇదే కాలంలో రూ. 8,651 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 17 శాతం ఎగసి రూ. 60,878 కోట్లకు చేరింది.
గత క్యూ2లో రూ. 52,145 కోట్ల టర్నోవర్ సాధించింది. దీనిలో దేశీ ఆదాయం 9 శాతం పైగా వృద్ధితో రూ. 42,308 కోట్లను తాకింది. ఒక్కో వినియోగదారునిపై సగటు నెలవారీ ఆదాయం (ఏఆర్‌పీయూ) 5 శాతం మెరుగుపడి రూ. 271కు చేరింది. గత క్యూ2లో రూ. 256 ఏఆర్‌పీయూ సాధించింది. ఈ కాలంలో 1.2 మిలియన్లమంది పోస్ట్‌పెయిడ్ కస్టమర్లను జత చేసుకుంది. దీంతో ఈ సంఖ్య 31.2 మిలియన్లను తాకింది.
తగ్గిన రుణ భారం
2026 సెపె్టంబర్30 కల్లా ఎయిర్‌టెల్ నికర రుణ భారం రూ. 1.26 లక్షల కోట్ల నుంచి రూ. 88,277 కోట్లకు భారీగా తగ్గింది. పెట్టుబడుల వ్యయం రూ. 12,467 కోట్లకు చేరింది. దీనిలో దేశీయంగా రూ. 9,908 కోట్లు వెచి్చంచింది. భారత్‌లో యూజర్ల సంఖ్య 11% పెరిగి 49.86 కోట్లకు చేరింది. ఆఫ్రికాతో కలిపి మొత్తం కస్టమర్ల సంఖ్య 69.25 కోట్లను తాకింది. దేశీయంగా ఒక్కో కస్టమర్ సగటు డేటా వినియోగం 29 శాతం జంప్‌చేసి 36.5 జీబీకి చేరింది.
ఫలితాల నేపథ్యంలో ఎయిర్‌టెల్ షేరు బీఎస్‌ఈలో 0.2 శాతం నీరసించి రూ. 2,062 వద్ద ముగిసింది.


