క్యూ2లో 6.2 శాతం అప్
ఆదాయం 10.2 శాతం వృద్ధి;
రూ. 49,244 కోట్లు రూ. 26 మధ్యంతర డివిడెండ్
ఆదాయ గైడెన్స్‌కు కోత.. 1–2 శాతం వృద్ధి అంచనా
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2026–27, క్యూ2)లో రూ. 7,823 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో నమోదైన రూ. 7,364 కోట్లతో పోలిస్తే లాభం 6.2 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం 10.2 శాతం ఎగసి రూ. 49,244 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ2లో ఆదాయం రూ. 44,490 కోట్లుగా నమోదైంది.
ఆదాయ అంచనాలు కోత...
ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయ వృద్ధి అంచనా (గైడెన్స్)లకు ఇన్ఫీ కోత విధించింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన గైడెన్స్‌ను 1–2 శాతానికి కుదించింది. గతంలో 1.5–3 శాతం ఆదాయ గైడెన్స్‌ను ప్రకటించడం గమనార్హం. ప్రధానంగా కాంట్రాక్టు ధరలకు సంబంధించి క్లయింట్ల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో కంపెనీ తాజాగా దీన్ని సవరించింది. అయితే, పూర్తి ఏడాది నిర్వహణ మార్జిన్ అంచనాలను మాత్రం 20–22 శాతంగానే కొనసాగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
రూ. 26 డివిడెండ్...
కంపెనీ డైరెక్టర్ల బోర్డు రూ. 5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 26 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 13 శాతం పెంచడం విశేషం. కాగా, డివిడెండ్‌కు రికార్డు తేదీ నవంబర్ 3 కాగా, నవంబర్ 11న చెల్లించనుంది.
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలు..
→ క్యూ2లో పటిష్టంగా 5.2 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్టులను ఇన్ఫీ సాధించింది. ఇందులో ఏడేళ్ల కాలవ్యవధి గల 2 బిలియన్ డాలర్ల మెగా డీల్ కూడా ఉంది.
→ నిర్వహణ మార్జిన్ స్థిరంగా 21%గా నమోదైంది.
→ జూన్–సెపె్టంబర్ కాలంలో నికరంగా 4,480 మంది ఉద్యోగులు జతయ్యారు. దీంతో ఇన్ఫీ మొత్తం సిబ్బంది సంఖ్య 3,32,542కు చేరింది.
→ ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 12.7 శాతానికి తగ్గింది. క్యూ1లో ఇది 13%గా ఉంది.
ఇన్ఫీ షేరు స్వల్పంగా పెరిగి రూ.1,155 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వచ్చాయి. అయితే, ఆదాయ గైడెన్స్ కోతతో ఇన్ఫీ యూఎస్ ఏడీఆర్ 5% నష్టంతో ట్రేడవుతోంది.
ఈ ఏడాదీ 20,000 మంది ఫ్రెషర్లకు చోటు...
క్యూ2లో 8,000 మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకున్నామని, గతేడాదిలాగే ఈ సంవత్సరం కూడా దాదాపు 20,000 మంది ఫ్రెషర్లను తీసుకోవాలన్న లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ ఎండీ. సీఈఓ సలీల్ పరేఖ్ చెప్పారు. అమెరికాలో వీసా తదితర నిబంధనల కఠినతరం కారణంగా ఉద్యోగులపై వ్యయంపై ప్రభావం ఉంటుందా అన్న ప్రశ్నకు.. అక్కడ ఇప్పటికే మెజారిటీ ఉద్యోగులను స్థానికంగా నియమించుకుంటున్నామని, రాబోయే కాలంలో ఇది మరింత పెరుగుతుందని పరేఖ్ పేర్కొన్నారు. కంపెనీలు ఏఐపై భారీగా వెచ్చిస్తుండంతో ఇన్ఫీ మొత్తం ఆదాయంలో ఏఐ వాటా 10.5 శాతానికి చేరిందని, క్యూ2లో 29% పెరిగినట్లు ఆయన వెల్లడించారు.


