క్యూ2లో రూ. 5,132 కోట్లు
ఆదాయం రూ. 35,620 కోట్లు
షేరుకి రూ. 16 డివిడెండ్
10,000 మంది ఫ్రెషర్స్‌కు చాన్స్
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఈ ఏడాది రెండో త్రైమాసికం (2026–27, క్యూ2)లో ఆసక్తికర ఫలితాలు సాధించింది. వార్షిక ప్రాతిపదికన కన్సాలిడేటెడ్ నికర లాభం 21% ఎగసి రూ. 5,132 కోట్లను తాకింది. మెరుగుపడిన మార్జిన్లు, అడ్వాన్స్‌డ్ ఏఐ బిజినెస్ జోరు ఇందుకు సహకరించాయి. గతేడాది (2025–26) ఇదే కాలంలో రూ. 4,235 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం 11%పైగా వృద్ధితో రూ. 35,620 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 31,942 కోట్ల టర్నోవర్ అందుకుంది. త్రైమాసికవారీగా అంటే ఈ ఏడాది తొలి క్వార్టర్ (ఏప్రిల్–జూన్)తో పోలిస్తే నికర లాభం 11%, ఆదాయం 3% చొప్పున పెరిగాయి. వాటాదారులకు షేరుకి రూ. 12 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఇందుకు ఈ నెల 16 రికార్డ్‌డేట్‌కాగా.. ఈ ఏడాది 10,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి కల్పించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
2.5–4 శాతం గైడెన్స్
పూర్తి ఏడాదికి ఆదాయ అంచనాలను హెచ్‌సీఎల్ టెక్ తాజాగా 2.5–4%గా సవరించింది. తొలుత 1–4% మధ్య ఆదాయ పురోగతిని అంచనా వేసింది. పటిష్ట డీల్స్, ఏఐ ఆధారిత సర్వీసులు ఇందుకు మద్దతివ్వనున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో సి.విజయకుమార్ పేర్కొన్నారు. కాగా.. ఐటీ సర్వీసుల బిజినెస్ నుంచి ఆదాయం రూ. 26,938 కోట్లు సాధించింది. గత క్యూ2లో ఇది రూ. 23,693 కోట్లుకాగా.. ఇంజనీరింగ్, ఆర్‌అండ్‌డీ సర్వీసుల టర్నోవర్ రూ. 5,423 కోట్ల నుంచి రూ. 5,973 కోట్లకు బలపడింది. హెచ్‌సీఎల్ సాఫ్ట్‌వేర్ ఆదాయం మాత్రం రూ. 2,826 కోట్ల నుంచి రూ. 2,709 కోట్లకు క్షీణించింది.
ఇతర విశేషాలు
→ ఉద్యోగుల సంఖ్య 6,450 పెరిగి 2,30,339కు చేరింది. క్యూ1లో 3,292 మంది తగ్గారు.
→ ఉద్యోగ వలసల(అట్రిషన్) రేటు 12.8 శాతంగా నమోదైంది.
→ ఆర్డర్ల బుకింగ్స్ 27 శాతం ఎగసి 3.3 బిలియన్ డాలర్లకు చేరాయి.
→ ఇబిట్ మార్జిన్లు 16.9 శాతం నుంచి 18.2 శాతానికి మెరుగుపడ్డాయి.
→ ఏఐ ఆదాయం 78 శాతం జంప్‌చేసి 21.9 కోట్ల డాలర్లను తాకింది.
ఆంత్రోపిక్‌తో జత
ఏఐ సేవల దిగ్గజం ఆంత్రోపిక్‌తో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా ఎజెంటిక్ ఏఐ సొల్యూషన్లకు తెరతీసేందుకు ప్రత్యేక బిజినెస్ యూనిట్‌ను నెలకొల్పనుంది. దీంతో క్లాడ్ వినియోగం ద్వారా ఎంటర్‌ప్రైజ్ క్లయింట్స్‌కు ఎజెంటిక్ ఏఐ సొల్యూషన్లు సమకూర్చనుంది.
మరోపక్క సాఫ్ట్‌వేర్ విభాగం ఎంపిక చేసిన ప్రొడక్టులకు ఏఐ మోడల్స్‌ను అనుసంధానించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. వెరసి ఎంటర్‌ప్రైజ్‌లు ఎజెంటిక్ ఏఐను మిళితం చేసుకోవడం ద్వారా తక్కువ మానవ వనరుల వినియోగంతో భద్రత, సైబర్‌సెక్యూరిటీ, గవర్నెన్స్‌లను పటిష్టపరచుకోవచ్చని తెలియజేసింది. ఐటీ సర్వీసుల బృందం ఆంత్రోపిక్ క్లాడ్, కోవర్క్, క్లాడ్ కోడ్ వినియోగం ద్వారా ఇండస్ట్రీ సొల్యూషన్లు అందించనున్నట్లు వివరించింది.
ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేరు 0.5 శాతం లాభపడి రూ. 1,223 వద్ద ముగిసింది.


