వార్షిక ప్రాతిపదికన 45% వృద్ధి
డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడి
దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో ఈవీ అమ్మకాలు ఏకంగా 45 శాతం పెరిగి 3,54,625 యూనిట్లకు చేరాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 2,44,764 యూనిట్లతో పోలిస్తే ఇది భారీ వృద్ధి అని ఆటోమొబైల్ డీలర్ల సమాఖ్య ‘ఫాడా’ వెల్లడించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు 1,50,890 నుంచి 48.49% పెరిగి 2,24,064 యూనిట్లను తాకాయి. దీంతో మొత్తం ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఈ–టూవీలర్ల వాటా 4.7% నుంచి ఏకంగా 9.7 శాతానికి విస్తరించింది.
మరోవైపు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు 76.47% దూసుకెళ్లి 37,049 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ విభాగంలో మార్కెట్ వాటా 3.5% నుంచి 7.3 శాతానికి ఎగబాకింది. ఇక ఎలక్ట్రిక్ త్రీ–వీలర్ సేల్స్ 24.76% వృద్ధితో 88,570 యూనిట్లకు చేరాయి. ప్రస్తుతం త్రిచక్ర వాహన విభాగంలో ఏకంగా 63% వాటా విద్యుత్ వాహనాలదే కావడం విశేషం. ‘‘దేశంలో మొత్తం వాహన విక్రయాల్లో ఈవీల పెనిట్రేషన్ గతేడాది 6% ఉండగా, ఈసారి 11.5 శాతానికి చేరింది. పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటం, మరోవైపు ఈవీల రేంజ్ మెరుగుపడటంతో పాటు పెట్రోల్ వాహనాలకు సమానంగా ఈవీ ధరలు అందుబాటులోకి రావడమే ఈ భారీ డిమాండ్‌కు కారణం. మార్కెట్‌లో సప్లై కంటే డిమాండే ఎక్కువగా ఉంది’’ అని ఫాడా అధ్యక్షుడు సాయి గిరిధర్ తెలిపారు.
ఇదీ చదవండి: ‘దుస్తులు ధరించని సమయాల్లో రికార్డు చేస్తున్నారు!’


