క్విక్‌–కామర్స్‌ కోసం ప్రత్యేక ఉత్పత్తులు  | Special products for quick-commerce, reveals Kavita Chaturvedi | Sakshi
Sakshi News home page

క్విక్‌–కామర్స్‌ కోసం ప్రత్యేక ఉత్పత్తులు 

Nov 11 2026 5:18 AM | Updated on Nov 11 2026 5:18 AM

Special products for quick-commerce, reveals Kavita Chaturvedi

ప్రయోగాత్మకంగా నానో బేకరీలు 

ఐటీసీ బిస్కెట్స్, కన్ఫెక్షన్స్‌ సీఈవో కవితా చతుర్వేది వెల్లడి 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డైవర్సిఫైడ్‌ దిగ్గజం ఐటీసీలో భాగమైన బిస్కెట్స్‌ తదితర ఉత్పత్తుల విక్రయాలకు ఈ–కామర్స్, క్విక్‌ కామర్స్‌ దన్నుగా నిలుస్తున్నాయి. పరిశ్రమకు సంబంధించి క్విక్‌ కామర్స్‌ విభాగం రెండంకెల స్థాయిలో పెరుగుతూ, ప్రధాన వృద్ధి చోదకాల్లో ఒకటిగా ఉంటోందని ఐటీసీ సీఈవో (బిస్కెట్స్, కన్ఫెక్షన్స్‌ బిజినెస్‌) కవితా చతుర్వేది తెలిపారు. ముఖ్యంగా ప్రీమియం ఉత్పత్తుల వైపు మొగ్గు చూపే వినియోగదారులు ఉండే మెట్రోల్లో ఈ ధోరణి ఎక్కువగా ఉందని చెప్పారు.

 ఈ నేపథ్యంలో ఈ విభాగం కోసం ప్రత్యేకంగా తక్కువ షెల్ఫ్‌ లైఫ్‌ ఉండే కుకీస్‌లాంటి తాజా బేకరీ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు సాక్షి బిజినెస్‌ బ్యూరోకి కవిత చెప్పారు. ఇందుకోసం ప్రయోగాత్మకంగా బెంగళూరులో ‘నానో కిచెన్‌ మోడల్‌’ని ప్రవేశపెట్టినట్లు ఆమె తెలిపారు. త్వరలో ఈ కిచెన్లను ఢిల్లీ తదితర నగరాలకు కూడా విస్తరించనున్నట్లు వివరించారు. 

సాధారణంగా డార్క్‌ ఫ్యాంటసీలాంటి ప్రీమియం ఉత్పత్తులనే తాము విక్రయిస్తామనే అభిప్రాయం ఉన్నప్పటికీ, అన్ని ధరల శ్రేణుల్లోనూ తమ ఉత్పత్తులు ఉన్నాయని కవిత చెప్పారు. ఉదాహరణకు మామ్స్‌ మ్యాజిక్‌లాంటి ఉత్పత్తులను మాస్‌ మార్కెట్‌ సెగ్మెంట్‌కి కూడా అందుబాటులో ఉండేలా రూ. 5కే అందిస్తున్నట్లు వివరించారు. 

భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల పెంపు తదితర అంశాలతో ఆర్థికంగా కఠిన పరిస్థితులు నెలకొన్నా డార్క్‌ ఫ్యాంటసీ, ఫార్మ్‌లైట్‌లాంటి ఉత్పత్తులతో వాటిని అధిగమిస్తున్నట్లు వివరించారు. గతేడాది ప్రవేశపెట్టిన షైన్స్‌కి మంచి స్పందన రావడంతో సత్వరం రెండో తయారీ లైన్‌ని కూడా ప్రారంభించినట్లు చెప్పారు. ముడివస్తువుల ధరలు పెరుగుదలతో పాక్షికంగా మాత్రమే బదలాయించామని, ఇతరత్రా వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. 

మరిన్ని లైన్లు అందుబాటులోకి.. 
దక్షిణాది తమకు అతి పెద్ద మార్కెట్‌ కాగా, అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అత్యంత కీలకమైనవిగా ఉంటున్నట్లు కవిత తెలిపారు. మరోవైపు, తెలంగాణలోని తమ ప్లాంటులో ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకుంటున్నట్లు వివరించారు. తమకు 12 మెగా ప్లాంట్లు ఉండగా, తెలంగాణలోనిది నాలుగో అతి పెద్ద ప్లాంట్‌ అని, త్వరలో మూడో స్థానానికి చేరుతుందని ఆమె చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ డార్క్‌ ఫ్యాంటసీ, పొటాటో చిప్స్‌లాంటి వాటి కోసం 3 లైన్లు పనిచేస్తుండగా, మామ్స్‌ మ్యాజిక్‌తో పాటు మరో కొత్త ఉత్పత్తి కోసం ఇంకో 2 లైన్లు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. మొత్తం 11 లైన్ల సామర్థ్యంతో నెలకొలి్పన ప్లాంటుపై ఇప్పటికే రూ. 500 కోట్లు ఇన్వెస్ట్‌ చేయగా, విస్తరణ కోసం మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు కవిత తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement