న్యూఢిల్లీ: విద్యుత్, సిమెంట్, ముడి ఇనుము దన్నుతో సెప్టెంబర్‌లో కీలక మౌలిక పరిశ్రమల గ్రూప్ మెరుగ్గా రాణించింది. 7.9 శాతం వృద్ధి నమోదు చేసింది. కొత్త సిరీస్‌లో అత్యంత వేగవంతమైన వృద్ధిని కనపర్చింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం గతేడాది సెప్టెంబర్‌లో మౌలిక రంగ వృద్ధి 3.1 శాతంగా, ఈ ఏడాది ఆగస్టులో 5.9 శాతంగా నమోదైంది.
సెగ్మెంట్లవారీగా చూస్తే ముడి ఇనుము ఉత్పత్తి 18.4 శాతం, విద్యుత్ 11.4 శాతం, బొగ్గు 10.7 శాతం, సిమెంట్ ఉత్పత్తి 9.8 శాతం మేర పెరిగింది. అయితే, ముడి చమురు (మైనస్ 1.4 శాతం), సహజ వాయువు (మైనస్ 4.6 శాతం), ఎరువుల ఉత్పత్తి (మైనస్ 11.7 శాతం) మాత్రం పడిపోయింది. ఏప్రిల్–సెప్టెంబర్ వ్యవధిలో మౌలిక రంగ వృద్ధి రేటు గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 2.5 శాతంతో పోలిస్తే 5.1 శాతానికి పెరిగింది.


