ప్లీజ్‌.. బలవంతం చేయొద్దు! | Tata Sons Listing Controversy Why Forcing IPO Could Undermine Values | Sakshi
Sakshi News home page

ప్లీజ్‌.. బలవంతం చేయొద్దు!

Nov 10 2026 4:05 PM | Updated on Nov 10 2026 4:05 PM

Tata Sons Listing Controversy Why Forcing IPO Could Undermine Values

భారతీయ కార్పొరేట్ దిగ్గజాల్లో అగ్రగామిగా ఉన్న టాటా గ్రూప్‌నకు మాతృ సంస్థ అయిన ‘టాటా సన్స్‌’ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ), స్టాక్‌ మార్కెట్ లిస్టింగ్‌ అంశం ప్రస్తుతం దేశ ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది. రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం అప్పర్ లేయర్ ఎన్‌బీఎఫ్‌సీ జాబితాలో చేరిన టాటా సన్స్‌ను స్టాక్‌ మార్కెట్‌లో బలవంతంగా లిస్ట్ చేయించాలనే నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీ హోదా

ఆర్‌బీఐ స్కేల్-బేస్డ్ రెగ్యులేషన్ (ఎస్‌బీఆర్‌) ఫ్రేమ్‌వర్క్ కింద టాటా సన్స్‌ను ‘అప్పర్‌ లేయర్‌ ఎన్‌బీఎఫ్‌సీ’గా వర్గీకరించిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఈ కేటగిరీ కిందకు వచ్చే ఏ సంస్థయినా నిర్ణీత కాలవ్యవధిలోగా స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో పబ్లిక్‌ లిస్టింగ్ పూర్తి చేయాలి. అయితే, టాటా సన్స్‌ తన అప్పులన్నీ తీర్చి క్లీన్‌ బ్యాలెన్స్ షీట్‌ను కలిగి ఉంది. ఎలాంటి ప్రజా ధనాన్ని లేదా పబ్లిక్ డిపాజిట్లను ఉపయోగించని ఈ సంస్థ వల్ల ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ద్రవ్య ముప్పు లేదనేది ఆర్థిక నిపుణుల ప్రధాన వాదన. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులున్న ప్రైవేట్ హోల్డింగ్ కంపెనీలపై మార్కెట్ లిస్టింగ్‌ను రుద్దడం వల్ల వ్యవస్థాగత ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువ జరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టాటా ట్రస్ట్స్ సేవా దృక్పథం

టాటా సన్స్‌లో దాదాపు 66 శాతం వాటా కలిగి ఉన్న టాటా ట్రస్ట్స్ ప్రధానంగా స్వచ్ఛంద సేవా కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తుంటాయి. టాటా గ్రూప్ వందేళ్లకు పైగా అనుసరిస్తున్న వ్యాపార నైతికత కేవలం త్రైమాసిక లాభాల కోసం కాదని కొందరు చెబుతున్నారు. సమాజ సంక్షేమం, దాతృత్వం, విలువలతో కూడిన పాలన దీని సొంతం. ఒకవేళ కంపెనీని స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్ చేస్తే మైనారిటీ వాటాదారులు, విదేశీ సంస్థాగత మదుపర్ల నుంచి స్వల్పకాలిక లాభాల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి కారణంగా ఎయిర్ ఇండియా వంటి నష్టాల్లో ఉన్న సంస్థలను లేదా భవిష్యత్తుపై భారీ పెట్టుబడులు అవసరమైన ప్రాజెక్టులను కాపాడుకోవడంలో టాటా ట్రస్ట్స్ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చనే వాదనలున్నాయి.

అంతర్గత విభేదాలు - బోర్డులో సవాళ్లు

టాటా సన్స్‌ బోర్డులో ఈ లిస్టింగ్‌ ప్రక్రియపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ వంటి మైనారిటీ వాటాదారులు లిస్టింగ్‌ ద్వారా తమ వాటాల విలువను రాబట్టుకోవాలని కోరుకుంటుండగా, టాటా ట్రస్ట్స్ నాయకత్వం నుంచి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డైరెక్టర్ల మధ్య ఉన్న ‘అఫర్మేటివ్ వోటింగ్ రైట్స్’ (వీటో అధికారాలు), చైర్మన్ క్యాస్టింగ్ వోట్ వినియోగం వంటి అంశాలపై చట్టపరమైన సంక్లిష్టతలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు.

ప్రతి సంస్థను ఒకే గాటన కట్టడం సబబు కాదని కొందని అభిప్రాయం. టాటా గ్రూప్ చరిత్ర, దాని సామాజిక బాధ్యత, దేశ ఆర్థిక వ్యవస్థకు అది అందిస్తున్న సేవలు ప్రత్యేకమైనవి. చట్టపరమైన నిబంధనలు, మార్కెట్ పారదర్శకత ఎంత ముఖ్యమో దేశ సంపదను సృష్టిస్తూనే సమాజ సేవను ప్రధాన ఆశయంగా మలచుకున్న ట్రస్ట్ మూలాలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. అందువల్ల, ప్రత్యేక మినహాయింపులు ఇవ్వదగిన అసాధారణ సందర్భాలను పరిగణలోకి తీసుకుని, ఈ లిస్టింగ్‌ నిబంధనల అమలుపై ఆర్‌బీఐ, నియంత్రణ సంస్థలు పునరాలోచించాలని కొందరు కోరుతున్నారు.

ఇదీ చదవండి: సింగపూర్‌లో 500 టన్నుల భారీ గోల్డ్ వాల్ట్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement