అంబానీ కొడుకులు.. అదుర్స్‌! | Akash Ambani vs Anant Ambani Education marriage Business Roles | Sakshi
Sakshi News home page

అంబానీ కొడుకులు.. అదుర్స్‌!

Oct 29 2026 5:01 PM | Updated on Oct 29 2026 5:35 PM

Akash Ambani vs Anant Ambani Education marriage Business Roles

భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన వ్యాపార కుటుంబాల్లో ముఖేష్‌ అంబానీ కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. వ్యాపార అంశాల్లో నిత్యం వార్తల్లో ఉండే ఈ కుటుంబం వ్యాపారేతర కార్యక్రమాల్లోనూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. చమురు శుద్ధి నుంచి టెలికాం, రిటైల్‌, డిజిటల్‌ సేవలు, పునరుత్పాదక ఇంధనం వరకు విస్తరించిన రిలయన్స్‌ సామ్రాజ్యంలో తదుపరి తరం నాయకత్వం ఇప్పటికే కీలక బాధ్యతలు చేపట్టింది.

ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీ.. అంబానీ కుటుంబ వారసులు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారులు. ఇద్దరూ కుటుంబ వ్యాపార వ్యవహారాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. తన వ్యాపార సామ్రాజ్య విస్తరణలో భాగంగా తాజాగా జరిగిన జియో ప్లాట్‌ఫామ్స్‌ (Jio Platforms) స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌ కార్యక్రమంలో వీరద్దరూ తమ ప్రసంగాలతో తండ్రి ముఖేష్‌ అంబానీకి పుత్రోత్సాహం కలిగించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి గురించిన వ్యక్తిగతమైన అంశాలు, చదువులు, పెళ్లిళ్లు, వ్యాపారంలో హోదాలు తదితర ఆసక్తికర విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆకాశ్‌ అంబానీ..

  • విద్యాభ్యాసం: అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు.

  • వైవాహిక జీవితం: 2019లో ప్రముఖ వజ్రాల వ్యాపార కుటుంబానికి చెందిన శ్లోకా మెహతాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

  • ప్రధాన బాధ్యతలు: రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌, జియో ప్లాట్‌ఫామ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

1991 అక్టోబర్‌ 23న జన్మించిన ఆకాశ్‌ అంబానీ, ముఖేష్‌ అంబానీ పెద్ద కుమారుడు. చిన్న వయసు నుంచే కుటుంబ వ్యాపార కార్యకలాపాలను దగ్గరగా పరిశీలించిన ఆయన, టెలికాం, డిజిటల్‌ సేవలు, సాంకేతికతకు సంబంధించిన వ్యాపారాలపై ప్రత్యేక దృష్టి సారించారు.

2014లోనే రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ బోర్డులో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా చేరిన ఆకాశ్‌, 2022 జూన్‌లో ఆ సంస్థ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం జియో ప్లాట్‌ఫామ్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గానూ కొనసాగుతున్నారు. 5G మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలు, కృత్రిమ మేధ (AI), ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి సాంకేతికతల ఆధారంగా జియో సేవలను విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

అనంత్‌ అంబానీ..

  • విద్యాభ్యాసం: అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చదివారు.

  • వైవాహిక జీవితం: 2024లో రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకున్నారు.

  • ప్రధాన బాధ్యతలు: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌. జియో ప్లాట్‌ఫామ్స్‌, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ బోర్డుల్లోనూ డైరెక్టర్‌గా ఉన్నారు.

1995 ఏప్రిల్‌ 10న జన్మించిన అనంత్‌ అంబానీ, ముఖేష్‌ అంబానీ దంపతుల చిన్న కుమారుడు. తన అన్న ఆకాశ్‌ మాదిరిగానే అమెరికాలోని బ్రౌన్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించారు. అయితే, రిలయన్స్‌ వ్యాపారంలో ఆయన ప్రధానంగా ఇంధనం, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నారు.

2023లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బోర్డులో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా చేరిన అనంత్‌, 2025 మే 1 నుంచి ఐదేళ్ల కాలానికి పూర్తికాలపు డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. సౌర విద్యుత్‌ పరికరాల తయారీ, ఇంధన నిల్వ బ్యాటరీలు, గ్రీన్‌ హైడ్రోజన్‌, తదుపరి తరం స్వచ్ఛ ఇంధన సాంకేతికతల అభివృద్ధి వంటి అంశాల్లో రిలయన్స్‌ చేపడుతున్న కార్యక్రమాలతో ఆయనకు సంబంధం ఉంది. 2035 నాటికి నికర కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తీసుకురావాలన్న సంస్థ లక్ష్యంలోనూ ఈ విభాగానికి ప్రాధాన్యం ఉంది.

వ్యాపారంతోపాటు జంతు సంరక్షణపై అనంత్‌ ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో వనతార (Vantara) పేరుతో వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయపడిన, ప్రమాదంలో ఉన్న జంతువులకు వైద్య చికిత్స, ఆశ్రయం, అవసరమైన సంరక్షణ అందించడం ఈ కార్యక్రమంలోని ప్రధాన అంశాలు. వ్యాపార వృద్ధితోపాటు పర్యావరణం, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఆయన కార్యకలాపాల్లో కనిపించే మరో కోణం.

తండ్రి భావోద్వేగం

అక్టోబర్‌ 28న జియో ప్లాట్‌ఫామ్స్‌ స్టాక్‌ మార్కెట్‌లో అడుగుపెట్టిన సందర్భంగా అంబానీ కుటుంబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఆకాశ్‌, అనంత్‌ ప్రసంగాలతో తండ్రి ముఖేష్‌ అంబానీ భావోద్వేగానికి గురైన దృశ్యాలు కూడా వార్తల్లో నిలిచాయి.

కూతురిదీ కీలక పాత్రే!

రిలయన్స్‌ వారసత్వం తదుపరి తరానికి బదిలీ అవుతున్న నేపథ్యంలో ఆకాశ్‌, అనంత్‌ల నాయకత్వ శైలి, నిర్ణయాలు, వ్యాపార విస్తరణ వ్యూహాలు రానున్న రోజుల్లో మరింత ఆసక్తిని రేకెత్తించనున్నాయి. అయితే, గ్రూప్‌ వ్యాపారాల్లో వారి పాత్రలను పరిశీలించేటప్పుడు వారి సోదరి ఇషా అంబానీ కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న విషయాన్ని విస్మరించలేం. ఆమె ప్రధానంగా రిటైల్‌, వినియోగదారుల వ్యాపారాల విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు.

ఇదీ చదవండి: గుడి గంటల్లా.. స్టాక్‌ మార్కెట్‌ బెల్స్‌: అనంత్‌ అంబానీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement