జియో ప్లాట్‌ఫామ్స్ స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టిన సందర్భంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ భావోద్వేగ ప్రసంగం చేశారు. జియో విజయానికి తోడ్పడిన కోట్లాది మంది భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ లిస్టింగ్‌ను కేవలం వ్యాపార విజయంగా కాకుండా, దేశంతో తమ సంతోషాన్ని పంచుకునే సందర్భంగా అభివర్ణించారు. తన తాత ధీరూభాయ్ అంబానీ భారతీయుల కలలకు బలమిచ్చారని, తండ్రి ముఖేష్ అంబానీ దేశం వెనుకబడకూడదనే లక్ష్యంతో జియోను ముందుకు తీసుకెళ్లారని గుర్తుచేసుకున్నారు.
‘వ్యాపారం నాకు పూజతో సమానం. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో మోగిన గంట దేవాలయ గంటలా అనిపిస్తోంది. ప్రతి పూజ ప్రసాదంతో ముగిసినట్లే.. ఈ రోజు జియో తన విజయాన్ని భారతదేశంతో పంచుకుంటోంది’ అని అనంత్ పేర్కొన్నారు. తల్లి ఆప్యాయంగా పలికే ‘జియో మేరే లాల్’, అమ్మమ్మ ఆశీర్వాదమైన ‘జగ్ జగ్ జియో’, స్నేహితుల ‘జియో మేరే యార్’ వంటి మాటలను గుర్తుచేసుకుంటూ, జియో ప్రయాణంలో ప్రజల ప్రేమ, ఆశీస్సులు కీలకమని చెప్పారు. తన సోదరుడు ఆకాశ్, సోదరి ఇషాతో కలిసి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది, సాంకేతిక నిపుణులు, ఇంజినీర్లు, స్టోర్ ఉద్యోగులు, రిటైల్ భాగస్వాముల సేవలను ప్రశంసిస్తూ ఈ విజయం వారిదేనని పేర్కొన్నారు.
డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా దేశంలో డిజిటల్ సేవల విస్తరణకు దిశానిర్దేశం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి అనంత్ కృతజ్ఞతలు తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రిలయన్స్ ముందుంటుందని చెప్పారు.
ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ కన్నీళ్లు.. ఏడ్చేసిన రిలయన్స్ అధినేత
21.36 శాతం ప్రీమియంతో లిస్టింగ్
మరోవైపు, జియో ప్లాట్‌ఫామ్స్ షేర్లు అక్టోబర్ 28న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ఒక్కో షేరు రూ.1,358 వద్ద లిస్ట్ అయ్యాయి. ఐపీఓ ఇష్యూ ధర రూ.1,119తో పోలిస్తే ఇది 21.36 శాతం ప్రీమియం. ఈ లిస్టింగ్‌తో కంపెనీ మార్కెట్ విలువ సుమారు రూ.12.5 లక్షల కోట్లకు చేరి, రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత దేశంలో రెండో అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా నిలిచింది.
జియో ప్లాట్‌ఫామ్స్ రూ.30,213 కోట్ల ఐపీఓకు పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన లభించింది. మొత్తం 22.19 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదవగా, సుమారు 1.39 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. పబ్లిక్ ఇష్యూ, యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కలిపి వచ్చిన మొత్తం డిమాండ్ రూ.7.4 లక్షల కోట్లను దాటింది.
ప్రస్తుతం 53 కోట్లకు పైగా టెలికాం వినియోగదారులకు సేవలందిస్తున్న జియోలో మెటా, గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వంటి అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఈ లిస్టింగ్ రిలయన్స్ గ్రూప్ నుంచి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత జరిగిన తొలి ప్రధాన స్టాక్ మార్కెట్ అరంగేట్రం కావడం విశేషం.
🇮🇳 Bell-ringing ceremony marks the stock market debut of Jio Platforms Limited at the NSE in Mumbai, attended by the Ambani family. 📈 Jio shares make a strong debut at ₹1,358, up 21.35% from the IPO issue price of ₹1,119. https://t.co/8MuRGWwVVs
— The Eagle Eye (@Theeye_eagle) October 28, 2026


