ప్రపంచ దిగ్గజాల సరసన జియో | Jio Platforms Creates History With 108 Billion Dollar Valuation, Joining Global Giants Meta Alibaba And SpaceX | Sakshi
Sakshi News home page

Jio Platforms IPO Record: ప్రపంచ దిగ్గజాల సరసన జియో

Oct 29 2026 2:13 PM | Updated on Oct 29 2026 2:51 PM

Jio Platforms joins Meta, Alibaba, SpaceX Details Inside

భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన ‘జియో ప్లాట్‌ఫామ్స్‌’ ప్రపంచ స్థాయి కార్పొరేట్‌ దిగ్గజాల సరసన నిలిచింది. ఐపీఓ ఆఫర్‌ ధర ప్రకారం సుమారు రూ. 10.3 లక్షల కోట్ల (108 బిలియన్‌ డాలర్లు) ఈక్విటీ వాల్యుయేషన్‌తో జియో ఈ ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థాపక నేతృత్వంలో నడిచే సంస్థల్లో.. లిస్టింగ్‌ రోజే 100 బిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటిన నాలుగో కంపెనీగా జియో చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఈ రికార్డు మెటా, అలీబాబా, స్పేస్‌ఎక్స్‌ సంస్థలకు మాత్రమే సాధ్యమైంది.  

దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా రికార్డు 
మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ప్రాతిపదికన దేశంలోనే రెండో అతిపెద్ద లిస్టెడ్‌ కంపెనీగా జియో ప్లాట్‌ఫామ్స్‌ చరిత్ర సృష్టించింది. దాదాపు రూ.13.06 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌తో రెండో స్థానంలో నిలిచింది. మాతృ సంస్థ ‘రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌’ రూ. 15.67 లక్షల కోట్లతో తొలిస్థానంలో ఉంది. టెలికం రంగంలో తన ప్రధాన పోటీ సంస్థ ‘భారతీ ఎయిర్‌టెల్‌’ మార్కెట్‌ క్యాప్‌ కంటే ‘జియో’ ఏకంగా రూ. 80,000 కోట్లకు పైగా ముందంజలో నిలిచింది. కాగా, ఎయిర్‌టెల్‌ రూ. 12.25 లక్షల కోట్లతో మూడో స్థానంలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రూ.10.42 లక్షల కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ రూ.9.80 లక్షల కోట్లు మార్కెట్‌ విలువ పరంగా నాలుగు, అయిదో స్థానంలో నిలిచాయి.

‘టాప్‌’లేపిన రిలయన్స్‌ 
జియో ప్లాట్‌ఫామ్స్‌ (Jio Platforms) అద్భుతమైన అరంగేట్రంతో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ గ్రూప్‌.. మార్కెట్‌ విలువ పరంగా టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్‌ గ్రూప్‌గా అవతరించింది. బీఎస్‌ఈ గణాంకాల ప్రకారం.. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (రూ. 15.67 లక్షల కోట్లు), జియో ప్లాట్‌ఫారŠమ్స్‌  (రూ. 13.06 లక్షల కోట్లు), జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ (రూ. 1.35 లక్షల కోట్లు) మార్కెట్‌ క్యాప్‌లతో కలిపి రిలయన్స్‌ గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ విలువ రూ. 30.08 లక్షల కోట్లకు చేరింది. కాగా, టీసీఎస్, టాటా స్టీల్, టైటాన్, టాటా పవర్, టాటా మోటార్స్, ట్రెంట్‌ తదితర ప్రధాన కంపెనీల మార్కెట్‌ క్యాప్‌లతో కూడిన టాటా గ్రూప్‌ మొత్తం విలువ రూ. 25.28 లక్షల కోట్లుగా ఉంది.

కొత్త సాంకేతికతను సామాన్యులకు చేరవేస్తాం: ఆకాశ్‌ అంబానీ  
 

జియో లిస్టింగ్‌ (Jio Listing) సరికొత్త ప్రయాణానికి ప్రారంభం మాత్రమే. రిలయన్స్‌ తరహాలోనే జియో కూడా ఇన్వెస్టర్ల సంపదను భారీగా వృద్ధి చేస్తుంది. గత పదేళ్లలో డేటాను అందరికీ అందుబాటులోకి తెచ్చినట్లుగానే, రాబోయే దశాబ్దంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), క్లౌడ్, స్పేస్‌ కనెక్టివిటీ వంటి అధునాతన సాంకేతికతలను భారత ప్రజలందరికీ చేరువ చేస్తాము. ఒకప్పుడు సాంకేతిక వినియోగదారుగా ఉన్న భారత్, నేడు సృష్టికర్తగా అవతరించింది. త్వరలోనే జియోను ప్రపంచంలోని అత్యున్నత సాంకేతిక కంపెనీలలో ఒకటిగా నిలిపి, మన త్రివర్ణ పతాకాన్ని గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్తాము’’ అని జియో ఎండీ ఆకాశ్‌ అంబానీ తెలిపారు.

ఇదీ చ‌ద‌వండి: కొడుకు స్పీచ్‌.. ముఖేష్ అంబానీ ఎమోష‌న‌ల్‌

చరిత్ర పునరావృతమైంది: ఇషా అంబానీ 
 

దాదాపు 50 ఏళ్ల క్రితం రిలయన్స్‌ తొలి పబ్లిక్‌ ఇష్యూ వచ్చినప్పుడు మా నాన్న కూడా అందులో భాగమయ్యారు. సామాన్య కుటుంబాలు దేశ ఆర్థిక వృద్ధిలో యజమానులుగా భాగస్వాములు కావాలన్నదే మా తాతగారు ధీరూభాయ్‌ ఆశయం. నేడు ఆ నమ్మకం, చరిత్ర పునరావృతం అయ్యాయి. 

గత 13 ఏళ్లలో జియోను దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థగా తీర్చిదిద్దడానికి ఆకాశ్‌ పడ్డ శ్రమకు సోదరిగా ఎంతో గర్విస్తున్నాను. గత ఏడాది జియో సుమారు 15.5 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది’’ అని డైరెక్టర్‌ ఇషా అంబానీ పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement