రూ.5 చిప్స్ వివాదం.. కంపెనీకి షాక్! | Only 4 Grams Chips In 15 Grams Lays Packet Jaipur Man Gets Rs 8000 Compensation | Sakshi
Sakshi News home page

రూ.5 చిప్స్ వివాదం.. కంపెనీకి షాక్!

Oct 29 2026 4:02 PM | Updated on Oct 29 2026 4:06 PM

Only 4 Grams Chips In 15 Grams Lays Packet Jaipur Man Gets Rs 8000 Compensation

ప్యాకెట్ ఫుడ్స్ కొనేటప్పుడు కొన్నిసార్లు మోసాలు జరుగుతూ ఉంటాయి. తక్కువ క్వాంటిటీ ఉండటం, డేట్ ఎక్స్‌పైరీ అయి ఉండటం లేదా పురుగులు పట్టి ఉండటం మొదలైవని అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు చాలామంది లైట్ తీసుకుని వదిలేస్తారు. కానీ జైపూర్‌కు చెందిన ఒక వ్యక్తి మాత్రం ఐదు రూపాయల చిప్స్ ప్యాకెట్ వివాదంపై రూ.8000 పరిహారం పొందాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అసలు విషయానికి వస్తే.. జైపూర్‌కు చెందిన చంద్ర‌మన్ జలాన్ 2020 నవంబర్ 10న తన ఇంటికి వచ్చిన అతిథుల కోసం స్నాక్స్ అందించేందుకు కొన్ని ఆహార పదార్థాలను కొనుగోలు చేశారు. అందులో రూ.5 విలువైన లేస్ చిప్స్ ప్యాకెట్ కూడా ఉంది.

11 గ్రాములు తక్కువ
అయితే.. అతిథులకు చిప్స్ ఇస్తున్న సమయంలో ప్యాకెట్ చాలా తేలికగా అనిపించడంతో ఆయనకు అనుమానం వచ్చింది. వెంటనే ప్యాకెట్‌లోని చిప్స్‌ను తూకం వేయగా, ప్యాకెట్‌పై 15 గ్రాముల బరువు అని ఉన్నప్పటికీ, అందులో కేవలం 4 గ్రాముల చిప్స్ మాత్రమే ఉన్నాయని తెలుసుకున్నాడు. అంటే సూచించిన బరువు కంటే 11 గ్రాములు తక్కువగా ఉన్నాయన్నమాట.

తక్కువ బరువు ఉండటంతో.. జలాన్ దాన్ని కొనుగోలు చేసిన మెట్రో క్యాష్ అండ్ క్యారీ సంస్థను సంప్రదించారు. కానీ అక్కడ సరైన పరిష్కారం లభించకపోవడంతో.. వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. 2022 ఏప్రిల్ 6న ఫిర్యాదు దాఖలు చేశారు.

ఈ కేసును విచారించిన జైపూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్-II కీలక నిర్ణయం తీసుకుంది. రిటైలర్ అయిన మెట్రో క్యాష్ అండ్ క్యారీ కేవలం ఉత్పత్తిని విక్రయించిందని, ప్యాకెట్‌లో చిప్స్ తక్కువగా ఉండటానికి సంబంధించిన బాధ్యత తయారీ సంస్థదేనని పేర్కొంది. దీంతో రిటైలర్‌పై ఉన్న ఫిర్యాదును కొట్టివేసింది.

రూ.8000 పరిహారం
కాగా.. పెప్సికో సంస్థకు నోటీసులు అందినా విచారణకు హాజరు కాలేదు. అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన కమిషన్, కంపెనీపై వచ్చిన ఫిర్యాదును అనుమతించింది. 2026 సెప్టెంబర్ 17న వెలువడిన ఉత్తర్వుల ప్రకారం.. పెప్సికో కంపెనీ ఫిర్యాదుదారునికి రూ.8000 పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇందులో మానసిక వేదనకు రూ.5,000, మరో రూ.3,000 కేసు ఖర్చుల కింద చెల్లించాలి.

అంతే కాకుండా.. చిప్స్ ప్యాకెట్ ధర అయిన ఐదు రూపాయలకు, 2022 ఏప్రిల్ 6 నుంచి పరిహారం చెల్లించే వరకు 6 శాతం వార్షిక వడ్డీతో తిరిగి ఇవ్వాలని కమిషన్ ఆదేశించింది. ఉత్తర్వులు వెలువడిన నెల రోజుల్లోపు చెల్లింపులు చేయకపోతే, వర్తించే మొత్తంపై ఉత్తర్వుల తేదీ నుంచి 6 శాతం వార్షిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: ఉద్యోగులకు అలర్ట్.. శ్రీధర్ వెంబు సంచలన వ్యాఖ్యలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement