ఓ ఆఫీస్ ట్రిప్‌లో జరిగిన చిన్న ఘటన.. ఓ సీనియర్ టెక్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాన్నే పోగొట్టింది. కానీ అక్కడితో ఈ కథ ముగియలేదు. తనకు ఉన్న అటెన్షన్ డిఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ కారణంగానే తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె కోర్టును ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఆమె వాదనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె అడుగుతున్న పరిహారం మొత్తం కార్పొరేట్ రంగంలోనే సంచలనంగా మారింది.
గిట్‌పాడ్ అనే టెక్ కంపెనీలో ఇంజినీరింగ్ విభాగానికి షానన్ బర్న్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఒకప్పుడు పని చేశారు. 2023 ఏప్రిల్‌లో ఆస్ట్రియాలోని లోఫర్‌లో కంపెనీ నిర్వహించిన టీమ్ బిల్డింగ్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఆ సమయంలో ఆమె మద్యం సేవించారు. అనంతరం తన గది తాళం మరిచిపోవడంతో గదిలోకి వెళ్లలేకపోయారు. చివరకు ఆ రాత్రి హోటల్‌లోని సౌనా (అంటే వేడి ఆవిరి గదిలో) నిద్రించాల్సి వచ్చింది. ఈ ఘటన తర్వాత యాజమాన్యం ఆమె చర్యను తీవ్రంగా పరిగణించింది.
గిట్‌పాడ్ సీఈఓ జోహన్నెస్ ల్యాండ్‌గ్రాఫ్.. ఆమె వృత్తిపరమైన బాధ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఏడాది జూన్‌లో బర్న్స్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. ADHD అంటే ఏకాగ్రత లోపం, అతి చురుకుదనానికి సంబంధించిన న్యూరో డెవలప్‌మెంటల్ పరిస్థితి.. తనకు ఉన్న వైకల్యం కారణంగానే ఉద్యోగం కోల్పోయానని బర్న్స్ బర్మింగ్‌హామ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. 2025లో ట్రిబ్యునల్ ఆమె వాదనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమెను వైకల్యాలకు సంబంధించిన కారణాలతోనే ఉద్యోగం నుంచి తొలగించినట్లు తేల్చింది.

దీంతో ఇక తనకు జరిగిన నష్టానికి పరిహారం కోరే ప్రక్రియ మొదలైంది. ఇందులో కేవలం అప్పటి జీతాన్ని మాత్రమే కాకుండా.. భవిష్యత్‌లో కోల్పోయే ఆదాయం, ఈక్విటీ తదితర నష్టాలను కూడా బర్న్స్ లెక్కలోకి తీసుకున్నారు. బర్న్స్ దాఖలు చేసిన లెక్కల ప్రకారం ఆమె కోరుతున్న పరిహారం ఎంతో తెలుసా?.. 76 మిలియన్ పౌండ్లు. అక్షరాల మన కరెన్సీలో రూ.9,637 కోట్లకు సమానం.
ఉద్యోగం కోల్పోవడం వల్ల భవిష్యత్‌లో తాను కోల్పోయే సంపాదనను ఈ మొత్తంగా లెక్కించినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. బ్రిటన్‌లోని ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్ ముందు ఇంత భారీ మొత్తాన్ని క్లెయిమ్ చేసిన కేసు అత్యంత అరుదైనదిగా నిలిచింది. అయితే గిట్‌పాడ్ ఈ మొత్తాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. పరిహారం క్లెయిమ్‌ను రూ.12.68 కోట్లకే(1 మిలియన పౌండ్) పరిమితం చేయాలని కంపెనీ కోరింది. అంతకంటే ఎక్కువ మొత్తం పొందే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వాదించింది. బర్న్స్ లెక్కలను కంపెనీ ‘అసాధారణమైనవి’గా అభివర్ణించింది.
షేర్ల విలువ కూడా లెక్కలోకి..
ఇక్కడే ఈ కేసు మరో మలుపు తిరిగింది. బర్న్స్‌కు గిట్‌పాడ్‌లో 0.85 శాతం షేర్లు ఉన్నట్లు ట్రిబ్యునల్ విచారణలో వెల్లడైంది. ఈ వాటా ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు రూ.32.61 కోట్లు విలువ ఉంది. అలాగే గిట్‌పాట్‌ను ఓపెన్‌ఏఐ రూ.3,836.76 కోట్లకు కొనుగోలు చేసే చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఈ లెక్కన.. నాలుగేళ్లలో గిట్‌పాడ్‌లో ఆమెకున్న వాటా విలువ రూ.267.13 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఈ లెక్కలనే జడ్జి రేచల్ వెడ్డర్స్‌పూన్ తాజాగా పేర్కొన్నారు. కాబట్టి ఆమె పిటిషన్ విచారణకు అర్హత ఉందనేది తేల్చి చెప్పింది. దీంతో ఆమె తన భారీ పరిహారం క్లెయిమ్‌ను కొనసాగించేందుకు అవకాశం లభించినట్లైంది.
బర్న్స్ ప్రస్తుతం టెక్ రంగానికి దూరంగా ఉన్నారు. థెరపిస్ట్‌గా మారేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. ఉద్యోగం పోయిన ఓ ఘటనతో మొదలైన ఈ వివాదం.. ఇప్పుడు బ్రిటన్‌లోనే కాదు యావత్ కార్పొరేట్ ప్రపంచంలోనే భారీ పరిహారం క్లెయిమ్‌గా మారడం ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: డబుల్ గేమ్‌తో భారత్‌కు కష్టమేనా?


